1,833 కోట్లు ఇవ్వండి

ABN , First Publish Date - 2021-09-18T07:34:17+05:30 IST

తెలంగాణకు ప్రస్తుతం ఆర్థిక వనరుల ఆవశ్యకత ఎక్కువగా ఉందని, ఈ దృష్ట్యా రాష్ట్రానికి రావాల్సిన రూ.1,833 కోట్లను వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు కోరారు.

1,833 కోట్లు ఇవ్వండి

  • రాష్ట్రానికి ప్రస్తుతం ఆర్థిక వనరుల అవసరం ఉంది
  • పన్నుల వాటా కింద రూ.210 కోట్లు..
  • వెనుకబడిన ప్రాంతాలకు రూ.900 కోట్లు రావాలి 
  • 15వ ఆర్థిక సంఘం రూ.723 కోట్లను సిఫారసు చేసింది
  • కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు హరీశ్‌ లేఖ
  • జీఎస్టీ కౌన్సిల్‌ భేటీలో పాల్గొన్న మంత్రి


హైదరాబాద్‌, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): తెలంగాణకు ప్రస్తుతం ఆర్థిక వనరుల ఆవశ్యకత ఎక్కువగా ఉందని, ఈ దృష్ట్యా రాష్ట్రానికి రావాల్సిన రూ.1,833 కోట్లను వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు కోరారు. పన్నుల వాటా, వెనుకబడిన ప్రాంతాలకు కేటాయించే గ్రాంటు, 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన నిధుల కింద ఈ రూ.1,833 కోట్లు రావాల్సి ఉందని వివరించారు. శుక్రవారం లఖ్‌నవ్‌లో జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొనడానికి వెళ్లిన మంత్రి.. అక్కడే నిర్మలా సీతారామన్‌కు లేఖను అందజేశారు. ‘‘2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.13,944 కోట్ల ఐజీఎస్టీ (ఇంటిగ్రేటెడ్‌ గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌) నిధులను రాష్ట్రాలకు కేటాయింపులు జరపకుండా.. భారత సంచిత నిధి (కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఇండియా)లో పెట్టి ఉంచారు. 


ఇందులో రాష్ట్ర వాటా(4.03%)లో 50% నిధులు అంటే.. రూ.281 కోట్లు, పన్నుల వాటా కింద మరో రూ.71 కోట్లు.. మొత్తం రూ.352 కోట్లు రావాల్సి ఉంది. ఇప్పటివరకు రూ.142 కోట్లు మాత్రం అందాయి. ఇంకా రూ.210 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. అలాగే వెనుకబడిన ప్రాంతాలకు కేంద్రం కేటాయించే గ్రాంటు కింద రాష్ట్రానికి రెండు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి రూ.900 కోట్లు రావాల్సి ఉంది. ఒక్కో జిల్లాకు రూ.50 కోట్ల చొప్పున తెలంగాణలోని హైదరాబాద్‌ మినహా పాత 9 ఉమ్మడి జిల్లాలకు ఏటా రూ.450 కోట్ల చొప్పున అందిస్తామంటూ కేంద్రం ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్‌ 94(2) ద్వారా హామీ ఇచ్చింది. అయితే.. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.450 కోట్లు ఇప్పటివరకు విడుదల కాలేదు. ఆ తర్వాతి ఆర్థిక సంవత్సరానికి (2020-21) సంబంధించి రూ.450 కోట్లు కూడా రావాల్సి ఉంది. ఈ మొత్తాన్ని విడుదల చేయాలి’’ అని హరీశ్‌రావు కోరారు. తెలంగాణలో కొత్తగా 33 జిల్లాలు ఏర్పడగా.. ఇందులో 32 జిల్లాలు వెనకబడినవేనని, ఈ నేపథ్యంలో వెనకబడిన ప్రాంతాలకు ఇచ్చే గ్రాంటును మరో ఐదేళ్ల పాటు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు.

   

కాటన్‌పై ఆర్‌సీఎంను రద్దు చేయండి.. 

కాటన్‌(పత్తి)పై అమలు చేస్తున్న ఆర్‌సీఎం (రివర్స్‌ చార్స్‌ మెకానిజం)ను రద్దు చేయాలని మంత్రి హరీశ్‌రావు జీఎస్టీ కౌన్సిల్‌ను కోరారు.  సమావేశంలో పాల్గొన్న మంత్రి.. ఆర్‌సీఎం వల్ల రాష్ట్రంలోని జిన్నింగ్‌ ఫ్యాక్టరీల ఓనర్లు నష్టపోతున్నారని వివరించారు. రైతుల నుంచి పత్తిని కొనుగోలు చేసినప్పుడు, మళ్లీ అమ్మినప్పుడు కూడా జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. దీనిని ఐటీసీ కింద క్లెయిమ్‌ చేసుకోవాల్సి ఉన్నప్పటికీ ఇబ్బందులు తప్పడం లేదని పేర్కొన్నారు. దీనిపై తాజాగా సమీక్షించేందకు ఫిట్‌మెంట్‌ కమిటీకి సిఫారసు చేయాలని విన్నవించారు. అయితే పెట్రోలు, డీజిల్‌పై ప్రస్తుతమున్న పన్ను విధానమే అమల్లో ఉంటుందని కౌన్సిల్‌ చైర్మన్‌ స్పష్టతనిచ్చారు. కాగా.. రాష్ట్రానికి ఐజీఎస్టీ కింద రావాల్సిన రూ.210 కోట్లను వెంటనే విడుదల చేయాలని కౌన్సిల్‌ చైర్మన్‌ను హరీశ్‌రావు కోరారు. తెలంగాణ రెవెన్యూ లోటు చాలా తక్కువగా ఉందని ఈ సందర్భంగా కౌన్సిల్‌ తెలిపింది. మంత్రి వెంట రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు కూడా ఉన్నారు. 

Updated Date - 2021-09-18T07:34:17+05:30 IST