రాష్ట్ర టీకాలొస్తున్నాయి!

ABN , First Publish Date - 2021-05-10T08:23:05+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా టీకాల కొనుగోలు ప్రక్రియను ప్రారంభించింది. వ్యాక్సిన్‌ ఉత్పత్తిదారులైన సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, భారత్‌ బయోటెక్‌ సంస్థలకు ఇండెంట్‌ పెట్టింది.

రాష్ట్ర టీకాలొస్తున్నాయి!

  • సొంతంగా కొనుగోలు చేస్తున్న సర్కార్‌
  • త్వరలోనే రాష్ట్రానికి 4.4లక్షల డోసుల రాక
  • సీరమ్‌, భారత్‌ బయోటెక్‌కు ఇండెంట్‌
  • వచ్చే వ్యాక్సిన్లన్నీ 18-44 వయసు వారికే!


హైదరాబాద్‌, మే 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా టీకాల కొనుగోలు ప్రక్రియను ప్రారంభించింది. వ్యాక్సిన్‌ ఉత్పత్తిదారులైన సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, భారత్‌ బయోటెక్‌ సంస్థలకు ఇండెంట్‌ పెట్టింది. సీరమ్‌కు రూ.11 కోట్లు, భారత్‌ బయోటెక్‌కు రూ.3 కోట్లు చెల్లించినట్లు సమాచారం. కొవిషీల్డ్‌ ఒక్కో డోసును రూ.300 చొప్పున, కొవాగ్జిన్‌ ఒక్కో డోసును రూ.400 చొప్పున రాష్ట్ర ప్రభుత్వాలకు విక్రయించనున్నాయి. డబ్బు చెల్లించిన వారంలోగా టీకాలు పంపుతామని వెల్లడించాయి. ఈ మేరకు నాలుగైదు రోజుల్లోనే 3.66 లక్షల కొవిషీల్డ్‌ డోసులు, 75 వేల కొవాగ్జిన్‌ డోసులు కలిపి మొత్తంగా 4.41 లక్షల డోసులు రాష్ట్రానికి రానున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ప్రతి నెలా కొవిషీల్డ్‌ డోసులు 6 కోట్లు, కొవాగ్జిన్‌ డోసులు కోటి ఉత్పత్తి అవుతున్నాయి.     సగం కేంద్రం తీసుకోగా, మిగిలినవాటిలో రాష్ట్ర ప్రభుత్వాలకు 30 శాతం, ప్రైవేటు ఆస్పత్రులకు 20 శాతం ఇవ్వాలన్న నిబంధన ఉంది. అంటే 2.10 కోట్ల డోసులను దేశంలోని అన్ని రాష్ట్రాలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.  ఇప్పటికే యూపీ, గుజరాత్‌, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఒడిశా, మధ్యప్రదేశ్‌, బిహార్‌, రాజస్థాన్‌, ఛత్తీ్‌సగఢ్‌, ఝార్ఖండ్‌ కొనుగోలు ఒప్పందాలు చేసుకోగా.. తెలంగాణ సైతం ఆ జాబితాలో చేరింది.


ఖరారు కాని మార్గదర్శకాలు

దేశవ్యాప్తంగా మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరూ టీకా తీసుకునే వెసులుబాటును కేంద్రం కల్పించింది. అయితే, 18-44 ఏళ్ల వయస్సు ఉన్న వారికి టీకా ఇచ్చే బాధ్యతను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపైనే పెట్టింది. వ్యాక్సిన్‌ను ఉత్పత్తి సంస్థల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలే నేరుగా కొనుగోలు చేసుకోవాలని స్పష్టం చేసింది. దీంతో దాదాపు అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం సైతం భారత్‌ బయోటెక్‌ ఎండీ ఎల్లా కృష్ణతో సమావేశమై, రాష్ట్రానికి ఎక్కువ డోసులు కేటాయించాలని కోరింది. టీకాలు సేకరించేందుకు టీఎ్‌సఎంఎ్‌సఐడీసీని నోడల్‌ ఏజెన్సీగా నియమించింది. మే నెలకు సంబంధించి తెలంగాణకు కేటాయించిన 4.40 లక్షల డోసులను వెంటనే పంపాలని టీఎ్‌సఎంఎ్‌సఐడీసీ లేఖ రాసింది. కాగా, రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న డోసులను 18-44 మధ్య వయస్సున్న వారికే అందించే అవకాశం ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఈ విషయమై ప్రభుత్వం మార్గదర్శకాలు ఖరారు చేసిన తర్వాతే వ్యాక్సినేషన్‌ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

Updated Date - 2021-05-10T08:23:05+05:30 IST