మనోళ్లెవరు?

ABN , First Publish Date - 2022-05-18T07:44:18+05:30 IST

ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి ముందు 2018లో ప్రభుత్వం భారీగా ఐఏఎ్‌సలను బదిలీ చేసిన విషయం గుర్తుందా...

మనోళ్లెవరు?

  • ఐఏఎస్‌ అధికారుల పనితీరుపై సర్కారు ఆరా
  • పథకాల అమలు, పాలనా దక్షతపై సమాచార సేకరణ
  • అధికార పార్టీ నేతలు, ప్రతిపక్ష నాయకులతో బంధంపైనా
  • సేకరణ బాధ్యత ఇంటెలిజెన్స్‌ విభాగానికి అప్పగింత
  • వారం రోజులుగా క్షేత్రస్థాయిలో అధికారులు నిమగ్నం
  • విధేయులనుకున్న వారికి ఫోకల్‌ పాయింట్లలో పోస్టింగ్‌
  • 2018లో ముందస్తుకు ముందూ ఇటువంటి కసరత్తు


హైదరాబాద్‌, మే 17 (ఆంధ్రజ్యోతి): ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి ముందు 2018లో ప్రభుత్వం భారీగా ఐఏఎ్‌సలను బదిలీ చేసిన విషయం గుర్తుందా!? అప్పట్లో 50 మందికిపైగా అధికారులను బదిలీ చేసింది. ఇప్పుడు కూడా అటువంటి కసరత్తే చేస్తోంది! ఐఏఎస్‌ అధికారుల్లో ‘మనోళ్లెవరు?’ అని ఆరా తీస్తోంది. ఒకవేళ ముందస్తుకు వెళితే.. తమకు విధేయులని అనుకున్న వారికి ఫోకల్‌ పాయింట్లలో పోస్టింగ్‌ ఇచ్చేందుకే ఈ కసరత్తు చేస్తోందని అధికార వర్గాలు చెబుతున్నాయి. సమాచార సేకరణ పూర్తయ్యాక పెద్ద ఎత్తున ఐఏఎస్‌ అధికారుల బదిలీలు చేపట్టనుందన్న చర్చ ఐఏఎస్‌ల లాబీలో సాగుతోంది. వాస్తవానికి, ఏ ప్రభుత్వంలోనైనా కొంత మంది ఐఏఎ్‌సలు ప్రభుత్వ పెద్దలకు విశ్వాసపాత్రులుగా ఉంటారు. మరికొందరు ‘కొరకరాని కొయ్య’లుగా ముద్ర పడుతుంటారు. విశ్వాసపాత్రులు, సన్నిహితులు, నమ్మినబంట్లకు ప్రభుత్వాలు మంచి పోస్టింగులు ఇచ్చి, వారితో ‘కాగల కార్యాన్ని’ చేయించుకుంటాయి.


క్షేత్రస్థాయిలో పథకాల అమలు సహా ఎన్నికల నిర్వహణలో వీరు అత్యంత కీలకంగా వ్యవహరిస్తూ ఉంటారు. ప్రభుత్వాల పనితీరుపై ప్రజల్లో ఒక అభిప్రాయం ఏర్పడడానికి అధికారుల వ్యవహార శైలి కూడా కారణమవుతూ ఉంటుంది. అందుకే, ఐఏఎస్‌, ఐపీఎ్‌సల బదిలీల విషయంలో ప్రభుత్వాలు పెద్ద కసరత్తే చేస్తుంటాయి. ముఖ్యంగా ఎన్నికల ముందు ఇలాంటి బదిలీలను భారీ స్థాయిలో చేపడుతుంటాయి. ఇప్పుడు సర్కారు అదే పని చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఐఏఎ్‌సల పనితీరును ఆరా తీయడానికి ఇప్పటికే ఇంటెలిజెన్స్‌ విభాగాన్ని రంగంలోకి దించింది. ఐఏఎ్‌సలపై పూర్తి సమాచారాన్ని సేకరించి ఇవ్వాలని చెప్పినట్లు తెలిసింది.


దీంతో, అధికారులు సమాచార సేకరణలో నిమగ్నమయ్యారు. వారం రోజులుగా ఈ కసరత్తు కొనసాగుతోంది. ఏ ప్రాంతంలో ఏ అధికారి పని చేస్తున్నారు? పరిపాలనలో వారి ఒరవడి ఎలా ఉంది? స్థానిక అధికార పార్టీ నేతలు, ప్రతిపక్ష నాయకులతో ఆయనకు బంధాలు, సత్సంబంధాలు ఎలా ఉన్నాయి? వ్యక్తిగత వ్యవహార శైలి ఎలా ఉంటుంది? సౌమ్యులా? కోపిష్టులా? మొండి ఘటాలా? సర్దుకుపోయే తత్వమా? సర్కారు చెప్పిన దానికి తలాడించే రకమా? రాజకీయ పార్టీ వాసనలేమైనా ఉన్నాయా? వారి తల్లిదండ్రులు, పూర్వీకులకు రాజకీయ నేపథ్యం ఉందా? తదితర వివరాలను ఆరా తీస్తున్నారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో వారి సంబంధాలు ఎలా ఉన్నాయి? ప్రజలతో ఎలా మమేకమవుతున్నారు? ప్రభుత్వ పథకాలను ఎలా అమలు చేస్తున్నారు? సమస్యలపై వారికున్న అవగాహన ఎలాంటిది? ఏదైనా కఠిన సమస్య తలెత్తినప్పుడు ప్రభుత్వం తరపున ‘ట్రబుల్‌ షూటర్‌’గా పని చేస్తారా? అన్న అంశాలను కూడా ఆరా తీస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ప్రధాన ఘటనలను ఎలా డీల్‌ చేశారు? 2018 ఎన్నికల సమయంలో ఎక్కడ పని చేశారు? ఎంత మేర ఉపయోగపడ్డారు? తదితర వివరాలను తెలుసుకుంటున్నారు. 


అధికారులు పని చేసే కార్యాలయాల వద్ద కింది స్థాయి సిబ్బందిని, క్షేత్ర స్థాయిలో ప్రజలు, పార్టీల నాయకులు, పాత్రికేయుల ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర క్యాడర్‌లో 159 మంది వరకు ఐఏఎస్‌ అధికారులున్నారు. వీరిలో 10 మంది వరకు కేంద్ర సర్వీసుల్లో కొనసాగుతుండగా.. మిగతావారు రాష్ట్రంలో వివిధ పోస్టుల్లో పని చేస్తున్నారు. వీరిలో ముఖ్యంగా సీనియర్‌ అధికారులపై ఇంటెలిజెన్స్‌ వర్గాలు దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. జిల్లా కలెక్టర్లలో విశ్వాసపాత్రులను గుర్తిస్తున్నాయి. ఇలా సేకరించిన సమాచారాన్ని త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సమర్పిస్తారని తెలిసింది. దానిని సాంతం పరిశీలించి ఆయన నిర్ణయం తీసుకునే అవకాశముంది. బదిలీల సమయంలో ఈ సమాచారాన్ని వినియోగించుకుంటారని తెలిసింది. రానున్న ఎన్నికల కోసమే ఈ సమాచారాన్ని సేకరించి పెట్టుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది. ఎన్నికలకు ముందు భారీ స్థాయిలో ఐఏఎ్‌సలను బదిలీ చేసి, విశ్వాసపాత్రులకు ఫోకల్‌ పాయింట్లలో పోస్టింగులు ఇస్తారని సమాచారం. సర్కారుతో అంతగా పడని అధికారులకు నాన్‌ ఫోకల్‌ పాయింట్లు దక్కే అవకాశముందని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Updated Date - 2022-05-18T07:44:18+05:30 IST