మనవడి ఆట.. తాతకు టోకరా!
ABN , First Publish Date - 2021-12-16T08:06:45+05:30 IST
చిన్నారులు తెలిసీ తెలియక మొబైల్‌ఫోన్‌లో చేస్తున్న పనులు, గేమింగ్ సంస్థలకో లేక సైబర్ నేరగాళ్లకో దోపిడీ మార్గాలుగా మారుతున్నాయి.
- తాత స్మార్ట్‌ఫోన్‌లో ఆన్‌లైన్ ఆటలు
- తాత ఖాతా నుంచి రూ. 11.50లక్షలు మాయం 5 నెలల్లో డబ్బు వెనక్కి రప్పించిన సైబరాబాద్ పోలీసులు
హైదరాబాద్ సిటీ, డిసెంబర్ 15 (ఆంధ్రజ్యోతి): చిన్నారులు తెలిసీ తెలియక మొబైల్‌ఫోన్‌లో చేస్తున్న పనులు, గేమింగ్ సంస్థలకో లేక సైబర్ నేరగాళ్లకో దోపిడీ మార్గాలుగా మారుతున్నాయి. రాజేంద్రనగర్‌కు చెందిన మాజీ పోలీసు అధికారి సయ్యద్ అస్గర్ అలీకి ఐదు నెలల క్రితం ఇది అనుభవపూర్వకంగా అర్థమైంది. ఆయన మనవడి ఆన్‌లైన్ ఆటలకు ఆయన రూ. 11.50 లక్షలను ఓ గేమిం గ్ సంస్థకు కోల్పోయారు. అయితే.. సైబరాబాద్ పోలీసులు సమర్థతతో ఆ మొత్తం తిరిగి ఆయనకు చేరింది. విశ్రాంత ఏఎస్సై అయిన అస్గర్, తనకు ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బును బ్యాంకు ఖాతాలో భద్రపరుచుకున్నారు. ఆలీ మనవడు(8) తరచూ ఫోన్లో ఆన్‌లైన్ గేమ్స్ ఆడేవాడు. ఈ క్రమంలో సింగపూర్‌కు చెందిన ఓ ఆన్‌లైన్ గేమింగ్ సంస్థకు చెందిన ఆటను డౌన్‌లోడ్ చేసుకున్నాడు.
ఆటలో మరింతగా ముందుకు వెళ్లేందుకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఫోన్‌లో సయ్యద్ బ్యాంకు ఖాతా యాప్ ఉండటంతో.. దాన్ని లింక్ చేసిన బాలుడు, ఆటలో వచ్చిన ప్రతి ఆప్షన్‌నూ ఓకే చేసి డబ్బులు చెల్లించేశాడు. దీంతో విడతలవారీగా మొత్తం రూ. 11.50లక్షలు గేమింగ్ సంస్థకు చేరాయి. ఈ విషయాన్ని ఆ లస్యంగా గుర్తించిన సయ్యద్, సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాంకేతిక ఆధారాలను బట్టి రంగంలోకి దిగిన పోలీసులు, దర్యాప్తు ప్రా రంభించారు. నిబంధనల ప్రకారమే, చట్టబద్ధంగానే తమ సంస్థ డబ్బులు తీసుకుందని గేమింగ్ సంస్థ ప్రతినిధులు వాదించారు. చిన్నారులను మోసం చేసి డబ్బులు ఇలా కొల్లగొట్టడమేంటంటూ పోలీసులు సంస్థ ప్రతినిధులతో వాగ్వాదానికి దిగారు. ఎట్టకేలకు ఆ సంస్థ ఉన్నతాధికారులు దిగి వచ్చి.. బాధితుడి డబ్బులను వెనక్కి ఇచ్చారు. ఐదు నెలలుగా పోరాడి, తన డబ్బు తనకు ఇప్పించారంటూ పోలీసులకు బాధితుడు కృతజ్ఞతలు తెలిపారు.