బంగారు వాసాలమర్రి!

ABN , First Publish Date - 2021-06-23T08:54:55+05:30 IST

అధ్వానంగా ఉన్న వాసాలమర్రిని బంగారు వాసాలమర్రిగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని సీఎం కేసీఆర్‌ చెప్పారు.

బంగారు వాసాలమర్రి!

  • ఏడాదిలో గ్రామాన్ని మార్చేద్దాం... 
  • ప్రేమ, ఐకమత్యంతోనే సాధ్యం
  • ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దడానికి 
  • రూ.150 కోట్లయినా ఖర్చు చేస్తా
  • దత్తత గ్రామంలో సీఎం కేసీఆర్‌ 
  • జిల్లాలో ప్రతి పంచాయతీకి 25 లక్షలు
  • భువనగిరి మునిసిపాలిటీకి రూ.కోటి
  • మిగతా వాటికి రూ.50 లక్షలు
  • వాసాలమర్రి సభలో సీఎం వరాల జల్లు
  • మండలానికో మెగా పార్కు!


యాదాద్రి, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): అధ్వానంగా ఉన్న వాసాలమర్రిని బంగారు వాసాలమర్రిగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ఇంటికో పాడి గేదె, కొందరికి ట్రాక్టర్లు, మరికొందరికి ఇంకేవో ఇస్తేనో ఇది సాధ్యం కాదని.. ఊరంతా జట్టుకట్టి, పట్టుబడితేనే సాధ్యమని చెప్పారు. ‘ఓ యజ్ఞం లాంటి పనిని మీతో కలిసి చేయడానికి నేనున్నా. అందుకు మీరు సిద్ధమేనా?’ అని గ్రామస్థులను ప్రశ్నించారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని తన దత్తత గ్రామం వాసాలమర్రిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి మంగళవారం శ్రీకారం  చుట్టారు. ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన గ్రామసభలో వాసాలమర్రిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి చేపట్టాల్సిన ప్రణాళికను వివరించారు. ‘‘వాసాలమర్రిని చుట్టూ 10 ఊర్లకు ఆదర్శంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం. ఇది మామాలు విషయం కాదు.


ఓ మిషన్‌గా చేయడమే లక్ష్యం. గ్రామం ఉండేది ఇలాగేనా? అని నాతోపాటు భోజనం చేసిన ఆకుల ఆగమ్మ, తిరుమని లక్ష్మిని అడిగా. కాదు, ఇలా ఉండొద్దు.. అన్నారు. గ్రామాన్ని అద్భుతంగా తీర్చిదిద్దడానికి రేపటి నుంచే పనులు మొదలు కావాలి. సీఎం కేసీఆర్‌ వస్తున్నాడు. ట్రాక్టర్లు, అవీ, ఇవీ ఇస్తాడని అనుకుంటున్నారు. అంతటి దానికి నేను ఎందుకు? కలెక్టర్‌కు చెబితే ఇస్తారు. వాసాలమర్రిలో నేను కోరుకునేది అదికాదు. ప్రత్యేకమైన పనులు జరగాలి. ఇంకా 20 సార్లు వస్తా. ఇక ముందు సభ ఈ విధంగా ఉండదు. ఊరందరి మధ్యలో కూర్చొని మాట్లాడతా’’ అని కేసీఆర్‌ అన్నారు. 


ప్రేమ, చిరునవ్వుతోనే సాధ్యం..

‘‘గ్రామస్థుల మధ్య ప్రేమభావం కావాలి.  గ్రామంలో పోలీసు కేసులు ఉండొద్దు. ఉంటే కూడా వాపసు తీసుకుని పరిష్కరించుకోండి. అందుకు రాచకొండ కమిషనర్‌, డీసీపీ మీకు సహకరిస్తారు. చిరునవ్వులు చిందిస్తే వందకు వంద శాతం వాసాలమర్రి బంగారు తెలంగాణ అవుతుంది. ఇందుకు కావాల్సింది ఐకమత్యం, పట్టుదల, పైకి రావాలనే తపన. ఉద్యమకాలం నుంచి వాసాలమర్రి మీదుగా అనేకసార్లు వెళ్లా. వంకర టింకర రోడ్డు, పాత ఇండ్లు, అధ్వానంగా ఉన్న ఈ ఊరును బాగు చేయవచ్చు కదా? అనిపించింది. లాక్‌డౌన్‌ ఎత్తివేయగానే ఈ ఊరికి వస్తానని చెప్పా. రామాలయంలో దండం పెట్టి, ఆయన దీవెనలు తీసుకుని పనులు మొదలు పెడదాం. ఇక ఊరందరిదీ అభివృద్ధి కులమే’’ అని చెప్పారు. 


అంకాపూర్‌ ఆదర్శంగా..

‘‘వాసాలమర్రి అభివృద్ధికి అంకాపూర్‌ను ఆదర్శంగా తీసుకోవాలి. అక్కడ భూమేమీ బంగారం కాదు. ఇక్కడి లాంటిదే. కానీ, ఆ గ్రామస్థులు బంగ్లాలు కట్టుకుని మంచిగ జీవిస్తున్నారు. దానికి కారణం ఐకమత్యంగా గ్రామాభివృద్ధి కమిటీ ఏర్పాటు చేసుకుని ముందుకు సాగడమే. ఆ కమిటీ గ్రామస్థులకు సుప్రీంకోర్టుతో సమా నం. 45 ఏళ్లుగా ఆ ఊరిలో ఒక్క పోలీస్‌ కేసు కూడా లేదు. అదే విధానాలను వాసాలమర్రిలో పాటించాలి. గ్రామం ఆదర్శంగా అభివృద్ధి చెందాలంటే అట్టడుగు వర్గాలను గుర్తించి వారికి చేయూత కల్పించాలి. రెక్కల కష్టంపై బతికే వారిగురించి ముందు ఆలోచించాలి. గ్రామస్థులంతా చేయూత ఇవ్వాలి’’ అన్నారు. ఇలాంటి పని వాసాలమర్రిలో చేద్దామా? వద్దా? అని సీఎం కేసీఆర్‌ ప్రశ్నించగా.. ‘చేద్దాం’ అంటూ గ్రామస్థులు సమాధానమిచ్చారు.


వారానికి ఒక రోజు శ్రమిస్తే.. 

‘‘ఊరిలో పనిచేయగల వారి రెండు చేతులు వారానికి రెండు గంటలు ఉచితంగా శ్రమిస్తే మీ ఊరిలో మీరే అద్భుతాలు సృష్టించగలరు. 2,600 మంది జనాభా గల వాసాలమర్రిలో 1500 మంది వారానికి రెండు గంటలు ఊరికోసం కదిలితే ఏ పని అయినా ఆగుతుందా? ఒక వేలుగా మిగులుదామా? అభివృద్ధి కోసం పిడికిలి బిగిద్దామా? పనులు మొదలు పెడితే ప్రతి కుటుంబానికి అవసరమైన లబ్ధిని ప్రభుత్వం కల్పిస్తుంది. వాసాలమర్రిలో ఏ కుటుంబమైనా నాదే. ప్రతి ఇంటి లెక్క తీసి ఏది అవసరమైతే అదే చేద్దాం. గ్రామాభివృద్ధికి కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి. ఈ కమిటీల్లో అన్ని కులాలకు జనాభా దామాషాగా ప్రాతినిధ్యం కల్పించాలి. గ్రామ నిధిని ఏర్పాటు చేసుకోవాలి. అంకాపూర్‌లో 1987లోనే రూ.9కోట్లు, రూ.13కోట్లతో రెండు గ్రామ నిధులను ఏర్పాటు చేసుకున్నారు. ఇవన్నీ చేయడానికి మీరు ముందుకు వస్తామంటే ప్రాజెక్టును మొదలు పెట్టుకుందాం’’ అని కేసీఆర్‌ చెప్పారు. వాసాలమర్రిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి చేపట్టాల్సిన కార్యక్రమాల అమలుకు జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పథిని ప్రత్యేక అధికారిగా నియమిస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. రూ.150 కోట్లు అవసరమైనా ఖర్చు చేయడానికి వెనుకాడేది లేదని చెప్పారు. ఊరిలోని అందరి భూములకు డ్రిప్‌ ఇరిగేషన్‌ మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ప్రతి పంచాయతీకి రూ.25 లక్షలు ఇస్తామని, భువనగిరి మునిసిపాలిటీకి రూ.కోటి, ఇతర మునిసిపాలిటీలకు రూ.50 లక్షల చొప్పున అందజేస్తామని ప్రకటించారు. 


కొండాపూర్‌ గ్రామస్థుల కోసం తనిఖీలు

సీఎం కేసీఆర్‌ వాసాలమర్రి పర్యటనలో కొండాపూర్‌ గ్రామస్థులు పాల్గొనకుండా పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. కొండాపూర్‌ గ్రామం నుంచి సీఎం కేసీఆర్‌ ఫాంహౌ్‌సకు రోడ్డు నిర్మించారు. ఈ రోడ్డు కోసం సేకరించిన భూమి, ఇళ్ల పరిహారం చెల్లించలేదు. దీంతో కేసీఆర్‌ పాల్గొనే సభలో కొండపూర్‌ గ్రామస్థులు నిరసన వ్యక్తం చేస్తారనే సమాచారం మేరకు పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. 


సుప్రజను ఎంబీబీఎస్‌ చదివిస్తా

వాసాలమర్రిలో కేసీఆర్‌ గ్రామస్థులందరితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. గ్రామంలోని మహిళలకు ఆయన స్వయంగా భోజనాలు వడ్డించడమే కాకుండా వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఆకుల ఆగమ్మ, తిరుమని లక్ష్మిని పక్కన కూర్చోపెట్టుకుని భోజనం చేస్తూ వారి కుటుంబ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా సుప్రజ అనే పదో తరగతి బాలికను భవిష్యత్‌లో ఏం కావాలని అనుకుంటున్నావని అడిగారు. దానికి ఆమె తాను ఎంబీబీఎస్‌ చదువుతానని, కానీ, తల్లిదండ్రులకు అంత ఆర్థిక స్థోమత లేదని పేర్కొంది. దీంతో ఆమె తండ్రిని పిలిపించి కుమార్తెను చదివించాలని, ఎంబీబీఎస్‌ చదివించే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. గ్రామానికి చెందిన 2500 మంది సీఎం కేసీఆర్‌తో కలిసి రెండు దఫాలుగా సహపంక్తి విందు భోజనాలు ఆరగించారు. ‘నేను సినిమా యాక్టర్‌ను కాదు, ఇక నుంచి ఇటువంటివి అన్నీ బంద్‌. ఇకపై అద్భుతంగా పనిచేయడమే మీ పని’ అని వాసాలమర్రి యువకులకు సీఎం కేసీఆర్‌ హితవు పలికారు.

Updated Date - 2021-06-23T08:54:55+05:30 IST