Saudi నుంచి వచ్చిన విమానం.. ఓ ప్రయాణికుడిని కారులో వెంబడించిన పోలీసులు.. క్రైమ్ సినిమా స్టోరీ తరహాలో..

ABN , First Publish Date - 2021-09-08T20:37:34+05:30 IST

విదేశాల నుంచి అక్రమ మార్గంలో బంగారం స్మగ్లింగ్ చేసేవారు రోజుకో కొత్తమార్గంలో దేశానికి పసిడిని పట్టుకొస్తున్నారు. చివరకు కస్టమ్స్ అధికారులకు రెడ్‌హ్యాండెడ్ పట్టుబడుతున్నారు.

Saudi నుంచి వచ్చిన విమానం.. ఓ ప్రయాణికుడిని కారులో వెంబడించిన పోలీసులు.. క్రైమ్ సినిమా స్టోరీ తరహాలో..

లక్నో: విదేశాల నుంచి అక్రమ మార్గంలో బంగారం స్మగ్లింగ్ చేసేవారు రోజుకో కొత్తమార్గంలో దేశానికి పసిడిని పట్టుకొస్తున్నారు. చివరకు కస్టమ్స్ అధికారులకు రెడ్‌హ్యాండెడ్ పట్టుబడుతున్నారు. కానీ, కొందరు మాత్రం అధికారుల కళ్లుగప్పొ లేదంటే వారికి ఎంతోకొంత మూటజెప్పొ విదేశాల నుంచి తెచ్చిన బంగారంతో బయటపడుతున్నారు. అయితే, బయటపడిన తర్వాత కూడా వారి అదృష్టం బాగాలేకపోతే మాత్రం చివరకు అధికారుల చేతికే చిక్కుతారు అనడానికి తాజాగా ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నో‌లో చోటుచేసుకున్న ఘటననే నిదర్శనం. సౌదీలోని రియాధ్ నుంచి ఓ ప్రయాణికుడు ఏకంగా 9 కిలోల బంగారం తీసుకొచ్చాడు. దాని విలువ సుమారు రూ.4.50కోట్లు.


ఎయిర్‌పోర్టులో కస్టమ్ పోలీస్ సహాయంతో బయటపడిన అతగాడు.. చివరకు డీఆర్ఐ(డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) అధికారులకు పట్టుబడ్డాడు. అయితే, డీఆర్ఐ అధికారులకు సదరు స్మగ్లర్ అంతా ఈజీగేమీ దొరకలేదు.  క్రైమ్ సినిమా స్టోరీ తరహాలో అధికారులు అతగాడిని చేజ్ చేసి మరీ పట్టుకున్నారు. అనంతరం అతని నుంచి తొమ్మిది కిలోల బంగారం స్వాధీనం చేసుకుని, పోలీసులకు అప్పగించారు. డీఆర్ఐ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం లక్నోలోని చౌదరి చరణ్ సింగ్ విమానాశ్రయానికి సౌదీ రాజధాని రియాధ్ నుంచి భారీ మొత్తంలో బంగారం స్మగ్లింగ్ జరుగుతున్నట్లు డీఆర్ఐ అధికారులకు ముందే సమాచారం అందింది. దాంతో ఉదయం నుంచే అధికారులు అలర్టై.. ఎయిర్‌పోర్ట్ వద్ద నిఘా పెట్టారు.


ఇవి కూడా చదవండి

ఫంక్షన్‌ హాల్‌ను అద్దెకు ఇచ్చి అమెరికాకు వెళ్లిపోయిన NRI.. ఆరేళ్ల తర్వాత భారత్‌కు తిరిగొచ్చాక డబుల్ షాక్..

భారీ జీతాలు ఉన్న వలసదారులకు.. షాకిచ్చేందుకు రెడీ అవుతున్న Kuwait..!

అలా వేచి చూస్తున్న అధికారులకు.. సౌదీ నుంచి వచ్చిన విమానంలోంచి దిగిన ఓ ప్రయాణికుడు అనుమానాస్పదంగా కనిపించాడు. విమానం దిగిన తర్వాత సదరు ప్రయాణికుడు ఎయిర్‌పోర్ట్ బయటకు వచ్చి, అక్కడ ఆగి ఉన్న ఓ ఎస్‌యూవీ వాహనంలో ఎక్కాడు. దాంతో అధికారులు ప్రయాణికుడు ఎక్కిన కారును వెంబడించారు. చాలా సేపు చేజ్ చేసిన తర్వాత ఎట్టకేలకు ఆ వాహనాన్ని ఎక్స్‌ప్రెస్ వేపై అధికారులు ఆపారు. అందులో ఉన్న వ్యక్తిని తనిఖీ చేశారు. దాంతో అతడి వద్ద 77 బంగారు బిస్కెట్లు దొరికాయి.


కట్‌డ్రాయర్‌లో జేబులాంటిది ఏర్పాటు చేసుకుని దాంట్లో వాటిని తీసుకొచ్చాడు సదరు ప్రయాణికుడు. తొమ్మిది కిలోల బరువు గల వాటి విలువ సుమారు రూ. 4.50కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. అతడిని విచారించిన అధికారులకు షాకింగ్ విషయం తెలిసింది. తాను లక్నో ఎయిర్‌పోర్ట్ నుంచి బంగారంతో బయటపడడానికి అక్కడ పనిచేసే ఓ కస్టమ్ పోలీస్ తనకు సహకరించినట్లు చెప్పాడు. అంతేగాక బంగారాన్ని ముజాఫర్‌నగర్ తీసుకెళ్తున్నట్లు చెప్పాడు. స్మగ్లర్ నుంచి బంగారం స్వాధీనం చేసుకున్న అధికారులు.. అతడ్ని పోలీసులకు అప్పగించారు. అలాగే అతనికి సాయం చేసిన కస్టమ్ పోలీస్‌ను కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు.       



Updated Date - 2021-09-08T20:37:34+05:30 IST