ప్రాథమిక బాధ్యతలు పట్టని ప్రభుత్వాలు

ABN , First Publish Date - 2021-05-27T05:48:33+05:30 IST

కరోనా బాధితులకు మెరుగైన చికిత్స అందించడం కోసం రాష్ట్రంలోని ప్రైవేట్ ఆసుపత్రులను ప్రభుత్వ పరిధిలోకి తీసుకునే అంశాన్ని పరిశీలించాలని హైకోర్ట్...

ప్రాథమిక బాధ్యతలు పట్టని ప్రభుత్వాలు

కరోనా బాధితులకు మెరుగైన చికిత్స అందించడం కోసం రాష్ట్రంలోని ప్రైవేట్ ఆసుపత్రులను ప్రభుత్వ పరిధిలోకి తీసుకునే అంశాన్ని పరిశీలించాలని హైకోర్ట్ సూచించడం ఆనందదాయకం. హైకోర్ట్ సూచనను అమలుపరచడం మాట అటుంచి కనీసం పరిశీలించే పనికైనా ఈ ప్రభుత్వం పూనుకుంటుందా అనేది అనుమానాస్పదం. ఒక్క కలం పోటుతో రాష్ట్రంలోని మద్యం వ్యాపారాన్నంతా తన పరిధిలోకి తెచ్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం, అదే పని విద్యావైద్య రంగాల్లో చేయకపోవడానికి కారణం, అటువంటి సంస్కరణ మూలంగా పాలక పెద్దలకు వ్యక్తిగతంగా ఎటువంటి ఆర్థిక లబ్ధి కలగకపోవడమే అనేది నిర్వివాదాంశం. కరోనా కల్లోలం మూలంగా ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న సిబ్బంది జీతాలు అందక నానాఅగచాట్లు పడుతున్నారు. వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఒక్క సంక్షేమ పథకమైనా చేపట్టిందా?


పౌరులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత. వైద్య రంగాన్ని మార్కెట్ శక్తులకు వదిలేయడం ప్రభుత్వం తన ప్రాథమిక బాధ్యతను విస్మరించడమే. దేశంలోని పౌరులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించకపోవడం వారికి జీవించే హక్కును నిరాకరించడమే అవుతుంది. వైద్య సేవలకై పౌరులు సొంతంగా భరించే వ్యయ నిష్పత్తిని పరిశీలిస్తే నేపాల్, భూటాన్, శ్రీలంక, పాకిస్తాన్ వంటి దేశాలకంటే భారతదేశం అధమస్థానంలో ఉండడం మన దేశ రాజకీయ వ్యవస్థ సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం. 


ఉత్పత్తి వ్యాపార రంగాల్లో ప్రభుత్వ ప్రాతినిధ్యం పరిమితంగానే ఉండాలంటూ భారతదేశాన్ని పూర్తి స్థాయి పెట్టుబడిదారీ సమాజంగా మార్చడంలో పాశ్చాత్య దేశాలను ఆదర్శంగా తీసుకుని అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న కేంద్ర ప్రభుత్వం, పౌరుల ప్రాణాల రక్షణ విషయంలోనూ, వారికి సంక్షేమం, సామాజిక భద్రత కలుగజేయడంలోనూ విదేశాలను ఆదర్శంగా తీసుకోకపోవడం, నిరాసక్తత ప్రదర్శించడం గర్హనీయం. 

గౌరాబత్తిన కుమార్ బాబు

Updated Date - 2021-05-27T05:48:33+05:30 IST