పాతాళంలో ప్రభుత్వ పనితీరు

ABN , First Publish Date - 2020-09-08T09:39:05+05:30 IST

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అసమర్థ పాలనా నిర్వాహకాన్ని నీతి ఆయోగ్ నివేదిక కళ్ళకు కట్టింది. రాష్ట్రాల పనితీరు ఆధారంగా ప్రభుత్వ విధానాలను, వాణిజ్యాన్ని, ఎగుమతులను...

పాతాళంలో ప్రభుత్వ పనితీరు

జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలకు, బాధ్యత లేని పరిపాలనకు కోవిడ్ తిరోగమన వృద్ధి తోడు కావడంతో ఇకపై రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదు. రాబోయే మూడేళ్ళూ కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది, లేక ఇంకా దారుణమైన పరిస్థితి ఉంటుందని నిపుణుల అభిప్రాయం. కొత్త ఉద్యోగాల మాట ఎలా ఉన్నా పాత ఉద్యోగాలు కూడా పోయే పరిస్థితి. ఎన్నికలు సమీపించాక కొత్తగా వచ్చే పెట్టుబడులు కూడా ఉండవు. పారిశ్రామికాభివృద్ధిలో తొలి మూడు స్థానాల్లో ఉండే రాష్ట్రాన్ని అట్టడుగు మూడు స్థానాల్లోకి నెట్టిన ఘనత జగన్ ప్రభుత్వానిదే. నీతి ఆయోగ్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రొఫైల్ చూస్తే అదే స్పష్టం అవుతోంది.


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అసమర్థ పాలనా నిర్వాహకాన్ని నీతి ఆయోగ్ నివేదిక కళ్ళకు కట్టింది. రాష్ట్రాల పనితీరు ఆధారంగా ప్రభుత్వ విధానాలను, వాణిజ్యాన్ని, ఎగుమతులను ఇంకా మరో పదకొండు ఉప అంశాలను ఆధారంగా తీసుకుని నీతి ఆయోగ్ విడుదల చేసిన ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరు పాతాళంలోకి నెట్టబడింది. ఎగుమతుల సన్నద్ధత సూచీ 2020 ర్యాంకుల్లో దేశం మొత్తంమీద చూస్తే.. ఆంధ్రప్రదేశ్ 20వ స్థానంలోకి దిగజారగా తెలంగాణా 6వ స్థానాన్ని దక్కించుకుంది. దేశంలో అతిపొడవైన కోస్తా తీరాలు కలిగిన రాష్ట్రాల్లో మూడో రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ఎగుమతుల్లో పూర్తిగా చతికిలపడటం అంటే అది ప్రభుత్వం చేతగానితనమే. రాష్ట్రంలో 13 జిల్లాల్లో 9జిల్లాలు సముద్రతీరాన్ని కలిగి ఉన్నాయి. పొడవైన తీరప్రాంతంలో ఒక మేజర్ పోర్టు, 11 మైనర్ పోర్టులు, రోడ్డు, రైలు, విమాన మార్గాలు ఉన్నప్పటికీ ఈ అంశంలో ఆంధ్రప్రదేశ్ ఇంతగా వెనకబడిపోవటం అవమానకరం. ఈశాన్య రాష్ట్రాలు కూడా అధికంగా ఎగుమతులు చెయ్యగలిగాయి. ఆంధ్రప్రదేశ్ కంటే తక్కువ తీరప్రాంతం ఉన్న కేరళ, ఒడిస్సా ఎగుమతుల సన్నద్ధత సూచీలో 50 శాతం పైగా మార్కులు సాధించడం విశేషం. 


ప్రభుత్వ విధానం అంశంలో ఆంధ్రప్రదేశ్ 27.25 శాతం మార్కులతో 21వ ర్యాంకులో నిలిచింది. వ్యాపారపరంగా 50.46శాతం మార్కులు రాగా 16వ ర్యాంకులో నిలిచింది. ఎగుమతి వాతావరణం అంశంలో 21.46శాతం మార్కులు రాగా 19వ ర్యాంకులో నిలిచింది. పనితీరులో 28.27 శాతం మార్కులు రాగా 27వ ర్యాంకులో నిలిచింది. అన్ని రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఆంధ్రప్రదేశ్‌ది అట్టడుగు స్థానమే అని చెప్పాలి. రాజును బట్టే రాజ్యం, రౌతును బట్టే గుర్రం అన్న సామెతగా ప్రభుత్వాన్ని నడిపించే నాయకత్వం ఎంత బాధ్యతగా, సమర్థవంతంగా పని చేస్తే రాష్ట్రం అంతగా అభివృద్ధి చెందుతుంది.


తెలుగుదేశం సర్వసన్నద్ధంగా ఉంటూ, సమర్థ వ్యూహాలు అమలు చేసి ఆంధ్రప్రదేశ్‌ని అన్నింటా ఛాంపియన్‍గా నిలిపింది. ఫెర్ఫార్మెన్స్ కేటగిరీ నుంచి ఫ్రంట్ రన్నర్ కేటగిరీ వైపు ఏపీ పరుగెడుతుందని 2019–-2020 సంవత్సరానికి నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో ఆంధ్రప్రదేశ్ సాకారం దిశగా అడుగులేస్తున్నట్లు కూడా సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచీ 2019పై నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదికలో వెల్లడైంది. గత ప్రభుత్వం వేసిన అభివృద్ధి పునాదులన్నింటిని వైసిపి ప్రభుత్వం కూల్చి వేసింది. వైసిపి ప్రభుత్వ దుర్విధానాల మూలంగా పారిశ్రామిక రంగం పడకేసింది. ఈ పదిహేను నెలల్లో ఎగుమతుల విషయంలో ఏ విధమైన పురోగతి సాధించ లేకపోయారు. ఆకర్షణీయమైన పారిశ్రామిక విధానాన్ని రూపొందించలేక పోగా రాజకీయ కక్షతో గత ప్రభుత్వం తెచ్చిన విధానాన్ని రద్దు చేశారు. వైసిపి పారిశ్రామిక విధానంలో కొత్తదనం ఏమీ లేదు. ఈ విధానం ద్వారా ఇంతమందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పలేదు. విశాఖ–-చెన్నై, చెన్నై–-బెంగుళూరు ఇండస్ట్రియల్ కారిడార్లను ఎలా అభివృద్ధి చేస్తారో వివరించలేదు. అభివృద్ధి దృక్పథం ఈ ప్రభుత్వ పారిశ్రామిక విధానంలో మచ్చుకి కూడా లేదు. ఇది ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పాలసీ కాదు, డిస్ట్రక్టివ్ అప్రోచ్ పాలసీ. గత ప్రభుత్వ హయాంలో ఏపీకి వచ్చిన అనేకమంది పారిశ్రామికవేత్తలు ఇప్పటికే రాష్ట్రానికి దూరం అయ్యారు. కియా ఆగ్జిలరీ యూనిట్లు 17 వెనక్కిపోవడంతో, రూ.2,500కోట్ల పెట్టుబడులను, వేలాది ఉద్యోగాలను కోల్పోయాం. రాజధాని అమరావతి ప్రాంతంలో భూములు కేటాయించిన 130సంస్థలను వెళ్ళగొట్టడంతో 60వేల ఉద్యోగాలను కోల్పోయాం. ప్రభుత్వం ఉగ్రవాద ధోరణితో వ్యవహరిస్తుందని పారిశ్రామిక వర్గాలే అంటున్నాయి. ఈ దుస్థితికి ముఖ్యమంత్రి జగన్ నిరంకుశత్వమే కారణం.


ప్రభుత్వం ఎగుమతుల సన్నద్ధతపై నీతి ఆయోగ్ సూచీ ర్యాంకులను చూస్తే ఈ రెండేళ్లు ఎంత వృథా చేశారో అర్థం అవుతుంది. హోదా తెస్తామని, పరిశ్రమలు వస్తాయని యువతలో ఎన్నో ఆశలు కల్పించారు. ఉద్యోగాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న లక్షలాదిమంది యువతీ యువకులు దారుణంగా మోసపోయారు. వైసిపి పాలనలో ఉపాధి అనేది ఉత్త మాట అయిపోయింది. పాలకులపై నమ్మకం ఉంటేనే పెట్టుబడులు వస్తాయి, రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉంటేనే పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు వస్తేనే ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి కల్పనతోనే సేవారంగం అభివృద్ధి చెందుతుంది. ఈ మౌలిక సూత్రాన్ని వైసిపి నాయకులు గాలికి వదిలేసి అరాచక పాలన, కక్ష సాధింపు పాలన చేస్తుంటే పెట్టుబడులు పెట్టేందుకు ఎవరు ముందుకు వస్తారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది జగన్ రెడ్డికి అర్థంకాని అంశంగా మారింది. తెలుగుదేశం హయాంలో శాంతి, న్యాయం, పటిష్టమైన వ్యవస్థల విభాగంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉన్నట్లు నీతి ఆయోగ్ నివేదికలో వెల్లడైంది. టిడిపి ఐదేళ్ళ పాలనలో రాష్ట్రాన్ని పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చాం. పెట్టుబడులు సాధించడంలో ఇతర రాష్ట్రాలకు అందనంత దూరంలో నిలిచింది ఆంధ్రప్రదేశ్. పాలసీలు తేవచ్చు, ప్రకటనలతో హోరెత్తించవచ్చు అంతటితో ఆగిపోదు. నది వద్దకు వచ్చిన గుర్రం చేత నీళ్ళు తాగించే సమర్థత ఉండాలి. వనరులు, పరిశ్రమల ఏర్పాటులో కల్పించే ప్రోత్సాహాకాలను బట్టి; నాయకుడి చిత్తశుద్ధి, సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టి పరిశ్రమల ఏర్పాటుకు పెట్టుబడిదారులు సుముఖత చూపిస్తారు. ఆ విధంగానే ఏడాదికి రూ.2లక్షల కోట్ల పైబడి చొప్పున ఐదేళ్ళలో రూ.10లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రాబట్టాం. టిడిపి ప్రభుత్వమే అధికారంలోకి వచ్చిఉంటే, ఈ 15నెలల్లో మరో రెండున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చేవి. ఆ వచ్చేవాటిని రానివ్వకుండా, వచ్చిన రెండున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను కూడా వెనక్కిపోయేలా చేసింది వైసిపి ప్రభుత్వం. రాష్ట్ర పారిశ్రామిక రంగానికి రూ.5లక్షల కోట్ల నష్టం తెచ్చింది.


గత ప్రభుత్వం పారిశ్రామికాంధ్ర ఆవిష్కారానికి అన్ని విధాలా అవిరళ కృషి చేసింది. అయిదేళ్లలో 3 సమ్మిట్లతో పాటు అనేక అంతర్జాతీయ సదస్సులు నిర్వహించింది. భారత వాణిజ్య యవనికపై చంద్రబాబు తనదైన ముద్ర వేశారు. ఆయన బ్రాండ్ తోనే పెట్టుబడులు బారులు తీరాయి. ఆటో మొబైల్ రంగంలో ఇసుజు, కియా, అపోలో టైర్లు, అశోక్ లేలాండ్, హీరో; ఐటి, సెల్ ఫోన్ తయారీ రంగంలో ఫాక్స్‌కాన్, సెల్‌కాన్, ఫ్లేక్స్ ట్రానిక్స్, డిక్సన్, రిలయన్స్, టీసియల్, ఒల్టాస్ వంటి సంస్థలు వచ్చాయి. రాజధాని కూడా లేని రాష్ట్రం పారిశ్రామికంగా ఇలా దూసుకెళ్ళటం అందరినీ ఆశ్చర్యపరిచింది. కానీ వైసిపి ప్రభుత్వం వచ్చాక ఒక సమ్మిట్ అయినా నిర్వహించలేదు, అంతర్జాతీయ సదస్సుకు రాష్ట్రాన్ని వేదిక చెయ్యలేకపోయింది. జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలకు, బాధ్యత లేని పరిపాలనకు కోవిడ్ తిరోగమన వృద్ధి తోడు కావడంతో ఇకపై రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదు. రాబోయే మూడేళ్ళూ కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది, లేకా ఇంకా దారుణమైన పరిస్థితి ఉంటుందని నిపుణుల అభిప్రాయం. వైసిపి వైఫల్యాల వల్ల 2024 దాకా పారిశ్రామిక వృద్ధి రేటు ఇంతకన్నా ఘనంగా ఏమీ ఉండదు. కొత్త ఉద్యోగాల మాట ఎలా వున్నా పాత ఉద్యోగాలు కూడా పోయే పరిస్థితి. ఎన్నికలు సమీపించాక కొత్తగా వచ్చే పెట్టుబడులు కూడా ఉండవు. పారిశ్రామికాభివృద్ధిలో తొలి మూడు స్థానాల్లో ఉండే రాష్ట్రాన్ని అట్టడుగు మూడు స్థానాల్లోకి నెట్టిన ఘనత జగన్ ప్రభుత్వానిదే. నీతి ఆయోగ్ లో ఆంధ్రప్రదేశ్ ప్రొఫైల్ చూస్తే అదే స్పష్టం అవుతోంది. ఇంత దారుణమైన పరిస్థితి గతంలో ఎన్నడూ లేదు. 


ఒక విభిన్నమైన సందర్భంలో అసాధారణమైన భాధ్యతను తలకెత్తుకున్న తెలుగుదేశం ప్రభుత్వం కాంక్రీట్ వ్యూహాలతో భావి అవసరాలను అందుకొనే భారీ ప్రణాళికలు వేసింది. కానీ వైసిపి ప్రభుత్వంలో ఫోకస్డ్ అప్రోచ్ లోపించింది. పెట్టుబడులను ఆకర్షించడం, పారిశ్రామికీకరణ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, యువత నైపుణ్యాభివృద్ధి... ఈ అంశాలన్నింటినీ పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. వైసిపి ప్రభుత్వానికి అటు సమర్థత లేదు, ఇటు సన్నద్ధత లేదు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రణాళికాబద్ధమైన విధానాలు అమలు జరిపినప్పుడే రాష్ట్రాభివృద్ధికి బాటలు పడతాయి. ప్రజలు సుఖశాంతులతో జీవిస్తారు. అంతే తప్ప ద్వేషపూరితంగా, ప్రతీకారేచ్ఛతో రాజకీయాలకు పాల్పడితే రాష్ట్రానికి కీడే తప్ప, మేలు జరగదు. దానికి జగన్ పరిపాలనే ఉదాహరణ. అస్తవ్యస్త, అసమర్థ జగన్ పరిపాలనలో ఆర్థికాభివృద్ధి పతనం అయింది. జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలకు రాష్ట్రం మూల్యం చెల్లించాల్సి వచ్చింది. భావి తరాలు తీవ్రంగా నష్టపోయే దుస్థితి దాపురించింది.

యనమల రామకృష్ణుడు

ప్రతిపక్షనాయకుడు, శాసనమండలి

Updated Date - 2020-09-08T09:39:05+05:30 IST