హైదరాబాద్‌లోని వలస కార్మికులకు శుభవార్త

ABN , First Publish Date - 2020-04-03T15:56:06+05:30 IST

కరోనా వైరస్ దెబ్బతో బడుగు, బలహీనవర్గాల జీవితాలు కూడా లాక్ డౌన్ అయ్యాయి.

హైదరాబాద్‌లోని వలస కార్మికులకు శుభవార్త

హైదరాబాద్: కరోనా వైరస్ దెబ్బతో బడుగు, బలహీనవర్గాల జీవితాలు కూడా లాక్ డౌన్ అయ్యాయి. హైదరాబాద్ వంటి నగరాల్లో వసల కూలీలు, వలస కార్మికుల జీవితాలు ఆగమాగమయ్యాయి. ఈ నేపథ్యంలో పస్తులతో అల్లాడుతున్న ఆయావర్గాల పేదలను ఆదుకునే ఓ బృహత్తర కార్యక్రమం హైదరాబాద్‌లో మొదలైంది. 


జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారికి తెల్ల రేషన్ కార్డులు లేవు. ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పస్తులతో అల్లాడుతున్నారు. ఈ తరహా ఆభాగ్యులను పలు స్వంచ్చంధ సంస్థలతోపాటు ప్రజా సంఘాల నేతలు వారికి బాసటగా నిలిచారు. వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై టీఆర్ఎస్ పెద్దలు సానుకూలంగా స్పందించారు. దీంతో పౌరసమాజంతోపాటు సామాజిక బాధ్యతగా పలు కార్పొరేట్ కంపెనీలు అందించిన సాయాన్ని డ్రై రేషన్ రూపంలో అవసరార్ధరూపంలో అందించే పథకానికి బీజం పడింది. ఈ పనిని నిర్వర్తించడానికి ఓ బృందం కార్యరంగంలోకి దిగింది. 


కోవిడ్-19 సహాయ పేరిట తెలంగాణ స్వచ్చంధ, సామాజిక సంస్థలు, సివిల్ సొసైటీ గ్రూప్‌ల ఆధ్వర్యంలో మొదలైన ఈ కార్యక్రమానికి ప్రభుత్వం కూడా తగిన సహకారం అందిస్తోంది. హైదరాబాద్‌లో కూలీల సంఖ్య 25వేలకుపైబడే ఉంటుంది. ప్రస్తుతం 16వేల మందికి రేషన్ అందించేందుకు చురుగ్గా పనులు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలతోపాటు శివారు బస్తీల్లో కూడా ఈ రేషన్‌ను అందజేస్తారు.

Updated Date - 2020-04-03T15:56:06+05:30 IST