యాదాద్రీశుడి అభిషేకానికి బంగారు బావి

ABN , First Publish Date - 2020-08-13T08:13:23+05:30 IST

యాదాద్రి లక్ష్మీనృసింహుడి ఆలయ అభివృద్ధితో పాటు స్వామివారి పూజా కైంకర్యాలను తిరుమల

యాదాద్రీశుడి అభిషేకానికి బంగారు బావి

  • గర్భాలయం ఈశాన్య భాగంలో ఏర్పాటు
  • పెద్ద రాగి గంగాళానికి బంగారు తొడుగు 
  • కాళేశ్వరం గోదావరి జలాలు మళ్లింపు

యాదాద్రి, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): యాదాద్రి లక్ష్మీనృసింహుడి ఆలయ అభివృద్ధితో పాటు స్వామివారి పూజా కైంకర్యాలను తిరుమల తిరుమతి దేవస్థానం స్థాయిలో నిర్వహించేందుకు వైటీడీఏ దృష్టిసారించింది. తిరుమల క్షేత్రంలో ఽశాస్త్రపరంగా అత్యంత ప్రాముఖ్యమైన బంగారు బావి(శ్రీ తీర్ధం)ని కూడా నృసింహుడి సన్నిధిలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ఆగమ పండితులు, స్తపతులతో చర్చించిన వైటీడీఏ అధికారులు, స్వామివారు కొలువైన కొండగుహలో ఈశాన్య దిక్కులో బంగారు బావిని నెలకొల్పాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. స్వామివారికి పాంచరాత్రాగమశాస్త్రానుసారం అభిషేకం, ఇతర పూజా కైంకర్యాలకు పుణ్యజలాన్ని(బిందె తీర్థం) ప్రతిరోజు వేకువజామున కొండపై విష్ణుపుష్కరిణి నుంచి తెస్తున్నారు. ఆలయ విస్తరణలో భాగంగా విష్ణు పుష్కరిణి పునరుద్ధరణను కూడా చేపట్టారు.  అయితే ఆఽగమశాస్త్రానుసారం స్వామివారి అభిషేకాలకు వినియోగించే పుణ్యజలాల కోసం బంగారు  బావిని స్వామివారి సన్నిధిలోనే నెలకొల్పడం బాగుటుందనే సూచనలు వచ్చాయి. దీన్ని గతంలోనే చినజీయర్‌ స్వామి, అప్పటి గవర్నర్‌ నరసింహన్‌ కూడా సూచించారు. బంగారు బావి నిర్మాణంలో భాగంగా స్వామివారి మూలవిరాట్టుకు వెనుక ప్రదేశంలో నేలపై ఉన్న పరుపు బండను తొలిచి అక్కడ పెద్ద రాగి గంగాళాన్ని అమర్చుతారు. ఆ గంగాళానికి స్వర్ణ పూత(తొడుగు) వేస్తారు. బంగారుబావి నుంచి నీళ్లు చేదేందుకు చేతబావి తరహాలో ప్రత్యేకంగా తాడు, గిరక, బొక్కెనలను ఏర్పాటు చేస్తారు. ధార్మికంగా అత్యంత విశిష్టత ఉన్న ఈ బంగారుబావికి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా యాదాద్రి చెంతకు చేరనున్న గోదావరి జలాలను మళ్లించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు.  

Updated Date - 2020-08-13T08:13:23+05:30 IST