క్యాన్సర్‌ బాధితులకు Good News

ABN , First Publish Date - 2022-04-26T12:45:16+05:30 IST

క్యాన్సర్‌ బాధితులకు ఇది శుభవార్తే...

క్యాన్సర్‌ బాధితులకు Good News

  • మే మొదటి వారంలో ‘ఎస్వీఐసీఏఆర్‌’ప్రారంభానికి సన్నాహాలు
  • టీటీడీ సహకారంతో తిరుపతిలో సిద్ధమైన ‘టాటా’ క్యాన్సర్‌ ఆస్పత్రి

తిరుపతి సిటీ : క్యాన్సర్‌ బాధితులకు ఇది శుభవార్తే. తిరుపతిలో నిర్మిస్తున్న ‘టాటా’ క్యాన్సర్‌ ఆస్పత్రి మే నెల మొదటి వారం నుంచి బాధితులకు అందుబాటులోకి రానుంది. దీనికోసం నిర్వాహకులు సన్నాహాలు ప్రారంభించారు. తిరుపతిలోని జూపార్కు రోడ్డులో టీటీడీ సహకారంతో టాటా ట్రస్టు ఆధ్వర్యంలో నిర్మిస్తున్న శ్రీవేంకటేశ్వర ఇన్‌స్టిట్యుట్‌ ఆఫ్‌ క్యాన్సర్‌ కేర్‌ అండ్‌ అడ్వాన్డ్స్‌ రీసెర్చ్‌ (ఎస్వీఐసీఏఆర్‌) ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. క్యాన్సర్‌ బాధితులను దృష్టిలో పెట్టుకుని శ్రీవారి పాదాల చెంత 25 ఎకరాల విస్తీర్ణంలో రూ.600 కోట్ల వ్యయంతో క్యాన్సర్‌ ఆస్పత్రిని నిర్మించడానికి టాటా ట్రస్ట్‌ చైర్మన్‌ రతన్‌ టాటా శ్రీకారం చుట్టారు. ఈ ఆలోచనను ఆచరణలో పెట్టడానికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గట్టిగా కృషి చేయడం, టీటీడీ వారు అవసరమైన స్థలాన్ని కేటాయించడంతో 2018 ఆగస్టు 31న ‘టాటా’ క్యాన్సర్‌ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. 


ఏడాది కాలంలోనే ఆస్పత్రిని క్యాన్సర్‌ బాధితులకు అందుబాటులోకి తేవాలని చాలా వరకు పనులు పూర్తి చేశారు. ఆపై ప్రభుత్వం మారడంతో ఈ ఆస్పత్రి నిర్మాణ వేగానికి కొంత అడ్డుకట్ట పడింది. తర్వాత కొవిడ్‌ వల్ల కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులను తలెత్తాయి. ఎట్టకేలకు ఆస్పత్రి నిర్మాణం పూర్తి కావడం, అవసరమైన వైద్య పరికరాలు, సిబ్బంది అందుబాటులోకి రావడంతో వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభించడానికి నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. నిజానికి నెల కిందటే ఆస్పత్రిని ప్రారంభించాల్సి ఉండగా టీటీడీ అధికారులు సీఎం చేతుల మీదుగా ప్రారంభించాలన్న ఆలోచనతో వాయిదా వేయాల్సి వచ్చింది. అన్నీ అనుకూలిస్తే మే 5న క్యాన్సర్‌ బాధితులకు ఈ ఆస్పత్రి అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి.


క్యాన్సర్‌ నిర్మూలనే లక్ష్యంగా..  

దేశంలో క్యాన్సర్‌ను పూర్తి స్థాయిలో నిర్మూలించే దిశగా ఆస్పత్రుల నిర్మాణాలకు రతన్‌ టాటా శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే తిరుపతిలో క్యాన్సర్‌ ఆస్పత్రిని నిర్మించారు. క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తించి.. తగిన వైద్యం అందిస్తే, నివారించే అవకాశం ఉంటుందనే ఆలోచనతో క్యాన్సర్‌ రీసెర్చ్‌ కేంద్రాన్ని కూడా ఇక్కడ అందుబాటులోకి తీసుకురానున్నారు.అలాగే తక్కు వ ఖర్చుతో క్యాన్సర్‌ బాధితులకు వైద్యం అందించే దిశగా ఓపీ కేవలం రూ.30తోనే ప్రా రంభిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. అలాగే ఏ ఆస్పత్రిలో లేనివిధంగా తక్కువ ధరకే అధునాతన వైద్యాన్ని అందిస్తామని పేర్కొన్నారు.


సహాయకుల సౌకర్యార్థం వసతి భవనం

బాధితుల వెంటవచ్చే సహాయకుల వసతి కోసం ప్రత్యేక భవనాన్ని ఏర్పాటు చేయనున్నారు. దేశం నలుమూలల నుంచి క్యాన్సర్‌ బాధితులు వైద్యం కోసం ఇక్కడకు వచ్చి వసతికి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో టాటా సంస్థ ఈ సదుపాయాన్ని ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే నగరంలోని ఓ భవనాన్ని అద్దెకు తీసుకుని, సహాయకుల కేటాయిస్తోంది. త్వరలోనే ఆస్పత్రి ఆవరణలో పూర్తి వసతులతో వీరికోసం నూతన భవనాన్ని అందుబాటులోకి తేనున్నారు.


దాదాపు రూ.210 కోట్లతో ఆస్పత్రి నిర్మాణం

టాటా ట్రస్టు వారు మొత్తం రూ.600 కోట్ల వ్యయంతో క్యాన్సర్‌ వ్యాధి నివారణ దిశగా ఎస్వీఐసీఏఆర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 376 పడకలు, టెలిరేడియాలజీ, టెలి డయాగ్నోస్టిక్స్‌, రేడియేషన్‌ థెరపీ, అధునాతన క్యాన్సర్‌ పరిశోధన, క్యాన్సర్‌ నిపుణుల కోసం శిక్షణ వంటి వాటిని అందుబాటులో కి తీసుకొచ్చేలా ఆస్పత్రి నిర్మాణాన్ని ప్రారంభించారు. రెండు దశల్లో పూర్తి చేసేలా ప్రణాళికను రూపొందించారు. తొలి దశలో దాదాపు రూ.210 కోట్ల వ్యయంతో ఆస్పత్రి నిర్మాణాన్ని పూర్తి చేశారు. అత్యవసర విభాగంలో 10 పడకలను, మరో 82 సాధారణ పడకలతో ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకురానున్నారు. 

Updated Date - 2022-04-26T12:45:16+05:30 IST