అగ్రరాజ్యాన్ని ఆదుకునేలా గూగుల్ కీలక నిర్ణయం !

ABN , First Publish Date - 2021-01-26T22:53:30+05:30 IST

మహమ్మారి కరోనాతో సతమతమవుతున్న అగ్రరాజ్యం అమెరికాను ఆదుకునేలా ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ కీలక ప్రకటన చేసింది.

అగ్రరాజ్యాన్ని ఆదుకునేలా గూగుల్ కీలక నిర్ణయం !

వాషింగ్టన్: మహమ్మారి కరోనాతో సతమతమవుతున్న అగ్రరాజ్యం అమెరికాను ఆదుకునేలా ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ కీలక ప్రకటన చేసింది. దేశంలో విద్య ప్రచారానికి, అందరికీ కొవిడ్ వ్యాక్సిన్ సమంగా పంపిణీ జరిగేలా 150 మిలియన్ డాలర్లు ప్రకటించింది. వీటిలో 100 మిలియన్ డాలర్లు సీడీసీ ఫౌండేషన్‌, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఇతర స్వచ్చంధ సంస్థలకు ఇవ్వాలని నిర్ణయించినట్లు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తెలిపారు. అలాగే టీకాల గురించి తక్కువ వర్గాల వారు సమాచారం పొందేందుకు ప్రజారోగ్య సంస్థలతో భాగస్వామ్యం కోసం మరో యాభై మిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టాలని యోచిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 'ప్రజలందరికీ సమంగా వ్యాక్సిన్ పంపిణీ జరిపించాలనేదే మా ప్రయత్నం' అని ఈ సందర్భంగా పిచాయ్ పేర్కొన్నారు.


వైరస్‌తో అతలాకుతలమైన అమెరికాలో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు టీకాల విషయంలో వర్ణ వివక్షతకు గురవుతున్నట్లు మా దృష్టికి వచ్చిందని, ప్రధానంగా రూరల్ కమ్యూనిటీస్‌లో ఒకే ధరకు వ్యాక్సిన్ అందడం లేదని ఆయన ఆరోపించారు. టీకాల పంపిణీపై యూఎస్‌లో ఇటీవల వెలువడిన నివేదికలే దీనికి నిదర్శనం అన్నారు. అందుకే లాస్ ఏంజిల్స్, శాన్ ఫ్రాన్సిస్కో, కిర్క్‌లాండ్, వాషింగ్టన్, న్యూయార్క్ నగరాలలోని తమ భవనాలు, పార్కింగ్ లాట్స్, ఓపెన్ స్పేసేస్‌లో కొవిడ్-19 వ్యాక్సినేషన్ క్లినిక్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. వీటి ద్వారా ప్రజలకు విరివిగా టీకాలను అందుబాటులో ఉంచనున్నట్లు ఆయన తెలియజేశారు. చాలా తక్కువ సమయంలోనే వీటిని దేశవ్యాప్తంగా విస్తరింప చేస్తామన్నారు. అలాగే గూగుల్ మ్యాప్స్ ద్వారా టీకా పంపిణీ కేంద్రాల సమాచారాన్ని ప్రజలు చాలా సులువుగా తెలుసుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు పిచాయ్ తెలియజేశారు.       



Updated Date - 2021-01-26T22:53:30+05:30 IST