Advertisement
Advertisement
Abn logo
Advertisement
Jan 15 2022 @ 17:51PM

రాజ్ భవన్ లో ఘనంగా సంక్రాంతి సంబరాలు

హైదరాబాద్: రాజ్ భవన్ లో శనివారం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ సంక్రాంతి సంబరాలను పురస్కరించుకుని సంప్రదాయ పొంగల్ ప్రత్యేక వంటకం వండారు.రాజ్ భవన్ లోని తన నివాసమైన మెయిన్ హౌస్ ముందు ప్రత్యేకంగా వేసిన వంటశాలలో గవర్నర్ పొంగల్ వంటకాలు వండి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గవర్నర్ తెలంగాణ ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలంతా సుఖ, సంతోషాలతో, ఆరోగ్యంతో, సమృద్ధి తో సంక్రాంతి వేడుకలు జరుపుకోవాలని ఆశించారు. సమృద్ధిగా పంటలు పండించిన రైతన్నలకు ఈ సందర్భంగా గవర్నర్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలంతా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, మహమ్మారిని అదుపులో ఉంచుతూ... అన్ని జాగ్రత్తలతో, ఆరోగ్యకరంగా పండుగ జరుపుకోవాలని డాక్టర్ తమిళిసై సూచించారు.


కోవిడ్ వ్యాక్సినేషన్ లో మంచి ఫలితాలు సాధిస్తూ అందరికీ రక్షణ కల్పించడంలో ముందున్న కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.అలాగే 100% మొదటి డోసు కవరేజ్ సాధించి, రెండో డోసు కవరేజ్ లో కూడా మంచి ఫలితాలు సాధిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ అభినందించారు.ఆరోగ్య రంగంలో మంచి మౌలిక సదుపాయాల కల్పన ద్వారా కోవి డ్ సంక్షోభ సమయంలో ప్రజలకు అండగా ఉంటున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ అభినందించారు.ప్రజలు కూడా ప్రభుత్వాలకు సహకరించి, టీకా తీసుకుని, సరైన జాగ్రత్తలు పాటించినప్పుడు మాత్రమే ఈ కోవిడ్ మహమ్మారి నుండి రక్షణ పొందుతామని డాక్టర్ తమిళిసై స్పష్టం చేశారు.హెల్త్ కేర్ వర్కర్లు, 60 ఏళ్లు పైబడిన వారు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, అర్హులైన అందరూ ఈ   ముందస్తు  టీకా   డోసు కూడా తీసుకోవాలని గవర్నర్ పిలుపునిచ్చారు.


టీకా తీసుకోని వారికి మాత్రమే కోవిడ్ సోకినప్పుడు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి అని డాక్టర్ తమిళిసై వివరించారు.టీకాతో మంచి రక్షణ లభిస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు.ఈ సందర్భంగా మీడియా సిబ్బందికి గవర్నర్ స్వీట్లు, శాలువాలు అందజేసి సంక్రాంతి  శుభాకాంక్షలు తెలిపారు. ఆ తరువాత గవర్నర్ డాక్టర్ తమిళిసై, ఆమె భర్త ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సౌందరరాజన్, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి రాజ్ భవన్ గోశాల లోని గోవులకు ప్రత్యేక గో పూజలు చేశారు. గో పూజ తర్వాత రాజ్ భవన్ లోని అమ్మవారి ఆలయంలో గవర్నర్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు.ఈ వేడుకలలో గవర్నర్ సలహాదారుల తోపాటు, గవర్నర్ సెక్రెటరీ కె సురేంద్రమోహన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement