Abn logo
Apr 6 2021 @ 03:27AM

నిజాంసాగర్‌కు గోదావరి జలాలు

నేడు విడుదల చేయనున్న సీఎం కేసీఆర్‌.. 4 జిల్లాలకు ప్రయోజనం

గజ్వేల్‌, ఏప్రిల్‌ 5 : సిద్దిపేట జిల్లా వర్గల్‌ మండలం అవుసులోనిపల్లిలో కొండపోచమ్మసాగర్‌కు అనుసంధానంగా నిర్మించిన సంగారెడ్డి కెనాల్‌ నుంచి నిజాంసాగర్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంగళవారం గోదావరి జలాలను విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఆయన గజ్వేల్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటన ఏర్పాట్లను మంత్రి హరీశ్‌రావు, కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి, కాళేశ్వరం ఈఎన్‌సీ హరేరాంతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా హరీశ్‌ రావు మాట్లాడుతూ సంగారెడ్డి కెనాల్‌కు నీటిని విడుదల చేయగానే మొదటగా వర్గల్‌లోని బంధం చెరువు, పెద్దచెరువు, శాఖారంలోని దమ్మాయి చెరువు, అంబర్‌పేటలోని ఖాన్‌చెరువులకు నీరు చేరుతుందని, ఆ తర్వాత ఖాన్‌చెరువు పొంగి నేరుగా హల్దీ వాగులోకి నీరు చేరుతుందని తెలిపారు. ఆరు కిలోమీటర్ల మేర సంగారెడ్డి కాలువపై ప్రయాణించి, హల్దీలో చేరి అక్కడి నుంచి 70 కిలోమీటర్ల మేర ప్రయాణించనుందని చెప్పారు. ఈ క్రమంలో గజ్వేల్‌ నియోజకవర్గంలో 18, నర్సాపూర్‌ నియోజకవర్గంలో 10, మెదక్‌ నియోజకవర్గంలో 4 మొత్తం 32 చెక్‌డ్యాంలను దాటుకుని మంజీరా నదిలో ఈ నీరు కలుస్తుందని వెల్లడించారు. మంజీరా నుంచి 20 కిలోమీటర్ల మేర ప్రయాణం చేసి నిజాంసాగర్‌కు గోదావరి జలాలు చేరనున్నాయని తెలిపారు. 


ప్రతిరోజూ 0.16 టీఎంసీల విడుదల 

ప్రస్తుతం 9 టీఎంసీల నీటితో నిండి ఉన్న కొండపోచమ్మ సాగర్‌ రిజర్వాయర్‌ నుంచి ప్రతి రోజూ 0.16 టీఎంసీల నీటిని అధికారులు విడుదల చేయనున్నారు. మొదట ఖాన్‌చెరువు వరకు 1,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేసి, అక్కడి నుంచి హల్దీలోకి నీటిని చేర్చనున్నారు. ఇప్పటికే ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఈ నీటి విడుదలతో సిద్దిపేట, మెదక్‌, కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాలకు ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం 14,278 ఎకరాల్లో పొట్టకు వచ్చిన పంటలకు ఈ జలాలు జీవం పోయనున్నాయి. 

Advertisement
Advertisement
Advertisement