చక్కెర పరిశ్రమకు చేటుకాలం

ABN , First Publish Date - 2020-07-31T07:16:46+05:30 IST

చక్కెర పరిశ్రమ భారతదేశంలో రెండవ అతిపెద్ద వ్యవసాయ ఆధారిత పరిశ్రమ. ప్రస్తుత పరిస్థితుల్లో చక్కెర పరిశ్రమతోపాటు చెరుకు రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు...

చక్కెర పరిశ్రమకు చేటుకాలం

చక్కెర పరిశ్రమలకు బ్యాంకుల ద్వారా సంవత్సరానికి 4% వడ్డీకి రుణాలు అందే విధంగా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. చెరుకు సాగుదారులు వారు భూమిని కలిగి ఉన్న యజమానులైనా, కౌలు రైతులైనా ఇద్దరికీ పావలా వడ్డీకి రుణాలు మంజూరు చేయాలి. మహారాష్ట్రలో ఇచ్చిన కరెంటు రేటు మన కర్మాగారాలకు కూడా వర్తింపజేయాలి.


చక్కెర పరిశ్రమ భారతదేశంలో రెండవ అతిపెద్ద వ్యవసాయ ఆధారిత పరిశ్రమ. ప్రస్తుత పరిస్థితుల్లో చక్కెర పరిశ్రమతోపాటు చెరుకు రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి ముఖ్య కారణం చక్కెర తయారీకి ముడి పదార్థం అయిన చెరుకు సాగు వ్యయం ఒక్క ఎకరాకు లక్ష రూపాయలు దాటిపోవడం, చక్కెర తయారీ ఖర్చు కన్నా అమ్మకపు ధర తక్కువ ఉండటం. 


ఒక కేజీ పంచదార తయారీకి రూ.39 ఖర్చు అవుతుంది, కానీ మార్కెట్లో ధరలు మాత్రం రూ.30 నుండి రూ.32 గా ఉంది. ప్రపంచ స్థాయిలో పంచదార ధర రూ.22 ఉంది. భారత ప్రభుత్వం ఎగుమతులను ప్రోత్సహించటానికి సుమారు ఒక టన్ను పంచదారకు రూ.9000 నుండి రూ.10,000 ప్రోత్సాహకాన్ని ప్రకటించడం వలన ఈ మాత్రం ఎగుమతులు జరిగాయి. ఈ ఎగుమతుల ప్రోత్సాహకం దాదాపు రెండేళ్ళ నుండి అనేక కర్మాగారాలకు అందలేదు. ఈ బకాయిలు దాదాపు రూ.3,000 కోట్ల దాకా ఉన్నట్లు సమాచారం. అలాగే పంచదార ధరలను నియంత్రించడానికి సుమారు 35 లక్షల టన్నుల బఫర్‍ను ఏర్పాటు చేసి, వడ్డీ రాయితీని కర్మాగారాలకు అందజేస్తుంది. అయినప్పటికీ ఇంకా ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో అనేక కర్మాగారాలు మూసివేత దిశగా పయనిస్తున్నాయి. ఇటీవల రాష్ట్రంలోనూ ఆరు ప్రైవేటు రంగ కర్మాగారాలు ఆర్థిక ఒడిదుడుకులను తట్టుకోలేక మూత పడ్డాయి. ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్రంలో అన్ని పరిశ్రమలూ మూతపడవచ్చు.


పంచదార పండించే రైతులకు అనేక సమస్యలు ఉన్నాయి. అధిక దిగుబడి, మంచి నాణ్యత గల చెరుకు వంగడాలు అందుబాటులో లేవు. చెరుకు పంటల సాగులో నైపుణ్యం కలిగిన వ్యవసాయ కూలీల కొరత ఉంది. బ్యాంకులు రైతులకు సకాలంలో, తగిన రుణ సదుపాయాలు కల్పించడం లేదు. ముఖ్యంగా కౌలు రైతులకు సొంత భూములు ఉండవు కాబట్టి వారికి బ్యాంకులు ఋణాలు ఇవ్వటం లేదు. ఇందువలన వారికి ఆర్థిక వెసులుబాటు లేకుండా పోతుంది. రైతులకు అతిపెద్ద సవాలు చెరకు నరికే కూలీల కొరత. ఇది మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో చాలా ఎక్కువ, యూపీలో చెరుకు కోతకు అయ్యే ఖర్చు టన్నుకు రూ.550. దక్షిణ భారతదేశంలో ఇది రూ.1000 లేదా అంతకంటే ఎక్కువ. చెరుకు పరిశ్రమలకు కూడా అనేక సమస్యలు ఉన్నాయి. దేశంలో చెరుకు బకాయిలు రూ.20,000 కోట్లకు చేరుకున్నాయి. ఈ బకాయిలకు ప్రధాన కారణం పంచదార ఉత్పత్తి వ్యయం కిలోకి రూ.39 ఉండగా అమ్మకపు ధర కిలోకి రూ.31గా ఉండటం. మన రాష్ట్రంలో 2010 నుండి, మొలాసిస్ ఎగుమతిపై టన్నుకు రూ.2500 సుంకం విధించబడింది, రాష్ట్రం వెలుపలకు మొలాసిస్ అమ్మకాలు లేవు. కేంద్ర ప్రభుత్వం మొలాసిస్ అమ్మకాలపై 2017 నుండి జీఎస్‌టీని అమలు చేసింది. ఒక పన్ను- ఒక దేశం- ఒక మార్కెట్ అన్నప్పటికీ రాష్ట్రం దీనిని పట్టించుకోవటం లేదు. 


ఆర్.ఎస్, ఇ.ఎన్.ఎ., ఇథనాల్ ఎగుమతిపై పరిమితులు, నిషేధం ఉన్నాయి. తెలంగాణాలో ఉన్న 62 శాతం ఐ.ఎమ్.ఎఫ్.ఎల్ సంస్థలు, ఫార్మా సంస్థలకు ఆర్.ఎస్, ఇ.ఎన్.ఎ., ఇథనాల్ అవసరం ఉంది. కానీ మొలాసిస్ ఆధారిత ఆర్.ఎస్, ఇ.ఎన్.ఎ., ఇథనాల్ ఎగుమతిని ఇతర రాష్ట్రాలకు పూర్తిగా నిషేధించారు. 2000 నుండి 2003 సంవత్సరాల్లో కో-జెన్ యూనిట్ల ఏర్పాటులో చక్కెర పరిశ్రమలు ముందడుగు వేశాయి. ఈ రోజు 110 మెగావాట్ల వ్యవస్థాపిత సామర్థ్యంతో 10 కో-జెన్ యూనిట్లు ఉన్నాయి. ఇవి ఏపీ ట్రాన్స్‌కో తో విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ప్రస్తుతం, చెల్లించే రేటు యూనిట్‌కు రూ.4.19 ఇతర రాష్ట్రాల రేటుతో పోల్చినప్పుడు చాలా తక్కువ.


ప్రస్తుతం ఏపీఈఆర్‌సీ ఆదేశాల ప్రకారం క్రాస్ సబ్సిడీ ఛార్జీల పేరిట భారీ మొత్తాలను వసూలు చేస్తున్నారు. చక్కెర పరిశ్రమలు కో-జెన్ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి చేయబడిన మిగులు విద్యుత్ ‘‘బ్యాంకింగ్ సౌకర్యం’’ కోసం ఎదురుచూస్తున్నారు. ట్రాన్స్‌కో ఎటువంటి నిర్వహణ కార్యకలాపాలు చేయకుండా లైన్ మరియు బే నిర్వహణ ఛార్జీలను డిమాండ్ చేస్తోంది. నిర్వహణ వాస్తవానికి సంబంధిత కో-జెన్ యూనిట్లు చేపడుతున్నాయి. చక్కెర పరిశ్రమలకు నిధులు ఇవ్వడానికి బ్యాంకింగ్ రంగం సుముఖంగా లేదు. చక్కెర పరిశ్రమల మూలధనం రుణాలపై బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు అసాధారణంగా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు చక్కెర పరిశ్రమపై దృష్టి సారించాలి. చక్కెరకు కనీస అమ్మకపు ధర, ఉత్పత్తి వ్యయాన్ని భరించటానికి, ప్రస్తుతం ఉన్న కిలోకు రూ.31 నుండి కిలోకు రూ.36 వరకు పెంచాలి. చక్కెర అమ్మకాలు ద్వంద్వ ధర విధానం ద్వారా, కిలోకు రూ.60 చొప్పున పారిశ్రామిక వినియోగదారులకు, కిలోకు రూ.35-–37 చొప్పున దేశీయ వినియోగదారులకు విక్రయించే విధానాన్ని అమలు చేయవచ్చు. చెరుకు సాగు, పంట కోత కోసం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని విస్తరించాలి. ఇథనాల్ బ్లెండింగ్ శాతాన్ని 30% వరకు పెంచాలి ఇప్పటికే బ్లెండింగ్ 7.2%కి చేరుకుంది. దీని వలన దేశానికి రూ.7000 కోట్లకు పైగా ఆర్థిక భారం తగ్గింది. కొత్త డిస్టిలరీల ఏర్పాటుకు, ప్రస్తుత డిస్టిలరీల సామర్థ్యాన్ని విస్తరించడానికి ప్రభుత్వం లైసెన్స్ విధానాన్ని సరళీకృతం చేయాలి. రసాయన ఎరువులపై భారత ప్రభుత్వం భారీగా రాయితీలు ఇస్తున్నందున, అదే ప్రయోజనాన్ని పంచదార కర్మాగారాలు తయారుచేసే సేంద్రియ ఎరువులకు కూడా విస్తరించాలి. ప్రస్తుతం ఎగుమతికి, బఫర్‍కు అందించే ప్రోత్సహాకాలు మరికొన్ని సంవత్సరాలు పాటు కొనసాగించాలి.


అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా 2006-–07 సీజన్లో, చెరకు సాగుదారులకు ప్రోత్సాహకంగా మెట్రిక్ టన్నుకు రూ.100 ఇవ్వటం జరిగింది. చెరకు సాగు ఖర్చు పెరగటం కారణంగా 2019–-20 సీజన్ నుండి 2021–-22 వరకు సరఫరా చేసిన ప్రతి టన్ను చెరకు రూ.500 చొప్పున రైతుల బ్యాంకు ఖాతాలలో జమ చేయాలి. చక్కెర పరిశ్రమలకు బ్యాంకుల ద్వారా సంవత్సరానికి 4% వడ్డీ చొప్పున రుణాలు అందే విధంగా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. చెరకు సాగుదారులు వారు భూమిని కలిగి ఉన్న యజమానులైనా, కౌలు రైతులైనా ఇద్దరికీ పావలా వడ్డీకి రుణాలు మంజూరు చేయాలి. మహారాష్ట్రలో ఇచ్చిన కరెంటు రేటు మన కర్మాగారాలకు కూడా వర్తింపజేయాలి. క్రాస్ సబ్సిడీ, లైన్ నిర్వహణ ఛార్జీలు వసూలు చేయవద్దని ఏపీ ట్రాన్స్‌కో/ డిస్కమ్స్ విభాగానికి తగిన మార్గదర్శకాలు జారీ చేయలి. రాష్ట్రంలోని కర్మాగారాలకు ఎటువంటి ఎగుమతి రుసుము లేకుండా మొలాసిస్, ఆర్.ఎస్., ఇ.ఎన్.ఎ., ఇథనాల్ ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయడానికి అనుమతి మంజూరు చేయాలి. పి.పి.పి మోడల్ పరిశోధనలు ప్రారంభించాలి. ఈ ప్రణాళిక అవలంబించటంలో రైతులను, కర్మాగారాలను భాగస్వాములను చేయాలి. ముఖ్యంగా చెరుకు నరికే యంత్రాలను మన నేలలకు అనువైనవాటిని అభివృద్ధి చేయాలి. 2030 నాటికి సగటు చెరుకు ఉత్పాదకత ఎకరానికి 30 టన్నుల నుండి 60 టన్నులకు చేరాలి. ఇతర వ్యవసాయ ఉత్పత్తులకు చేసినట్లుగా చెరుకు రైతులకు ఉచిత విత్తనం సరఫరా చేయాలి. పొరుగు రాష్ట్రాల్లో జరుగుతున్నట్లుగా 90% నుండి 100% సబ్సిడీ కింద చెరకు రైతులకు ‘‘బిందు సేద్యం’’ అందించాలి. ఇది నేరుగా తక్కువ నీటి వినియోగానికి దారితీస్తుంది, ఖచ్చితంగా దిగుబడిని పెంచుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి ఈ చక్కెర సంక్షోభం నుండి కర్మాగారాలను, రైతులను ఆదుకున్నట్లయితే దేశంలోని గ్రామీణ ప్రాంతం మరింత అభివృద్ధి పథంలో నడుస్తుంది. 

జి. వెంకటేశ్వరరావు

ముఖ్య కార్యనిర్వహణ అధికారి, 

కెసిపి షుగర్స్‌



Updated Date - 2020-07-31T07:16:46+05:30 IST