మరిన్ని అప్పులు ఇప్పించండి!

ABN , First Publish Date - 2022-04-06T07:55:43+05:30 IST

‘ఆర్థికంగా కష్టాల్లో ఉన్నాం. కేంద్ర ప్రభుత్వమే ఆదుకోవాలి’’ అని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని వేడుకున్నారు.

మరిన్ని అప్పులు ఇప్పించండి!

  • ఆర్థిక కష్టాల్లో ఉన్నాం.. ఆదుకోండి
  • ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని సవరించండి
  • కరోనాతో దెబ్బతిన్న ఆర్థికం, పెరిగిన ఖర్చు
  • రాష్ట్ర విభజనతో సీమాంధ్రకు తీవ్ర నష్టం
  • పోలవరం సవరించిన 
  • అంచనాలను ఆమోదించండి
  • ప్రధాని మోదీకి సీఎం జగన్‌ అభ్యర్థన
  • షా, నిర్మల, షెకావత్‌లతోనూ సమావేశం 

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): ‘‘ఆర్థికంగా కష్టాల్లో ఉన్నాం. కేంద్ర ప్రభుత్వమే ఆదుకోవాలి’’ అని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని వేడుకున్నారు. మరిన్ని రుణాలు పొందడానికి అనుమతించాలని, అందుకు వీలుగా ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని సవరించాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టు వ్యయంపై సవరించిన అంచనాలను ఆమోదించాలని కోరారు. మంగళవారం సీఎం జగన్‌ ఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. దాదాపు గంటపాటు వివిధ అంశాలపై చర్చించారు. ప్రభుత్వ వర్గాల కథనం ప్రకారం.... రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కరోనా దారుణంగా దెబ్బతీసిందని, దాదాపు రూ.33,478 కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోయామని ప్రధానికి జగన్‌ చెప్పారు. కరోనా నియంత్రణ, చికిత్సల కోసం మరో రూ.7,130 కోట్లను అదనంగా ఖర్చు చేయాల్సిన అనివార్య పరిస్థితులు తలెత్తాయని తెలిపారు. ‘‘15వ ఆర్థిక సంఘం కేటాయింపులు తగ్గడం మరో ప్రతికూల పరిణామం. గత ప్రభుత్వం హయాంలో అదనపు రుణాలకు అనుమతిచ్చారు. ఆ అదనపు మొత్తాలను ఇప్పుడు రుణ పరిమితిలో కోత విధిస్తామంటున్నారు. 


దీనివల్ల రాష్ర్టానికి నష్టం వాటిల్లుతుంది. రుణ పరిమితికి మించి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ రుణాలు తీసుకురాలేదు. దీనిని పరిగణలోకి తీసుకుని రుణ పరిమితిని సవరించండి’’ అని ప్రధానికి జగన్‌ విన్నవించారు. రాష్ట్ర విభజన నాటికి పెండింగ్‌ బిల్లుల బకాయిల రూపంలో, 10వ వేతన సంఘం సిఫారసుల అమలులో భాగంగా ఇవ్వాల్సిన బకాయిల రూపంలో రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.32,625.25 కోట్లు సొంత వనరుల నుంచి ఖర్చు చేసిందని, ఈ నిధులను భర్తీ చేయాలని కోరారు. 58.32శాతం జనాభా నవ్యాంధ్రకు రాగా... ఆదాయం మాత్రం 46 శాతమే దక్కిందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 9శాతం జానాభా ఉన్న హైదరాబాద్‌ నగరాన్ని కోల్పోవడం ద్వారా ఆ నగరం నుంచి అందే 38 శాతం రెవెన్యూ కోల్పోయామని వివరించారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని ప్రధాని మోదీకి జగన్‌ విజ్ఞప్తి చేశారు. 2019 ఫిబ్రవరి 11న జరిగిన సాంకేతిక సలహా కమిటీ పోలవరం అంచనాలను రూ.55,548.87 కోట్లుగా నిర్ధారించిందని, ఈ అంచనాలను ఆమోదించాలని కోరారు. ‘‘ప్రాజెక్టు పూర్తిచేయడానికి ఇంకా రూ.31,188 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. నిర్మాణ పనుల కోసం రూ.8,590 కోట్లు.. భూసేకరణ, పునరావాసం కోసం రూ.22,598 కోట్లు ఖర్చవుతుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కాంపొనెంట్‌ వారీగా బిల్లుల చెల్లింపును సవరించాలి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చుకు, కేంద్రం చెల్లిస్తున్న బిల్లులకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటోంది. ఈ ఆంక్షల వల్ల రూ.905 కోట్ల బిల్లులను పోలవరం ప్రాజెక్టు అథారిటీ తిరస్కరించింది’’ అని ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు.  


ఆర్థిక, జలశక్తి మంత్రులతో భేటీ

ఆ తర్వాత సీఎం జగన్‌ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రం మరిన్ని రుణాలు పొందడానికి ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులను పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత... కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌తో సమావేశమై పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, సవరించిన అంచనాల ఆమోదంపై చర్చించారు.


ప్రధాని దృష్టికి మరిన్ని అంశాలు

కడప ఉక్కు పరిశ్రమకు తోడ్పాటు అందించాలి. 

2 బీచ్‌శాండ్‌ మైనింగ్‌ ప్రాంతాలను అణు శక్తి సంస్థ ఏపీఎండీసీకి కేటాయించింది. దీనికి సంబంధించిన అనుమతులు పెండింగులో ఉన్నాయి. మిగిలిన 14 ప్రాంతాలకు  కేటాయింపులు, అనుమతులకు ఆదేశాలివ్వండి.

రాష్ట్రానికి మరో 12 వైద్య కళాశాలలను మంజూరు చేయండి.

తెలంగాణ డిస్కంలు చెల్లించాల్సిన రూ.6,455.76 కోట్లను ఇప్పించండి. 

Updated Date - 2022-04-06T07:55:43+05:30 IST