Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sun, 26 Jun 2022 03:14:01 IST

టీచర్ల ఆస్తులపై సర్కారు పిల్లిమొగ్గ!

twitter-iconwatsapp-iconfb-icon
టీచర్ల ఆస్తులపై సర్కారు పిల్లిమొగ్గ!

  • ఉపాధ్యాయులు ఏటా ఆస్తుల వివరాలు..
  • వెల్లడించాలంటూ 8న విద్యాశాఖ సర్క్యులర్‌
  • స్థిర, చర ఆస్తులు కొనాలన్నా, అమ్మాలన్నా..
  • అనుమతి తీసుకోవాలంటూ ఆదేశాలు
  • భగ్గుమన్న ఉపాధ్యాయ సంఘాలు, పార్టీలు
  • తీవ్ర వ్యతిరేకతతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
  • సర్క్యులర్‌ను నిలిపివేస్తున్నట్టు మంత్రి ప్రకటన
  • ఆస్తుల వెల్లడిపై ఇప్పటికే అమల్లో నిబంధనలు 


హైదరాబాద్‌, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు ఏటా తమ ఆస్తుల వివరాలు వెల్లడించాలంటూ పాఠశాల విద్యాశాఖ సర్క్యులర్‌ జారీ చేయడం వివాదానికి దారితీసింది. ఉపాధ్యాయుల ఆస్తుల వివరాల వెల్లడితోపాటు ఇకపై ఎటువంటి స్థిర, చర ఆస్తులు కొనుగోలు చేయాలన్నా, అమ్మాలన్నా అనుమతి తీసుకోవాలంటూ జారీ చేసిన ఉత్తర్వులపై ఉపాధ్యాయ సంఘాలు, రాజకీయ నేతలు భగ్గుమన్నారు. ఈ నెల 8న జారీ చేసిన ఉత్తర్వులు తాజాగా వెలుగులోకి రావడం, టీచర్ల వ్యతిరేకతతో వివాదంగా మారడంతో ప్రభుత్వం వెంటనే  యూటర్న్‌ తీసుకుంది. 


సర్క్యులర్‌ను నిలిపివేస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఇటీవల నల్లగొండ జిల్లా గుంటిపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జావీద్‌ అలీపై వచ్చిన ఆరోపణలే విద్యాశాఖ సర్క్యులర్‌ జారీ చేసేందుకు కారణమయ్యాయి. జావీద్‌ అలీ నిత్యం పాఠశాలకు హాజరుకాకుండా రాజకీయాలు, ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారంటూ విద్యాశాఖకు ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఫిర్యాదులపై విజిలెన్స్‌ అధికారులు విచారణ నిర్వహించి నివేదిక సమర్పించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరికీ వర్తించేలా విద్యాశాఖ ఈ నెల 8న (ఆర్‌సీ నంబరు 192-ఎస్టాబ్లి్‌షమెంట్‌-1/2022) సర్క్యులర్‌ను జారీ చేసింది. 


విద్యాశాఖ ఆదేశాలు ఇవీ..

విద్యాశాఖ సర్క్యులర్‌ ప్రకారం.. ఇకపై ఉపాధ్యాయులెవరైనా స్థిర, చర ఆస్తులు అమ్మాలన్నా, కొనాలన్నా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి. ఇప్పటికే ఉన్న ఆస్తులకు సంబంధించిన వివరాలనూ ప్రభుత్వానికి సమర్పించాలి. ఇల్లు, ప్లాటు, షాపు, ఖాళీ జాగా, (ఇంటిస్థలం), వ్యవసాయ భూమితోపాటు ఇతర స్థిర ఆస్తులు ఎన్ని ఉన్నాయి? ఎక్కడెక్కడ ఉన్నాయి? (సర్వే నంబర్లతో సహా), ఎవరి పేరిట ఉన్నాయి? ఎప్పుడు కొన్నారు? ఎంతకు కొన్నారు? ప్రస్తుతం వాటి విలువ ఎంత? కొనుగోలు చేయడానికి ఆదాయం ఎక్కడినుంచి వచ్చింది? వీటి కొనుగోలుకు అనుమతి తీసుకున్నారా? ఈ ఆస్తులపై వార్షిక ఆదాయం ఎంత వస్తుంది? వంటి వివరాలను సమర్పించాల్సి ఉంది. వీటితోపాటు కారు, మోటార్‌ సైకిల్‌, ఎలక్ర్టికల్‌ గూడ్స్‌, ఏసీ, టీవీ, వీసీఆర్‌, రిఫ్రిజిరేటర్లు, బంగారు ఆభరణాలు, పెట్టుబడులు, అందుబాటులో ఉన్న డబ్బు, డిపాజిట్లు, షేర్లు, బ్యాంకు బ్యాలెన్స్‌, ఫర్నిచర్‌, లైవ్‌ స్టాక్స్‌ వంటి వివరాలను కూడా వెల్లడించాల్సి ఉంటుంది. 


అయితే విద్యాశాఖ ఈ సర్క్యులర్‌ జారీ చేయడంపై ఉపాధ్యాయ సంఘాలతోపాటు రాజకీయ నేతలు మండిపడ్డారు. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని టీచర్లు ఉద్యమ కార్యాచరణకు సన్నద్ధమవుతున్న తరుణంలో ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకోవడం ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడమేనని ఎస్‌టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సదానందగౌడ్‌, పర్వత్‌రెడ్డి, టీపీటీఎఫ్‌ ప్రధాన కార్యదర్శి ముత్యాల రవీందర్‌ తదిరతరులు అభిప్రాయపడ్డారు. ఉపాధ్యాయుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. 


ఉపాధ్యాయులపై కక్షగట్టిన సీఎం..!

ప్రభుత్వ ఉపాధ్యాయులపై సీఎం కేసీఆర్‌ కక్షగట్టారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. టీచర్ల ఆస్తుల వివరాలు అడుగుతున్న కేసీఆర్‌.. సీఎం కాకముందు తన కుటుంబ ఆస్తులు, సీఎం అయ్యాక ఆస్తుల వివరాలను ఎందుకు ఏటా విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. సీఎంతోపాటు మంత్రులు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఏటా తమ ఆస్తుల వివరాలు వెల్లడించాలని ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. మరోవైపు ఒక ఉపాధ్యాయుడికి ఆస్తులున్నాయని టీచర్లందరినీ అనుమానించడం సరికాదని కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. టీచర్టు బదిలీల జీవో 317పై ఎక్కడ ఉద్యమిస్తారోనని ఆ సమస్యను పక్కదారి పట్టించేందుకే సర్క్యులర్‌ జారీ చేశారని ఆరోపించారు. ఇంత చిన్న రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీకి రూ.800 కోట్ల విరాళాలు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. కాగా, విద్యాశాఖ సర్క్యులర్‌పై మీడియాలో విస్తృతంగా ప్రచారం జరగడంతో అధికారులు తీసుకున్న ఈ నిర్ణయాన్ని నిలిపివేస్తున్నట్టు మంత్రి సబితా ఇంద్రారెడ్డి శనివారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. నిలిపివేత ఉత్తర్వులను వెంటనే జారీ చేయాలని అధికారులకు సూచించారు.


ప్రస్తుతం అమల్లో ఉన్నదే!

వాస్తవానికి ఉపాధ్యాయులు తమ ఆస్తుల వివరాలను సమర్పించడమన్నది ఎప్పటినుంచో అమల్లో ఉన్నదే. ప్రతి ఏడాది మార్చిలో టీచర్లు తమ ఆస్తుల వివరాలను ఆయా పాఠశాలల హెడ్‌మాస్టర్‌కుగానీ, ఎంఈవోకుగానీ సమర్పించాల్సి ఉంటుంది. వీటిని ఎంఈవోలు డీఈవోకు పంపించి, అక్కడ భద్రపరచాల్సి ఉంటుంది. ఆస్తులు, వస్తువుల కొనుగోలుకు అనుమతి కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రక్రియ సరిగ్గా జరగడంలేదని, చాలా మంది ఉపాధ్యాయులు ఈ వివరాలను సమర్పించడం లేదంటూ విజిలెన్స్‌ అధికారులు విద్యాశాఖకు తెలిపారు. ఈ మేరకే ఉపాధ్యాయుల నుంచి సమాచారాన్ని సేకరించడానికి సర్క్యులర్‌ను జారీ చేసినట్టు విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఉండే నిబంధనల మేరకే ఈ సమాచారాన్ని సేకరిస్తున్నట్టు తెలిపారు. 


వివాదాల టీచర్‌ జావీద్‌ అలీ 

నల్లగొండ : ఉపాధ్యాయుల ఆస్తులపై రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సర్క్యులర్‌ జారీకి కారణమైన  జావీద్‌ అలీ సర్వీస్‌ మొదటినుంచీ వివాదాలమయమే. దేవరకొండ పట్టణానికి చెందిన ఈయన తొలుత కానిస్టేబుల్‌. అయితే, మతపరమైన విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్న కారణంతో సస్పెండ్‌ చేశారు. 1996 డీఎస్సీలో ఉపాధ్యాయుడి (ఎస్జీటీ)గా ఎంపికయ్యారు. చందంపేట మండలం పెద్దమునిగల్‌ ప్రాథమిక పాఠశాల, తిమ్మాపూర్‌, కాట్రవానితండాలో  విధులు నిర్వర్తించి, ప్రస్తుతం గుంటిపల్లి పాఠశాలలో పనిచేస్తున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి మద్దతుగా తన వర్గంవారిని కూడగట్టడం, పదవిలో ఉన్న కీలక నాయకుడికి సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ జావిద్‌ అలీ స్థానికంగా తిరుగులేని శక్తిగా ఎదిగారు. ఈ క్రమంలోనే  రియల్‌ ఎస్టేట్‌లోకి ప్రవేశించి భారీగా ఆస్తులు కూడగట్టినట్లు ప్రచారం ఉంది. ఇదే అంశాన్ని విజిలెన్స్‌ అధికారులు సైతం నిర్ధారించారు. పాఠశాలకు గైర్హాజరవుతూ నేతల వెంట ప్రదక్షిణలు చేయడం, ఎన్నికల్లో ఒక నాయకుడిని గెలిపించేందుకు బహిరంగంగా ప్రయత్నాలు చేయడం వివాదాలకు కారణమైంది. ఆయన తీరుపై ఉపాధ్యాయ సంఘాలు పూర్తి ఆధారాలతో విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశాయి. దీంతో మూడు నెలల క్రితమే జావీద్‌ అలీ వేతనంలో మూడు ఇంక్రిమెంట్లు కోత విధించారు. కొంతకాలంగా తనపై విజిలెన్స్‌కు ఫిర్యాదులు వెళ్లడం, వారు పూర్తిస్థాయిలో విచారిస్తున్నారని తెలుసుకున్న జావీద్‌ తన ఆస్తులను బినామీల పేరున బదలాయించారని స్థానికంగా వందతులు షికార్లు చేస్తున్నాయి. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.