‘దూరం’.. భారం!

ABN , First Publish Date - 2022-01-29T08:23:41+05:30 IST

‘మాకూ జిల్లా కావాలి! జిల్లా కేంద్రంగా మా నగరమే ఉండాలి! మా రెవెన్యూ డివిజన్‌ను కొనసాగించాలి’... ఇలా రకరకాల డిమాండ్లు! వీటన్నింటి సంగతి ఎలా ఉన్నప్పటికీ... ‘దూరా భారం’ సమస్య పరిష్కరించడంపై సర్కారు దృష్టి పెట్టింది.

‘దూరం’.. భారం!

  • జిల్లా కేంద్రానికి సుదూరమైన మండలాలేవి?
  • 75 కిలోమీటర్లు దాటిన మండలాలు ఉన్నాయా?
  • వాటిని ఎలా సర్దుబాటు చేయవచ్చు?
  • కలెక్టర్ల నుంచి నివేదిక కోరిన సర్కారు
  • అసంతృప్తులు, ఆగ్రహాలపై ‘నిఘా’ నివేదిక
  • డివిజన్ల రద్దు తీరుపైనా వివాదం
  • కదిరి, కందుకూరు రద్దుపై జనాగ్రహం


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

‘మాకూ జిల్లా కావాలి! జిల్లా కేంద్రంగా మా నగరమే ఉండాలి! మా రెవెన్యూ డివిజన్‌ను కొనసాగించాలి’... ఇలా రకరకాల డిమాండ్లు! వీటన్నింటి సంగతి ఎలా ఉన్నప్పటికీ... ‘దూరా భారం’ సమస్య పరిష్కరించడంపై సర్కారు దృష్టి పెట్టింది. రద్దు పద్దులో కలిసిన కొన్ని డివిజన్లపైనా పునరాలోచించే అవకాశాలున్నట్లు సంకేతాలు పంపుతోంది. ‘‘కొత్తగా ప్రతిపాదించిన జిల్లా కేంద్రాలకు ఏ మండలం ఎంత దూరంలో ఉంది? 75 కిలోమీటర్లపైనే దూరం ఉన్న మండలాలు ఏవి? అవి ఏ జిల్లా, డివిజన్‌కు సమీపంలో ఉన్నాయి? అక్కడి సామాజిక, భౌగోళిక పరిస్థితులు ఏమిటి? దూరంగా ఉన్న ప్రాంతాల సర్దుబాటుకున్న ఆప్షన్లు ఏమిటి? మండలాల పునర్‌వ్యవస్ధీకరణతో సమస్య పరిష్కారం అవుతుందా? కొత్త మండలాల డిమాండ్‌లు ఏమిటి?’’ అనే అంశాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కలెక్టర్లను కోరినట్లు తెలిసింది. మరోవైపు ఇదే అంశంపై రెవెన్యూ శాఖ కూడా ఓ నివేదికను సిద్ధం చేస్తోన్నట్లు సమాచారం. 


లోపాలు సరిదిద్దాలి...

కొత్త జిల్లాల ఏర్పాటు, వాటి పేర్లు, రెవెన్యూ డివిజన్‌ల ఏర్పాటు, మండలాల విలీనం వంటి అంశాలపై సర్కారుకు నిఘా విభాగం కూడా నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. భూ పరిపాలనా ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) నుంచి కూడా ఓ నివేదిక వెళ్లింది. డివిజన్ల రద్దు, కొత్త డివిజన్లలో మండలాల విలీనంలో సమతుల్యత దెబ్బతినిందని, తీవ్రంగా వెనుకబడిన ప్రాంతాలు కొన్ని జిల్లా కేంద్రాలకు మరింత సుదూరంగా ఉండిపోయేలా ప్రతిపాదనలు ఉన్నాయని సర్కారుకు ఫిర్యాదులు వచ్చాయి. ఇటు రాజకీయవర్గాలు, అటు అధికారవర్గాల నుంచి ఈ తరహా సమాచారం వెళ్లింది. దీనికి తోడు రద్దుపద్దులో కలిసిన కందుకూరు, ధర్మవరం, ఎటపాక, కుకునూరు వంటి ప్రాంతాల్లో ఆందోళనలు మిన్నంటాయి. జిల్లాల ఏర్పాటు ఎలా ఉన్నా..  డివిజన్‌ల పునర్‌వ్యవస్ధీకరణే గందరగోళంగా మారి ప్రజల అసంతృప్తులకు కారణమవుతోందన్న నివేదికలు వెళ్లిన నేపథ్యంలో సర్కారు దీనిపై దృష్టిపెట్టినట్లు తెలిసింది.


ఇదేమి విభజన... 

అనంతపురం జిల్లాలో ధర్మవరం రెవెన్యూ డివిజన్‌ విభజనపై ఆ జిల్లా ప్రజాప్రతినిధుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. విభజనకు ముందు ధర్మవరంలో 8, కదిరిలో 12 మండలాలున్నాయి. ఇప్పుడు ధర్మవరం డివిజన్‌లో ధర ్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాలు... అంటే నాలుగే మిగిలాయి. ఇదే డివిజన్‌లోని చెన్నేకొత్తపల్లి, కనగానపల్లి, రామగిరి, రాప్తాడు మండలాలను ఇతర డివిజన్లలో కలిపారు. రామగిరిని కల్యాణదుర్గం డివిజన్‌లో... కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి, రాప్తాడును అనంతపురం డివిజన్‌లో కలపాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం 12 మండలాలతో ఉన్న పెద్ద డివిజన్‌ అయిన కదిరి ఇప్పుడు నామరూపాల్లేకుండా పోయింది. దాన్ని కొత్తగా ప్రతిపాదించిన పుట్టపర్తి డివిజన్‌ కిందకు మార్చారు. దీనిపై స్థానికంగా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని మండలాల వారికి పుట్టపర్తి సుదూరమవుతోందని, కదిరి డివిజన్‌ను కొనసాగించాలని గట్టిగా కోరుతున్నారు. ఇదిలాఉంటే, ప్రకాశం జిల్లాలోని కందుకూరు డివిజన్‌ కొనసాగింపు డిమాండ్‌ బలంగా వినిపిస్తోంది.


కలెక్టర్ల మాట వింటారా? 

కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా ఏ మండలం, ఏ డివిజన్‌ ఎలా ఉండాలి? అన్న అంశాలపై అంతకుముందే రెవెన్యూ శాఖ, జిల్లాల కలెక్టర్ల నుంచి పలు సందర్భాల్లో సర్కారుకు నివేదికలు అందాయి. వీటిని ఆయా సబ్‌కమిటీలు కూడా ఆమోదించాయి. అయితే, వీటిని తాజాగా ఆమోదించిన ప్రతిపాదనల్లో పూర్తిగా చేర్చలేదు. ఉన్నతస్థాయిలో పెద్దల జోక్యంతో ప్రతిపాదనలు అనేకం మారిపోయాయి. ఇప్పుడు రచ్చమొదలవడంతో మళ్లీ కలెక్టర్ల అభిప్రాయం కోరడం చర్చనీయాంశంగా మారింది. ఈ పరిస్థితుల్లో కలెక్టర్లు ఇచ్చే సలహాలను తీసుకుంటారా? వాటికి విలువ ఇస్తారా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ‘‘అసంతృప్తి చల్లారంటే కొంతలో కొంతయినా కలెక్టర్ల సిఫారసులను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కదిరి డివిజన్‌పై పునరాలోచన చేసే అవకాశం ఉంది’’ అని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. 


అసంబద్ధంగా జిల్లాల విభజన

మానవ హక్కుల వేదిక విమర్శ

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జిల్లాల విభజన అసంబద్ధంగా ఉందని, పార్లమెంటు నియోజకవర్గాల కేంద్రంగా విభజించడం సరికాదని మానవ హక్కుల వేదిక అభిప్రాయపడింది. జిల్లాల విభజనపై ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు వీఎస్‌ కృష్ణ, ఎ.చంద్రశేఖర్‌ పలు సూచనలు చేస్తూ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పరిపాలనా సౌలభ్యత, ప్రజలకు దగ్గరగా జిల్లా కేంద్రం ఉండాలనే ఉద్దేశంతో జిల్లాల విభజన ప్రక్రియ ప్రారంభించి, దానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. 

Updated Date - 2022-01-29T08:23:41+05:30 IST