26 జిల్లాల పాలన

ABN , First Publish Date - 2022-04-03T08:07:53+05:30 IST

కొత్త జిల్లాలు వచ్చేశాయ్‌! 13 జిల్లాల నవ్యాంధ్ర... ఇక 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌గా మారింది.

26 జిల్లాల పాలన

  • కొత్త జిల్లాలపై తుది నోటిఫికేషన్లు
  • రేపటి నుంచే అమలులోకి కొత్త జిల్లాలు
  • అర్ధరాత్రి దాటాక ఉత్తర్వులు.. శ్రీబాలాజీ కాదు ‘తిరుపతి జిల్లా’
  • ‘పార్వతీపురం మన్యం’ ఖరారు.. ఆఖర్లో కొన్ని మండలాల్లో మార్పులు
  • సమగ్ర స్వరూపం
  • 26 జిల్లాలు..
  • 73 రెవెన్యూ డివిజన్లు
  • 4 జిల్లాల్లో నాలుగేసి డివిజన్లు
  • 13 జిల్లాల్లో మూడేసి డివిజన్లు
  • 9 జిల్లాల్లో రెండేసి డివిజన్లు
  • 2014 బ్యాచ్‌ ఐఏఎస్‌లకు
  • కలెక్టర్లుగా బాధ్యతలు


(అమరావతి - ఆంధ్రజ్యోతి):  కొత్త జిల్లాలు వచ్చేశాయ్‌! 13 జిల్లాల నవ్యాంధ్ర... ఇక 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌గా మారింది. కొత్త జిల్లాలను ఖరారు చేస్తూ శనివారం అర్ధరాత్రి తర్వాత ప్రభుత్వం తుది నోటిఫికేషన్‌లు జారీ చేసింది. రెవెన్యూ శాఖ స్పెషల్‌ సీఎస్‌ జి.సాయిప్రసాద్‌ వీటిని విడుదల చేశారు. అంతకుముందు కొత్త జిల్లాలకు  కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు ఎస్పీలను నియమిస్తూ వేర్వేరుగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. అర్ధరాత్రి 12.10 గంటలకు శ్రీకాకుళం జిల్లాతో తొలి నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. తర్వాత ఒక్కో జిల్లాకు ఒక్కొటి చొప్పున నోటిఫికేషన్లు జారీ అవుతూ వచ్చాయి. సోమవారం నుంచి (ఏప్రిల్‌ 4) కొత్త జిల్లాలు అమలులోకి వస్తాయని ఆ ఉత్తర్వుల్లో తెలిపారు. కొత్త జిల్లాలను ప్రతిపాదిస్తూ జనవరి 25న ప్రభుత్వం తొలి నోటిఫికేషన్లు జారీ చేసింది. ఒక్కో లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలని స్థూలంగా నిర్ణయించుకుని... విస్తీర్ణం దృష్ట్యా అరకును మాత్రం రెండు జిల్లాలుగా విభజించింది. వెరసి... 13 జిల్లాలను 26కు పెంచింది. కొత్త జిల్లాల ప్రతిపాదనలపై మార్చి 7వ తేదీ వరకు అభ్యంతరాలు, సూచనలు స్వీకరించింది. మండలాలు, డివిజన్ల మార్పు, కూర్పుతోపాటు పేర్లపై సుమారు 12,600 అభ్యంతరాలు వచ్చాయి. సామాన్యుల అభ్యంతరాలను పెద్దగా పరిగణనలోకి తీసుకోలేదుకానీ... కీలక ప్రజా ప్రతినిధుల సూచనల మేరకు స్వల్ప మార్పులతో కొత్త జిల్లాలను ఖరారు చేసింది. కొన్ని జిల్లాల పరిధిలోని మండలాల్లో కొన్ని సవరణలు జరిగాయి. అలాగే.. ప్రాథమిక నోటిఫికేషన్లలోని కొన్ని జిల్లాల పేర్లలో చిన్న సవరణలు చేశారు. తిరుపతి కేంద్రంగా ‘శ్రీ బాలాజీ’ జిల్లా ఏర్పాటు చేయాలని తొలుత ప్రతిపాదించారు. దీనిని ఇప్పుడు ‘తిరుపతి జిల్లా’గానే ఉంచారు. అలాగే... ‘మన్యం’ జిల్లాకు బదులుగా ‘పార్వతీపురం మన్యం’ అనే పేరు ఖరారు చేశారు.


అంతా ఏకపక్షంగానే...

జిల్లాల ప్రకటనకు ముందుగానీ, ఆ తర్వాతగానీ ప్రభుత్వం ప్రజలు, ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలు సేకరించలేదు. సర్కారు స్థాయిలో అఖిలపక్ష సమావేశం నిర్వహించలేదు.  ‘ప్రజాభిప్రాయానికి విలువ ఇవ్వండి. నిర్ణయాలు తీసుకునే ముందు ప్రజలతో మాట్లాడండి’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పలు సమావేశాల్లో అధికారులకు దిశానిర్దేశం చేశారు. కానీ... క్షేత్రస్థాయిలో ఇవేవీ అమలు కాలేదు.


జంట కలెక్టర్లు..ఎస్పీలు

కలెక్టర్ల నియామకంలో ‘జంట’ విశేషాలు చోటు చేసుకున్నాయి. బాపట్ల, ప్రకాశం జిల్లాల కలెక్టర్లు విజయ, దినేశ్‌ కుమార్‌ భార్యాభర్తలు. అలాగే... కాకినాడ, కోనసీమ జిల్లాల కలెక్టర్లుగా నియమితులైన కృతికా శుక్లా, హిమాన్షు శుక్లా కూడా భార్యా భర్తలు కావడం విశేషం. ఐపీఎస్‌ దంపతులైన వకుల్‌ జిందాల్‌, మల్లికా గార్గ్‌ ఇప్పుడు బాపట్ల, ప్రకాశం జిల్లా ఎస్పీలుగా నియమితులయ్యారు. 

Updated Date - 2022-04-03T08:07:53+05:30 IST