ద్వితీయ భాషగా సంస్కృతంపై ముందుకే..!

ABN , First Publish Date - 2022-04-04T10:29:07+05:30 IST

ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ద్వితీయ భాష (సెకండ్‌ లాంగ్వేజ్‌ సబ్జెక్టు)గా సంస్కృతాన్ని అమలు చేసే విషయంలో ముందుకే వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే కొత్తగా 150 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులను..

ద్వితీయ భాషగా సంస్కృతంపై ముందుకే..!

  •  ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో అమలుకు చర్యలు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ద్వితీయ భాష (సెకండ్‌ లాంగ్వేజ్‌ సబ్జెక్టు)గా సంస్కృతాన్ని అమలు చేసే విషయంలో ముందుకే వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే కొత్తగా 150 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులను మంజూరుచేయాలని కోరుతూ ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి ప్రభుత్వానికి తాజాగా ప్రతిపాదనలను సమర్పించారు. ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన వెంటనే ఈ పోస్టుల భర్తీ కోసం ప్రత్యేక ంగా నోటిఫికేషన్‌ను జారీ చేయనున్నారు. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కాలేజీల్లో ఇంటర్‌ స్థాయిలో ద్వితీయ భాషగా సంస్కృతం అమలు కానుంది. ప్రస్తుతం ప్రైవేట్‌ కాలేజీల్లో ద్వితీయ భాషగా సంస్కృతం అమల్లో ఉంది. ఒకట్రెండు ప్రభుత్వ కాలేజీల్లో మాత్రమే దీన్ని అమలు చేస్తున్నారు. ప్రభుత్వ పరిధిలోని అన్ని జూనియర్‌ కాలేజీల్లో సంస్కృతాన్ని ద్వితీయ భాషగా అమలుచేయాలని కోరుతూ ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత గతంలో ఇంటర్‌బోర్డుకు లేఖరాశారు. దీనిపై స్పందించిన అధికారులు సంస్కృతాన్ని ప్రవేశపెట్టడానికి మెమోను జారీ చేశారు. అయితే ఈ నిర్ణయాన్ని పలువురు విమర్శించారు. లెక్చరర్‌ పోస్టులు లేకుండా ఎలా అమలుచేస్తారని ప్రశ్నించారు. దీంతో కొంతకాలం నిర్ణయాన్ని వాయిదా వేశారు. తాజాగా రాష్ట్రంలో జేఎల్‌ పోస్టుల భర్తీకి ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో... సంస్కృతం లెక్చరర్ల పోస్టులను మంజూరు చేయాల్సిందిగా ప్రభుత్వానికి ఇంటర్‌ బోర్డు ప్రతిపాదనలను పంపించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 13 లెక్చరర్ల పోస్టులు ఉన్నాయని, వీటికి అదనంగా మరో 150పోస్టులను మంజూరు చేయాలని కోరారు. ఈ పోస్టుల భర్తీ కారణంగా జీతాల రూపంలో ఏడాదికి రూ.11.64కోట్ల వ్యయం అవుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఖాళీ గా ఉన్న లెక్చరర్ల పోస్టులను టీఎ్‌సపీఎస్సీ ద్వారా భర్తీ చేయబోతున్నారు. ఇంటర్‌ బోర్డు తాజా ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదిస్తే సంస్కృతం లెక్చరర్‌ పోస్టుల భర్తీకి కూడా త్వరలోనే నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉంది.


Updated Date - 2022-04-04T10:29:07+05:30 IST