‘వర్క్ ఫ్రం హోం’ ఉద్యోగులకు గూగుల్ షాక్...

ABN , First Publish Date - 2021-08-11T21:49:01+05:30 IST

‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ఉద్యోగులకు గూగుల్ షాకిస్తోంది. వారి వేతనాల్లో 25 శాతం కోత విధించాలని భావిస్తోంది.

‘వర్క్ ఫ్రం హోం’ ఉద్యోగులకు గూగుల్ షాక్...

సియాటిల్ : ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ఉద్యోగులకు గూగుల్ షాకిస్తోంది. వారి వేతనాల్లో 25 శాతం కోత విధించాలని భావిస్తోంది. కంపెనీ జూన్ నెలలో తీసుకు వచ్చిన ‘వర్క్ లొకేషన్ టూల్’... ఈ విషయాన్ని చెబుతోంది. కాగా... కార్యాలయం ఉన్న నగరంలోనే పని చేసే ఉద్యోగులకు మాత్రం వేతన కోత ఉండదట. అంటే వారు అదే నగరంలో నివసిస్తూ.... వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంచుకున్నప్పటికీ వేతనంలో కోత ఉండదు. సిలికాన్ వ్యాలీలో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ ప్రక్రియను ఇతర పెద్ద కంపెనీలు కూడా పాటిస్తున్నాయి. ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా దిగ్గజాలు కూడా తక్కువ వ్యయాలు ఉండే ప్రాంతాలకు మారిన ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తున్నాయి. రెడిట్, జిల్లో వంటి చిన్న సంస్థలు కూడా ప్రాంతం ఆధారిత చెల్లింపుల నమూనాకు మారాయి. 


గూగుల్ తన ఉద్యోగుల కోసం ఒక కాలిక్యులేటర్‌ను అందించింది. దీని ద్వారా ఉద్యోగులు ఏ ప్రాంతానికి వెళితే వేతనాల్లో ఏయే మార్పులు, ఎంతెంత మేరకు చోటు చేసుకుంటాయో తెలుసుకోవచ్చు. తమ వేతన ప్యాకేజీలన్నింటినీ కూడా... ‘ప్రాంతం’ ప్రాతిపదికనే నిర్ణయిస్తామని, స్థానిక మార్కెట్‌లోని ఉద్యోగుల కంటే ఎక్కువ జీతాన్నే ఇస్తుంటామని గూగుల్ ప్రతినిధులు చెబుతున్నారు. నగరాలు, రాష్ట్రాలను బట్టి వేతనాల్లో తేడాలు ఉంటాయన్నారు. సియాటెల్ కార్యాలయానికి దగ్గరలో ఉండే గ్రామీణ ప్రాంతానికి మారిన ఉద్యోగులకు 10 శాతం మేర కోత ఉండవచ్చునని వర్క్ లొకేషన్ టూల్ ఆధారంగా తెలుస్తోంది. దీంతో రెండు గంటల ప్రయాణ దూరంలో ఉన్నప్పటికీ... కార్యాలయానికే వెళ్లడం మంచిదని ఉద్యోగులు భావిస్తున్నారట. 


వారికి 25 శాతం కోత... గూగుల్ ఉద్యోగులతో పాటు ఇతర టెక్ కంపెనీల ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే వేతనాల్లో కోత ఉంటోంది. సియాటెల్, బోస్టన్, శాన్‌ఫ్రాన్సిస్కో ప్రాంతాల్లోని ఉద్యోగుల వేతనాల్లో5- 10 శాతం కోత విధిస్తున్నారు. శాన్‌ప్రాన్సిస్కో కార్యాలయానికి దూరమై, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉపయోగించుకుంటున్న వారికి 25 శాతం వేతన కోత ఉంటోంది. సిలికాన్ వ్యాలీలో ఉంటున్న వారికి శాలరీ స్ట్రక్చర్ ఎక్కువగా ఉంది. న్యూయార్క్ సిటీలో అయితే.. గూగుల్ ఇంటర్నేషనల్ శాలరీ కాలిక్యులేటర్ ప్రకారం న్యూయార్క్ నగరంలో నివసించే గూగుల్ ఉద్యోగి స్థానిక నగరంలోనే ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే ఎలాంటి వేతన కోతా ఉండదు. అదే సమయంలో ఓ ఉద్యోగి స్టాంఫోర్డ్, కనెక్టికట్ తదితర ప్రాంతాల నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే (ఈ ప్రాంతాల నుంచి న్యూయార్క్ నగరానికి దాదాపు గంట, గంటన్నర ప్రయాణం) వేతన కోత 15 శాతం ఉంటుంది. వివిధ ప్రాంతాల్లో పని చేసే ఉద్యోగులకు వివిధ వేతన కోతలు ఉంటాయని గూగుల్ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. కాగా...  ఈ కొత్త పే-ఔట్ మోడల్ పై గూగుల్ ఉద్యోగులు భిన్నంగా స్పందిస్తున్నారు. 

Updated Date - 2021-08-11T21:49:01+05:30 IST