లోకల్‌ కాదు... గ్లోబల్‌ ‘బతుకమ్మ’

ABN , First Publish Date - 2020-10-18T15:40:05+05:30 IST

భూమి పసుపు వర్ణంలో మెరుస్తుంది. ఊరు సింగిడి అవుతుంది. పుట్టింటి వాకిళ్లలో ఆడబిడ్డల ముఖాలు ఆనందంతో విరబూస్తాయి. సాయంత్రాలు ఊరూ వాడా ఏకమై బతుకమ్మ ఆట ఆడుతుంది. చెరువులు తీరొక్క పూల నిమజ్జనంతో తళతళ మెరుస్తాయి.

లోకల్‌ కాదు... గ్లోబల్‌ ‘బతుకమ్మ’

భూమి పసుపు వర్ణంలో మెరుస్తుంది. ఊరు సింగిడి అవుతుంది. పుట్టింటి వాకిళ్లలో ఆడబిడ్డల ముఖాలు ఆనందంతో విరబూస్తాయి. సాయంత్రాలు ఊరూ వాడా ఏకమై బతుకమ్మ ఆట ఆడుతుంది. చెరువులు తీరొక్క పూల నిమజ్జనంతో తళతళ మెరుస్తాయి. ‘ఒక్కేసి పువ్వేసి సందమామ’, ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో...’ అంటూ తరతరాలుగా లయబద్ధంగా వినిపిస్తున్న బతుకమ్మ పాటలు కొత్త రాగాలు అందుకుంటున్నాయి. తెలంగాణలో సాంప్రదాయ బతుకమ్మ పాట సరికొత్త సొబగులు అద్దుకుని యూట్యూబ్‌లో ప్రపంచాన్ని చుట్టి వస్తోంది. నవతరాన్ని ఉర్రూతలూపుతోంది. 


బతుకమ్మ అచ్చంగా ఆడబిడ్డల పండుగ. ఆడబిడ్డ చుట్టూ అల్లుకున్న అనుబంధాల పండుగ. ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై తొమ్మిది రోజుల పాటు అంటే సద్దుల బతుకమ్మ దాకా తెలంగాణ పూలవనంగా మారి బతుకమ్మ ఆటపాటలతో పులకరించిపోతుంది. ఆరేళ్ల పాపల నుంచి, అరవై ఏళ్ల ముసలోళ్ల దాకా బతుకమ్మ పాటల్లో పాలుపంచుకోవాల్సిందే. అయితే అప్పటిదాకా మౌఖిక సాహిత్యంగా, ఊరి పొలిమేరలకే పరిమితమైన ఆ పాట క్రమక్రమంగా బతుకుపాటగా, జీవనసారంగా రూపాంతరం చెందింది. తెలంగాణ ఉద్యమ సమయంలో, రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ పాటకు ఎంతోమంది గీత రచయితలు, గాయనీగాయకులు, సంగీతకారులు కొత్త రెక్కలు తొడిగారు. ఇప్పుడు ఆ పాట డిజిటల్‌ స్వరాలతో విశ్వవాప్తమైంది.


పాత పాటలు... కొత్త భావాలు...

నిజానికి తరతరాల బతుకమ్మ పాటలన్నీ మౌఖిక సాహిత్యమే. ఆ సాహిత్యాన్ని ఒక్కచోటికి చేర్చి  ముందుతరాలను ‘జాగృతి’ పరిచే క్రమంలో కొత్త గొంతుకలు వినిపించాయి. ఒకటి కాదు... రెండు కాదు... యూట్యూబ్‌ నిండా బతుకమ్మ పాటల తోరణాలే. అందులో ఎప్పుడో అమ్మమ్మల కాలం నాటి ‘రామ రామ రామ ఉయ్యాలో...’ నుంచి ఈతరం ‘సిటపట సినుకు కురిసే, సెట్టు ఇగురు పెట్టే... తళతళ తంగేళ్లు పూసే, గునుగేమో విరిసే’ దాకా వేలాది పాటలు ఎన్నో కొత్త గళాలను మనకు పరిచయం చేస్తాయి. వారిలో బతుకమ్మ పాటలతో సెలబ్రిటీలుగా మారిన వారు ఎంతోమంది ఉన్నారు. అందరూ మారుమూల గ్రామాల్లో నుంచి వచ్చిన వారే. పాటతో పాటు మట్టి వాసనలను మోసుకొచ్చినవారే. ఈ ఏడాది ‘కొంగుళ్లు సుట్టుండ్రి కోమలాంగి, కొనగొమ్మలు వంచుండ్రి సుందరాంగి... తమ్ముళ్ల పంపుండ్రి కోమలాంగి... అన్నల్ల పిలవండ్రే సుందరాంగి...’ అంటూ బతుకమ్మ పాటను అద్భుతంగా గానం చేసిన అరవై ఏళ్లకు పైబడిన కనకవ్వ ఇప్పటికే యూట్యూబ్‌ స్టార్‌గా పేరు తెచ్చుకుంది. ఒక టీవీ ఛానెల్‌లోని ‘ఫోక్‌ స్టూడియో’ కార్యక్రమం ద్వారా వెలుగులోకి వచ్చిన కనకవ్వ పెద్దపల్లి జిల్లా రామగుండం నివాసి. చిన్నతనంలోనే తల్లి రాజవ్వ నుంచి బతుకమ్మ పాటలను నేర్చుకున్న కనకవ్వ సంక్రాంతి సందర్భంగా పాడిన ‘గొబ్బియల్లో’ పాటకు యూట్యూబ్‌లో సుమారు 2 కోట్ల వ్యూస్‌ రావడం విశేషం. ఆ తర్వాత ‘మేడారం జాతర’ పాట కూడా సూపర్‌ హిట్టయ్యింది. ఈ ఏడాది ఏకంగా నాలుగు బతుకమ్మ పాటలు పాడింది. ‘‘నా చిన్నప్పుడు ఊళ్లో మా అవ్వ వచ్చి పాడితేనే బతుకమ్మ పాటకు నిండుదనం వచ్చేది. ఆమె గొంతు అంత గొప్పగా ఉండేది. ఇప్పుడు నా పాటను ఈతరం మెచ్చుకోవడం ఆనందంగా ఉంది’’ అంటోంది కనకవ్వ.


ఈతరానికి తగ్గట్టుగా...

‘తళ తళలాడే తంగేడులు, మరదలు వదినల అల్లరులు... గునుగు, మోదుగు, గుమ్మడులు... అవ్వల నవ్వులురా’... ఇదీ ఈ ఏడాది నా కొత్త బతుకమ్మ పాట. ఈ పాటకు సంబంధించిన ప్రోమో ఇప్పటికే యూట్యూబ్‌లో మారుమ్రోగుతోంది.  2017లో నేను పాడిన బతుకమ్మ పాట అందరికీ తెగ నచ్చేసింది. అప్పటి నుంచి ప్రతీ ఏడాది ఒక పాట పాడుతున్నా. అంతేకాదు... అనేక దేశాల్లో బతుకమ్మ వేడుకల్లో పాల్గొని నా పాటలతో ఉర్రూతలూగించా. ఈ తరానికి తగ్గట్టుగా బతుకమ్మ పాట కూడా మారడంలో ఎలాంటి ఆక్షేపణ లేదు. సంప్రదాయాన్ని కొత్తతరం అందుకుందా? లేదా? అన్నదే ముఖ్యం. 

 - మంగ్లీ, గాయని   

వందలాది పాటలు...

2014 నుంచి బతుకమ్మ పాటల సంఖ్య  ఏటా అనూహ్యంగా పెరుగుతూనే ఉంది. సాంప్రదాయ బతుకమ్మ పాటలతో పాటు పల్లె, ప్రకృతి గొప్పదనం, మానవ సంబంధాలు, జీవన సౌందర్యాన్ని పట్టించే ఎన్నో పాటలు వెలుగుచూస్తున్నాయి. 1998లో ‘నగారా మోగింది’ ఆల్బమ్‌తో తెలంగాణ ఉద్యమ గీతాల మీదుగా సాగిన తేలు విజయ బతుకమ్మ పాటలతో మరింత పాపులర్‌ అయ్యింది. 2015లో ఆమె పాడిన ‘చిన్నీ మా బతుకమ్మ’ పాట అప్పట్లో ఉర్రూతలూగించింది. ఆ పాట ఇచ్చిన ఉత్సాహంతో ఆమె ప్రతీ ఏడాది బతుకమ్మ పాటలు పాడుతూనే ఉంది. 2018లో ఏకంగా 32 బతుకమ్మ పాటలు పాడిందంటే ఆమె పాటలకు ఎంత క్రేజ్‌ ఉందో అర్థం అవుతుంది. గత ఏడాది 22 పాటలు పాడిన విజయ ఈ ఏడాది 8 పాటలు పాడింది. వాటిలో గీత రచయిత కందికొండ రాసిన ‘మా నేల మాగాణుల్లో బతుకమ్మ’ ఒకటి. ‘‘13 ఏళ్ల క్రితమే నేను ‘బతుకమ్మ’ సినిమాలో ‘ఊరికి ఉత్తరాన వలలో...’ అనే పాట పాడాను. బతుకమ్మ పాటలు నాకు అమితమైన గుర్తింపును తీసుకొచ్చాయి. తరం మారుతున్నట్టే బతుకమ్మ పాటల్లో కూడా మార్పు వస్తోంది. ఇప్పుడు డీజే రూపంలో తక్కువ వ్యవధిలో పాట కొత్తగా వినిపిస్తోంది. బతుకమ్మ ఆట రూపం కూడా మారుతోంది. కాలంతో పాటు మనం సాగాలి కదా. అయితే కొత్తతరం ఈ సాంప్రదాయ పండుగను గొప్పగా సెలబ్రేట్‌ చేసుకోవడానికి పాటే ప్రాణంగా మారింది’’ అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు విజయ. నవతరం బతుకమ్మ పండుగను ఒక ఈవెంట్‌గా సెలబ్రేట్‌ చేస్తుండటంతో దానికి తగ్గట్టే బతుకమ్మ పాటల సంఖ్య పెరుగుతోంది. ప్రతీ ఏడాది 150కి పైగా బతుకమ్మ పాటలు వెలుగుచూస్తున్నాయి. యూట్యూబ్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. 


కొత్తతరం వచ్చేసింది...

రెగ్యులర్‌ పాటలకు బతుకమ్మ పాటలకు చాలా తేడా ఉంటుంది. జానపదంపై పట్టు ఉంటూనే ప్రత్యేక రిథమ్‌ గొంతులో పలికించడం ఈ పాటల గొప్పదనం. వొల్లాల వాణి, రమాదేవి వంటి గాయనీమణులు బతుకమ్మ  పాటల్లో ఆరితేరారు. వారి బాటలోనే ఈతరానికి చెందిన మంగ్లీ, గంగ, లక్ష్మీ, మామిడి మౌనిక వంటి అనేకమంది నవయువ స్వరాలు అద్భుతంగా పాడుతూ పాటకు కొత్త ఉత్సాహాన్ని, ఊపును తెస్తున్నారు. ఈ క్రమంలో మిట్టపల్లి సురేందర్‌, కాసర్ల శ్యామ్‌, కందికొండ వంటి ఎంతోమంది గీత రచయితలు బతుకమ్మ ఔన్నత్యాన్ని ప్రపంచం ముంగిట తోరణాలుగా కడుతున్నారు. వారి గొంతుకలకు పల్లె పదాల, పండగ వెలుగుల జీవం పోస్తున్నారు. అందుకే ‘బతుకమ్మ పండుగొచ్చే గాజులోరన్నయ్యా... మట్టి గాజు లేసి పోరోరన్నయ్యా’ అంటూ బతుకమ్మ పాట విశ్వవ్యాప్తంగా వినిపిస్తోంది.

- చల్లా 

Updated Date - 2020-10-18T15:40:05+05:30 IST