అప్పుల కోసం బాదుడు!

ABN , First Publish Date - 2020-10-01T07:44:23+05:30 IST

పదహారు నెలల్లో రూ.1,30,000 కోట్ల అప్పులు చేసి రికార్డు సృష్టించిన వైసీపీ ప్రభుత్వం.. తాజాగా మరో రూ.25,000 కోట్ల రుణం తేవడానికి రంగం సిద్ధం చేస్తోంది...

అప్పుల కోసం బాదుడు!

  • రుణం తేవడానికి కార్పొరేషన్‌ ఏర్పాటు
  • మరో 25 వేల కోట్ల 
  • రుణంపై సర్కారు కన్ను!
  • రాష్ట్రాభివృద్ధి సంస్థ ఏర్పాటుకు ఆర్డినెన్స్‌
  • జనంపై పన్నులు, సెస్‌ల బాదుడు
  • ఆ ఆదాయం సదరు కార్పొరేషన్‌కు బదిలీ
  • దాని ఆధారంగా బ్యాంకుల నుంచి రుణం
  • తొలుత మద్యంపై అదనపు పన్ను
  • తర్వాత పెట్రో ఉత్పత్తులపై మరోసారి


అమరావతి, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): పదహారు నెలల్లో రూ.1,30,000 కోట్ల అప్పులు చేసి రికార్డు సృష్టించిన వైసీపీ ప్రభుత్వం.. తాజాగా మరో రూ.25,000 కోట్ల రుణం తేవడానికి రంగం సిద్ధం చేస్తోంది. రుణ సమీకరణ కోసమే ఏకంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాభివృద్ధి సంస్థ (ఏపీ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌)ను ఏర్పాటు చేస్తూ మంగళవారం రాత్రి హుటాహుటిన ఆర్డినెన్స్‌ కూడా తెచ్చింది. తొలుత అదనపు పన్నులు, సెస్‌ను ప్రజల నుంచి వసూలు చేసి ఆ ఆదాయాన్ని ఈ కార్పొరేషన్‌కు బదలాయిస్తుంది. సదరు ఆదాయాన్ని కార్పొరేషన్‌ రాబడిగా చూపించి తద్వారా బ్యాంకుల నుంచి రూ.25,000 కోట్ల అప్పులు తీసుకురావడానికి ఆర్థిక శాఖ భారీ ప్రణాళిక వేసింది. ద్రవ్య నియంత్రణ-బడ్జెట్‌ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బీఎం) చట్టం ప్రకారం రుణపరిమితి అయిపోవడంతో అప్పులు తెచ్చుకోవడానికి కార్పొరేషన్‌ పేరుతో ఇలా కొత్త మార్గం సిద్ధం చేసింది. రాష్ట్ర అదనపు ఆదాయాన్ని ఆ కార్పొరేషన్‌ ఆదాయంగా చూపించి ఆర్థిక వనరులు సమీకరించాలని ఆ ఆర్డినెన్స్‌లో పేర్కొన్నారు. అదనపు ఆదాయం అంటే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ప్రస్తుతం పన్ను విధించుకోదగిన విభాగాలపై అదనపు పన్ను గానీ, అదనపు సెస్‌ గానీ విధిస్తారన్న మాట. అంటే త్వరలో మళ్లీ రాష్ట్ర ప్రజలకు పన్ను పోటు తప్పదన్న మాట.


మద్యం, పెట్రో సెస్‌లు...

జీఎ్‌సటీ అమల్లోకి వచ్చాక పన్ను విధించే అధికారం రాష్ట్రాలకు తగ్గిపోయింది. కేవలం మద్యం, పెట్రోలియం ఉత్పత్తులపై మాత్రమే అవి పన్ను లేదా సెస్‌ విధించగలవు. మద్యంపై అదనపు పన్ను విధించాలని జగన్‌ ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తర్వాత ఇంకోసారి పెట్రోలియం ఉత్పత్తులపై కూడా పన్ను లేదా సెస్‌ పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎలాంటి ఆదాయం లేని కార్పొరేషన్‌కు బ్యాంకులు రూ.25,000 కోట్ల రుణాలు ఎందుకిస్తాయనేది ప్రశ్నార్థకం. అయితే అదనపు ఆదాయం పేరుతో ఆ కార్పొరేషన్‌కు మళ్లించే నిధుల ఆధారంగా బ్యాంకులు రుణాలిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.


ఎలాంటి కారణం లేకుండా ప్రభుత్వం నుంచి ఒక కార్పొరేషన్‌కు నిధులు బదలాయించడం కుదరదు. ఒకవేళ ఆ కార్పొరేషన్‌ రాష్ట్రానికి ఏదైనా సేవ చేస్తే ఆ సేవకు ప్రతిఫలంగా ప్రభుత్వం ఏవైనా నిధులు చెల్లిస్తే అందులో 25 శాతం మొత్తాన్ని కార్పొరేట్‌ పన్ను కింద కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ కార్పొరేషన్‌ మనుగడ ఎన్నాళ్లు ఉంటుందని కొందరు అధికారులు సైతం అనుమానాలు వ్యక్తం చేశారు. మద్యం, పెట్రోలియం ఉత్పత్తులు ప్రస్తుతం జీఎ్‌సటీ పరిధిలో లేవు. భవిష్యత్‌లో వాటిని కూడా కేంద్రం జీఎ్‌సటీ పరిధిలోకి తెస్తే ఈ కార్పొరేషన్‌కు ఆదాయం ఎక్కడ నుంచి చూపిస్తారనేది ప్రధాన ప్రశ్న. బ్యాంకులు ఇలాంటి కార్పొరేషన్లకు, ప్రభుత్వాలకు ఇచ్చే రుణాల రీపేమెంట్‌కు 10-15 ఏళ్ల గడువు విఽధిస్తాయి. ఈ కాలంలో ప్రభుత్వ విధానాలు మారవని గ్యారెంటీ ఏమీ లేదని సదరు అధికారులు గుర్తుచేస్తున్నారు. ఈ కార్పొరేషన్‌ ఇప్పటికే ఎస్‌బీఐ కేపిటల్‌ను కన్సల్టెంట్‌గా నియమించుకుంది. ఫీజు కింద దానికి రూ.45 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది.

Updated Date - 2020-10-01T07:44:23+05:30 IST