గ్లోబల్ గుర్తింపు సరే, లోకల్ విలువ ఎంత?

ABN , First Publish Date - 2021-07-29T07:21:02+05:30 IST

రామప్ప గుడికి గుర్తింపు రావడం గురించిన ఆనందాలు సహజమే. మనమూ ఎన్నదగినవారమేనని, ప్రపంచ చరిత్రకు ఎక్కదగినవారమేనని తెలిసిరావడం ఎవరినైనా సంతోషపెట్టే విషయమే....

గ్లోబల్ గుర్తింపు సరే, లోకల్ విలువ ఎంత?

రామప్ప గుడికి గుర్తింపు రావడం గురించిన ఆనందాలు సహజమే. మనమూ ఎన్నదగినవారమేనని, ప్రపంచ చరిత్రకు ఎక్కదగినవారమేనని తెలిసిరావడం ఎవరినైనా సంతోషపెట్టే విషయమే. తెలంగాణ వారినీ, మొత్తంగా తెలుగువారినీ ఈ మధ్య కాలంలో ఇంతగా గర్వపెట్టిన సందర్భం ఇంకొకటి లేదనే చెప్పవచ్చు. 


కానీ, వారసత్వం గురించి నిజంగా మనకు అంత పట్టింపు ఉన్నదా అన్న ప్రశ్నను తప్పించుకోలేము. తమ ఏడేళ్ల పాలనలో పది వారసత్వ గుర్తింపులు సాధించామని కేంద్రప్రభుత్వం, పట్టుదలతో పరిశ్రమించి రామప్పను ప్రపంచపటం మీద నిలబెట్టామని తెలంగాణ రాష్ట్రప్రభుత్వం చెప్పుకుంటున్నాయి. వేరు వేరు కారణాలతో కూల్చివేతల మీద, కొత్త నిర్మాణాల మీద ఆసక్తి ఉన్న రెండు ప్రభుత్వాల పెద్దలకు, భారతీయ చారిత్రక వారసత్వం మీద అవగాహన కానీ, దాన్ని నిలబెట్టాలన్న తాపత్రయం కానీ నిజంగా ఉంటాయా? ఏదో ఒక అవగాహన, ఏదో ఆసక్తి ఉన్నప్పటికీ, అవి ఐక్యరాజ్యసమితి విద్య, శాస్త్ర, సాంస్కృతిక వ్యవహారాల సమితి- యునెస్కో భావనతో ఏకీభవిస్తాయా? సాంస్కృతికమైనవి కానీ, నైసర్గికమైనవి అయిన అద్భుత స్థలాలు, లేదా కట్టడాలు అవి ఆ దేశానికి ఆ ప్రాంతానికి మాత్రమే చెందినవి కావని, యావత్ మానవజాతి స్వీకరించదగిన వారసత్వం వాటిదని యునెస్కో చెబుతుంది. అంతరించిపోయిన ఒక నాగరికత ఆనవాళ్లను ప్రదర్శించే ధోలావీరాను, కాకతీయ సంస్కృతిని ప్రతిభావంతంగా ప్రస్ఫుటించే రామప్ప దేవాలయాన్ని అంతర్జాతీయ వారసత్వ కట్టడాలుగా గుర్తిస్తున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. అంతిమ పరిశీలనలో అంతా మనుషులమేనీ, అందరికీ కలిపి కూడా అంతో ఇంతో ఒక ఉమ్మడి చరిత్ర, వారసత్వం ఉంటాయని గుర్తించడం రాజకీయవాదులకు ఏమి సౌకర్యంగా ఉంటుంది? పౌరాణిక చరిత్రను ఆధునిక రాజకీయాలకు ఉద్దీపనంగా వాడుకునే రోజుల్లో, పారవశ్యాన్నీ, పూనకాన్నీ కలిగించే గాథలకు ఎటువంటి పురాతత్వమూ పాఠ్య ఆధారమూ అవసరం లేదు.


మానవాళి వారసత్వంగా ఒక కట్టడాన్ని లేదా స్థలాన్ని గుర్తించినప్పుడు, అల్పమైన కారణాలతో దాన్ని భంగపరచడం కుదరదు. ప్రపంచానికంతా దాని మీద అంతో ఇంతో హక్కు ఏర్పడుతుంది. హంపీ కట్టడాల విషయంలో కానీ, తాజ్‌మహల్ విషయంలో కానీ, మన పాలకులు వారసత్వ పరిరక్షణ కట్టుబాట్లను ఖాతరు చేయకపోవడంతో వివాదాలు చెలరేగాయి. ఒక రోజు లాభం కోసం బంగారు బాతును చంపుకునే స్వార్థం మన పరిపాలన స్వభావంలోనే ఉన్నది. ఇదే రామప్ప గుడికి దగ్గరలో క్వారీ పేలుళ్లు ఆపాలని రచయితలు ఉద్యమం చేస్తే కానీ ప్రభుత్వానికి తెలిసిరాలేదు. అత్యంత ప్రాచీన బౌద్ధ కట్టడాలున్న చోట ప్రభుత్వ అతిథి గృహాలు కట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నది. 


చరిత్ర అంటే మొత్తంగా కళ్లకద్దుకునేటంతటి పవిత్రమైనదేమీ కాదు. మంచీ చెడ్డా ఉంటాయి. మనిషి తప్పటడుగుల నాగరికత దగ్గర నుంచి హింసను అపహరణను వ్యవస్థీకరించడం దాకా, ఎన్నో గుర్తులు కాలం పొడవునా కనిపిస్తాయి. పిరమిడ్ల అద్భుతమూ, దాని నిర్మాణంలోని క్రూరత్వమూ రెండూ చరిత్రే. భారతదేశం అణువణువూ వ్యాపించి అంతరించిన బౌద్ధం ఒక మధుర విషాద చరిత్ర. అలనాడే గొప్ప జీవనవిధానంతో వెలిగి, ఇప్పటికీ విప్పలేని లిపితో ఇంకా దాగుడుమూతలాడుతున్న సింధు నాగరికత ఒక ప్రహేళిక. అరణ్యగర్భంలో దొరికిన మహాసరీసృపం అస్థిపంజరం ఒక మానవపూర్వ యుగపు పలకరింపు. మనుషులం రూపుదిద్దుకున్న పరిణామచరిత్ర, మనుషులలోని మానుషత్వ అమానుషత్వాల మధ్య నడిచిన, నడుస్తున్న రక్తసిక్త చరిత్ర, వీటన్నిటి నడుమా మానవ మేధకు, ప్రతిభకు, నైపుణ్యానికి, ఔన్నత్యానికీ సంకేతాలుగా నిలిచిన మహా కాలాలు, మహా మనీషులు, గొప్ప సందర్భాలు.. ఇవన్నీ చరిత్రే. ఆనవాళ్లు మనలో జ్ఞాపకాలను ఉద్దీపింపజేస్తాయి. ఒక పరంపరను గుర్తు చేస్తాయి. మనుషులందరం తరువాతి కాలాల కోసం కట్టుకునే సద్దిమూట చరిత్ర, వారసత్వం. చరిత్రలోని మరకలను ఇప్పుడు చెరిపివేయాలనుకోవడం చారిత్రక దృష్టి కాదు. మనలను బంధించిన చెరసాలలను, ఉరితీసిన రాతికొయ్యలను కూడా గతం గుర్తులుగా నిలబెట్టుకోవాలి. జరిగిపోయిన చరిత్రను సవరించలేము, చరిత్ర నుంచి నేర్చుకోగలము.


ఒకనాటి సువిశాల దండకారణ్యంలోకి తరలివచ్చిన జనసమూహాలను పల్లెలుగా స్థిరపరచి, పొలాలకు జలాలను కల్పించిన కాకతీయుల కాలపు ఉలికొసల భావుకతను, శైవధర్మ వ్యాప్తిని సంతకంగా మిగిల్చిన రామప్ప దేవాలయం, అది నిర్మించినప్పుడు ఒక మత ప్రదేశం అయి ఉండవచ్చు. తెలంగాణ ముఖ్యమంత్రి ఎందుకు అట్లా వ్యాఖ్యానించారో తెలియదు కానీ, రామప్ప దేవాలయం తెలంగాణ ఆధ్యాత్మిక సంస్కృతికి ప్రతీక కాదు. వేములవాడ, కాళేశ్వరం వంటి శైవ క్షేత్రం కాదు రామప్ప. అక్కడ ఉన్నది రామలింగేశ్వరుడే అయినప్పటికీ, అక్కడి శిల్పవైభవమే దాన్ని ప్రశస్తికి తెచ్చింది. శిల్పిపేరుతోనే ప్రసిద్ధి పొందడం చారిత్రకమో కాదో కానీ, దైవం వల్ల కాక శిల్పం వల్లనే చెప్పుకోవలసిన నిర్మాణం అది. అది ఆ నాటి సౌందర్యదృష్టిని, అసాధారణ నిర్మాణ కౌశలతను, శిల్ప నిపుణతను ప్రదర్శించిన ఆలయం. రాజుల సొమ్ము రాళ్ల పాలు నిజమే కానీ, కాకతీయుల కాలంలో కొంత నీళ్లపాలు కూడా అయింది. గుడితో పాటు రేచర్ల రుద్రుడు చెరువును కూడా తవ్వించాడు. బడబాగ్నికి భయపడి, సముద్రం వచ్చి ఈ తటాకంలో తలదాచుకుందని రామప్పగుడిలోని శాసనం రాసిన కవి వర్ణిస్తాడు. శిల్పం లాగే చిక్కగా ఉంటుంది ఆ శాసనకవనం. 


పాలంపేట లోని రామప్ప ఆలయం శిల్ప ప్రతిభకు పరాకాష్ఠగా చెప్పుకున్నా, అదొక్కటే కాకతీయ కళా సర్వస్వం కాదు. రేచర్ల రుద్రుడే చాలా ఆలయాలు కట్టించాడు. వేయి స్తంభాల గుడి సరే సరి. దక్షిణ భారతం దాకా విస్తరించిన కాకతీయ సామ్రాజ్యం ముద్ర అనేక కట్టడాల్లో కనిపిస్తుంది. వరంగల్ కోట అసంపూర్తిగా ఆవిష్కరణ జరిగిన మరో అద్భుతం. ఐదువందలేళ్ల నాటి హంపీ నిర్మాణాల లాగా, వరంగల్ కోట శిథిలాలు విస్తరించిన ప్రాంతమంతా అంతర్జాతీయ వారసత్వ కట్టడం కాగలిగిన ప్రత్యేకత కలిగినది. అస్తిత్వ ఉద్వేగాల మీద విజయం సాధించినప్పటికీ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చరిత్ర, వారసత్వాల మీద పెద్దగా దృష్టి పెట్టలేదు. అనేక వారసత్వ కట్టడాలను స్వయంగా నిర్మూలించింది. ఆధునిక అభివృద్ధి పేరిట జరిగే కూల్చివేతలను అనుమతించింది. హైదరాబాద్ నగరానికి చారిత్రక చిహ్నాలుగా పరిగణించే అనేక కట్టడాల కూల్చివేత ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనల్లో ఇంకా కొనసాగుతున్నాయి. రామప్ప విషయంలో మాత్రం ఆ ప్రభుత్వం, అందులో పనిచేసిన అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నందుకు అభినందించవలసినదే. అయితే, వారసత్వ కట్టడాల పరిరక్షణ అన్నది ఒక చర్యతో, ఒక గుర్తింపుతో పూర్తి అయ్యేది కాదు. అదొక నిరంతర ప్రక్రియ. విలువగా పాటించకపోతే అది విఫలం అవుతుంది. 


మొత్తంగా అభివృద్ధి విధాన దృక్పథానికి, చారిత్రక వారసత్వాల పరిరక్షణకు కూడా సంబంధం ఉంటుంది. దైవ, మత క్షేత్రాల నిర్మాణానికి వేలాది కోట్ల రూపాయలు వెచ్చిస్తారు. కానీ, ఒక ఆర్థిక కార్యక్రమంగా కూడా వారసత్వ కట్టడాల రక్షణ జరగదు. శైవ, వైష్ణవ తదితర హైందవ ధార్మిక ప్రాచీన స్థలాలు కనీసం పూజాదికాల వల్ల అయినా ఏదో ఒక రూపంలో రక్షణ పొందుతుంటాయి. కానీ, తెలంగాణ గర్వించదగిన బౌద్ధ క్షేత్రాల విషయంలో ఎటువంటి శ్రద్ధా ఎవరినుంచీ కనిపించదు. ధూళికట్ట దగ్గర నుంచి ఫణిగిరి మీదుగా నేలకొండపల్లి దాకా విస్తరించిన బౌద్ధ కేంద్రాలను తగిన సదుపాయాలతో తీర్చిదిద్దితే అంతర్జాతీయ పర్యాటకాన్ని ఆకర్షించవచ్చు. చారిత్రకంగా తమను దేవాలయాలలోకి అనుమతించని దురాచారం కారణంగా, అనేక ప్రాచీన ఆలయాల విషయంలో, ఇతర శ్రేణుల వారు తాదాత్మ్యం పొందినట్టుగా దళితులు పొందకపోవచ్చు. బౌద్ధ కేంద్రాల పునరుద్ధరణ వారికి, వారితో పాటు ప్రగతిశీల దృష్టి కలిగినవారికి ప్రీతిపాత్రమైన గమ్యాలు అవుతాయి. ఏమి చేయడానికైనా ప్రభుత్వాలకు ఒక సాంస్కృతిక విధానం అంటూ ఉండాలి. 


అడుగడుగునా చరిత్ర పరిమళించే భారతదేశంలోని అసంఖ్యాక వారసత్వ చిహ్నాలలో కొన్ని నమూనాలు మాత్రమే లోకం దృష్టికి పోయాయి. ఇంకా అనేకం వెలుగు చూడలేదు, చూసినా ఆదరణ పొందలేదు. యునెస్కో గుర్తింపు పొందిన 40 కట్టడాలూ దేశానికి గర్వకారణమైనవే. నరేంద్రమోదీ ప్రభుత్వ హయాంలో పొందిన గుర్తింపులు కూడా ప్రశంసనీయమైనవి. మత పక్షపాతం ఉంటుందని ఇతరత్రా ఉన్న విమర్శలు, ఈ కట్టడాల విషయంలో మోదీ ప్రభుత్వానికి వర్తింపజేయలేము. కానీ, ఆ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉన్న సిద్ధాంతకర్తలు విశ్వసించే చరిత్రకు, ధోలావీరా వంటి స్థలాలు చెప్పే చరిత్రకు పొంతన కుదరదు. నలందా మహా విహారాన్ని అంతర్జాతీయ వారసత్వ కట్టడం చేయడానికి దాన్ని నాశనం చేసిన దండయాత్రికులు కారణం అయి ఉంటారు కానీ, భారతదేశంలో బౌద్ధాన్నే నాశనం చేసిన చరిత్రను ఎట్లా అర్థం చేసుకుంటారు? బహుశా, ఆ వైరుధ్యాలను భిన్న అన్వయాల ద్వారా పరిష్కరించుకుంటారేమో!


కె. శ్రీనివాస్

Updated Date - 2021-07-29T07:21:02+05:30 IST