వయసులో ఉన్నప్పుడే పెళ్లి చేసుకోండి.. వైద్య విద్యార్థులకు గవర్నర్‌ సూచన

ABN , First Publish Date - 2022-06-29T17:23:53+05:30 IST

చదువు పూర్తయ్యేవరకు ఆగకుండా.. వైద్య విద్యార్థులు వయసులో ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలని రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సూచించారు...

వయసులో ఉన్నప్పుడే పెళ్లి చేసుకోండి.. వైద్య విద్యార్థులకు గవర్నర్‌ సూచన

యాదాద్రి, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): చదువు పూర్తయ్యేవరకు ఆగకుండా.. వైద్య విద్యార్థులు వయసులో ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలని రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లోని ఎయిమ్స్‌ ఆస్పత్రిలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ఎయిమ్స్‌లో ఏర్పాటు చేసిన అధునాతన సింథటిక్‌ క్యాడవర్‌తో కూడిన స్కిల్‌ ల్యాబ్‌, బర్తింగ్‌ సిమ్యులేటర్‌ను ఆమె ప్రారంభించారు. అదేవిధంగా ఆపరేషన్‌ శ్వస్త (ది సర్జికల్‌ జర్నీ), అనుసంధాన్‌ (ది ఎక్స్‌ప్లోరింగ్‌ ది అన్‌నౌన్‌) పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ ప్రసంగిస్తూ.. మెడిసిన్‌ మొదటి సంవత్సరంలో ఉండగా తన వివాహం జరిగిందని, అయినా అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించానని తెలిపారు. కానీ, ప్రస్తుతం మెడిసిన్‌ విద్యార్థులు చదువులు అయిపోయిన తర్వాత వివాహం చేసుకుంటున్నారని, ఆలస్యంగా చేయకుండా వయసులో ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలని సూచించారు. రాష్ట్రానికి ఎయిమ్స్‌ తలమానికం కానుందన్నారు. ఉచిత వైద్య శిబిరాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఎయిమ్స్‌ అందిస్తోన్న సేవలు అభినందనీయమన్నారు. 

Updated Date - 2022-06-29T17:23:53+05:30 IST