లేని నీళ్ళ కోసం సిగపట్లు!

ABN , First Publish Date - 2020-10-29T06:21:23+05:30 IST

కృష్ణ బేసిన్‍లో నీటి లభ్యతను, అవసరాలను పరిగణనలోకి తీసుకొని, వాస్తవ పరిస్థితి అంచనా వేసి, సామరస్యంగా వ్యవహరిస్తే జల...

లేని నీళ్ళ కోసం సిగపట్లు!

శ్రీశైలం జలాశయంపై నీటి కేటాయింపులు ఉన్నవి అతి తక్కువ కాగా మిగిలినవి కేటాయింపులు లేనివే. క్రమేణా పూడిక వల్ల దాని నిల్వ సామర్థ్యం 215 టియంసిలకు తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో వాస్తవ పరిస్థితి పరిశీలిస్తే రెండు రాష్ట్రాలు కోరుకుంటున్నట్లు నీటి లభ్యత ఎక్కడ ఉంది? లేని నీళ్ల కోసం రెండు రాష్ట్రాలు సిగపట్లకు దిగడం ఎందుకు? బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వచ్చేవరకు, బచావత్ ట్రిబ్యునల్ తీర్పుననుసరించి కేటాయింపులు ఉన్న ప్రాజెక్టులకు ముందుగా నీరు ఇచ్చి, మిగిలిన నీటిని వరస క్రమంలో 11వ షెడ్యూలులోని ప్రాజెక్టులకు, ఆ తర్వాత సాంకేతిక అనుమతులు లేని ప్రాజెక్టులకు ఇవ్వడం మించి మరో పరిష్కారం లేదు. 


కృష్ణ బేసిన్‍లో నీటి లభ్యతను, అవసరాలను పరిగణనలోకి తీసుకొని, వాస్తవ పరిస్థితి అంచనా వేసి, సామరస్యంగా వ్యవహరిస్తే జల పంపిణీ విషయంలో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితికి తెరపడుతుంది. ఇప్పుడు అమలులో వున్న బచావత్ అవార్డు మేరకు ఎవరి వాటా నీళ్లు వాళ్లు వినియోగించుకోవాలి. ముందుగా కేటాయింపులు ఉన్న ప్రాజెక్టులకు నీటి వినియోగం జరిగాక, ఆ తర్వాత మిగులు జలాల ఆధారంగా వున్న ప్రాజెక్టులకు నీరు వెళ్లాలి. ఇదే సమయంలో రెండు రాష్ట్రాలు కూడా తమకున్న వాటా నీటిని ఇతర ప్రాజెక్టులకు పునః కేటాయింపులు చేసుకొనే వీలు వుండాలి. మున్ముందు బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వచ్చిన తర్వాత ఆ మేరకు రెండు రాష్ట్రాలు నీటి వినియోగం చేసుకోవచ్చు. ఇంతకు మినహా రెండు తెలుగు రాష్ట్రాలకు మరో గత్యంతరం లేదు. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంయమనం పాటించాలి. గతంలో ఉమాభారతి ఆధ్వర్యంలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పాలమూరు దిండి ఎత్తిపోతల పథకాల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ తమ వాటా నీటినే ఉపయోగించుకొంటామని చెప్పారు. ప్రస్తుతం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ పథకాలకు సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి ఇదే చెబుతున్నారు. కొత్తగా నీటి కేటాయింపులు కోరడం లేదు. గతంలో తను చెప్పిన సూత్రం ఇప్పుడు ఎందుకు అన్వయం కాదో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచించాలి.


పైగా కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చేసే కేటాయింపులకు మించి అటు తెలంగాణగాని ఇటు ఏపీగాని ఒక్క నీటి బొట్టు తీసుకొనే అవకాశం లేనపుడు ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ పథకాలను తెలంగాణ వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. రాష్ట్ర విభజన తర్వాత బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ విచారణాంశాలను గుర్తించే సమయంలో 11వ షెడ్యూలులో వున్న ప్రాజెక్టులకు నీటి కేటాయింపుల అంశం చేర్చకు నేందుకు తొలుత నిరాకరించింది. తుదకు రెండు రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు అంగీకరించింది. ఎందుకంటే ట్రిబ్యునల్ పంపకం చేసేందుకు కృష్ణా నదిలో మిగిలి వున్నది క్యారీ ఓవర్ కింద వున్న 150 టియంసిలు మాత్రమే. 


బచావత్ ట్రిబ్యునల్ 75 శాతం నీటి లభ్యత కింద కృష్ణలో 2130 టియంసిల నీటి లభ్యత వుందని అంచనా వేసి ఉమ్మడి ఏపీకి 811 టియంసిలు కేటాయించింది. 1969లో ఉమ్మడి రాష్ట్రంలో ఆయా ప్రాంతాల్లో వున్న ప్రాజెక్టులను పరిగణనలోనికి తీసుకొని నీటి కేటాయింపులు చేసింది. ఆ ప్రాతిపదిక మేరకు రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి 512 టియంసిలు తెలంగాణకు 299 టియంసిలుగా కేంద్ర జలశక్తి శాఖ అధికారుల వద్ద ఒప్పందం కుదిరింది. ఇందులో తెలంగాణకు మైనర్ ఇరిగేషన్ కింద 89.16 టియంసిలు ఏపీకి 22.17 టియంసిలు కేటాయింపులు వున్నాయి. ఏపీకి చెంది కృష్ణ డెల్టాకు 181.20 టియంసిలు (డెల్టా ఆధునీకరణతో మిగిలిన 29 టియంసిల్లో భీమాకు 20 పులిచింతలకు 9 టియంసిలు కేటాయించారు), సాగర్ కుడి కాలువకు 132 టియంసిలు, ఎడమ కాలువకు 132 టియంసిలు కేటాయించారు. సాగర్ ఎడమ కాలువ కింద తెలంగాణ వాటా 99.75, ఏపీ వాటా 32.25 టియంసిలుగా వున్నాయి. సాగర్ దిగువ భాగంలో లభ్యమయ్యే నీరు పోగా మిగిలిన నీరు డెల్టాకు సాగర్ నుండి విడుదల చేయాలి. అంటే డెల్టా వాటా 152.20కు కుదించబడింది. 


కాగా శ్రీశైలం ఎగువ భాగంలో తెలంగాణ వాటా 37.9 టియంసిలుగా వుంది (జూరాల 17.9, భీమా వాటా 20). తెలంగాణ జూరాల నుంచే మిగులు జలాల ఆధారంగా గల నెట్టెంపాడుకు (22), నికర జలాలు కేటాయింపులు వున్న భీమాకు (20) తీసుకోవాల్సి వుంది. శ్రీశైలం ఎగువ భాగంలో తుంగభద్ర సబ్ బేసిన్‌లో రాయలసీమకు ఎగువ కాలువ కింద 32.50 టియంసిలు, దిగువ కాలువ కింద 29.50 టియంసిలు, కెసి కెనాల్‌కు తుంగభద్ర నుంచి 10 టియంసిలు, రిజర్వాయర్ కింద భాగం నది నుంచి 29.50 టియంసిలు, భైరవాణి తిప్పకు 4.90 టియంసిలు నీటి కేటాయింపులు వున్నాయి. సీమకు శ్రీశైలం నుంచి కేవలం కుడి కాలువకు 19 టియంసిల కేటాయింపులున్నాయి. ఇందులో 11 టియంసిలు రీజనరేషన్, 8 టియంసిలు కెసి కెనాల్ ఆయకట్టు ఆధునీకరణ కింద లభ్యమైనవి. ఈ విధంగా లెక్కలు వేస్తే కోస్తా ఆంధ్రకు 367.39 టియంసిలు, రాయలసీమకు 144.70 టియంసిలు, తెలంగాణకు 298.99 టియంసిల కేటాయింపులు అమలులో వున్నాయి. ప్రస్తుతం అమలులో వున్న బచావత్ కమిషన్ 75 శాతం నీటి లభ్యత తీసుకొని అన్ని రాష్ట్రాల మధ్య పంపకం చేసి రెండు రాష్ట్రాలకు కేటాయించిన 811 టియంసిలతో పాటు, మరో 150 టియంసిలను క్యారీ ఓవర్ కింద (శ్రీశైలంలో 60 సాగర్‍లో 90) ఉంచుకొనేందుకు అనుమతి ఇస్తూ, పైగా మిగులు జలాలను కూడా వినియోగించుకొనే స్వేచ్ఛ ఇచ్చింది. అదే సమయంలో తన తీర్పులో క్లాజు 14(A)లో రెండు వేల సంవత్సరాల తర్వాత వచ్చే ట్రిబ్యునల్ గాని కమిషన్ గాని తను కేటాయించిన నీళ్ల వినియోగంలోవుంటే సాధ్యమైనంత వరకు మార్పుచేయకూడదని స్పష్టం చేసింది. ఫలితంగానే బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల జోలికి బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ వెళ్ల లేదు. మిగిలిన నికర మిగులు జలాలను మాత్రం అన్ని రాష్ట్రాల మధ్య పంపిణీ చేసింది. రేపు కూడా కేటాయించబడిన నీరు వినియోగంలో వుంటే బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్లే కాదు, మరొక ట్రిబ్యునల్ కూడా మార్పు చేసే అవకాశం లేదు. ఈ విధానం ఏపీ లోనే కాకుండా దేశంలో ఎక్కడా అమలు జరగడం లేదు. మున్ముందు కూడా జరగబోదు. ఈ అంశం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, ఆయన సలహాదారులైన అధికారులకు తెలియదని భావించ లేము.


అయితే బచావత్ ట్రిబ్యునల్‌కు భిన్నంగా బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ 65 శాతం నీటి లభ్యత కింద సరాసరి నీటి లభ్యత కింద నికర మిగులు జలాలను అంచనా వేసి మొత్తం పంపిణీ చేసింది. ఇక పంపిణీకి కృష్ణలో చుక్క నీరు లేకుండా చేసింది. ఇందులో 150 టియంసిలు క్యారీ ఓవర్ తీసివేస్తే ఉమ్మడి ఏపీకి మిగిలింది 38 టియంసిలే. ఇందులో తెలుగు గంగకు 25, జూరాలకు 9, ఆర్డీయస్ కుడి కాలువకు 4 టియంసిలు మాత్రమే ఉన్నవి. బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఏకంగా ఆల్మట్టికి 130 టియంసిలు కేటాయించి పైగా 525 అడుగుల ఎత్తు పెంచుకొనేందుకు అనుమతి ఇచ్చింది. అయితే కోర్టు ఆదేశాలతో బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమలులో లేదు. ప్రస్తుతం బచావత్ అవార్డు అమలులో వుంది. మరో విశేషమేమంటే ఏపీకి కేటాయించిన 811 టియంసిలు కూడా రానపుడు క్యారీ ఓవర్ కింద కేటాయించిన 150 టియంసిల సంగతి మరచిపోవలసిందే. కర్ణాటకలో ఆల్మట్టి జలాశయం నిర్మాణం తర్వాత కృష్ణా నదికి వరద రావడం బాగా తగ్గింది. వరద కాలం ఆలస్యమౌతోంది. 2002–-03 నుండి 2019-–20 వరకు 18 సంవత్సరాల గణాంకాలను పరిశీలిస్తే ఏడేళ్లల్లో మాత్రమే 811 టియంసిలు మనకు చేరాయి. మిగిలిన పదకొండేళ్ళల్లో మన వాటా నీళ్లు కూడా రాలేదు. ఇటీవల కాలంలో 2015-–16లో 73.75 టియంసిలు, 2016-–17లో 337.95 టియంసిలు, 2017–-18లో 485.48 టియంసిలు, 2018-–19లో 583.68 టియంసిల నీళ్లు వచ్చాయి. తదుపరి రెండేళ్ళు వరదలు వచ్చాయి. మున్ముందు కూడా ఇదే విధంగా వరద వుంటుందన్న నమ్మకం లేదు. 


2019 ఎన్నికల తర్వాత తొలి రోజుల్లో ఈ పరిస్థితి అంచనా వేసిన ముఖ్యమంత్రులు ఇరువురు గోదావరి జలాలను తరలిస్తే తప్ప వేరే మార్గం లేదని సమాలోచనలు చేశారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల ఇంజనీరింగ్ అధికారులు శ్రీశైలం వద్ద 400 టియంసిలు మాత్రమే లభ్యమౌతాయని గోదావరి నుండి 900 టియంసిలు తరలిస్తేనే కృష్ణ బేసిన్‍లో రెండు రాష్ట్రాల అవసరాలు తీరుతాయని అంచనా వేశారు. ప్రస్తుతం అవన్నీ గాలికి పోయి జుట్లు పట్టుకొనే స్థితి నెలకొంది. ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువైన శ్రీశైలం జలాశయం ఒక్క దానిపైనే ఇరు రాష్ట్రాలకు చెందిన ప్రాజెక్టుల నీటి అవసరాలు చూస్తే ఆశ్చర్యం కలుగకమానదు. ఇదంతా లేని నీళ్లకోసం ఇరు రాష్ట్రాలు సాగిస్తున్న పోరుగా మిగిలి పోతుంది. 


ఈ ప్రాజెక్టులలో తెలంగాణకు చెందిన- పాలమూరు రంగా రెడ్డికి 90, శ్రీశైలం ఎడమ కాలువకు 40, దిండికి 30, కల్వకుర్తి 40, భీమాకు 20, నెట్టెంపాడుకు 22... ఇలా మొత్తం 242 టియంసిలు అవసరముంది. ఇక ఏపీకి చెందిన- వెలుగొండకు 43.5, హంద్రీనీవాకు 40, గాలేరు నగరికి 38, శ్రీశైలం కుడి కాలువకు 19, కెసి కెనాలుకు 10, చెన్నై 15, తెలుగు గంగ 29... ఇలా మొత్తం 194 టియంసిల నీరు కావాలి. ఇవి కాకుండా 30 టియంసిల ఆవిరి నష్టం కలుపుకొంటే రెండు రాష్ట్రాల అవసరాలకు దాదాపు 466 టియంసిలను ఒక్క శ్రీశైలం జలాశయం సరఫరా చేయాలి. ఇక పారుదల నష్టం వుండనే వుంది. ఇది సాధ్యమయ్యేపనేనా? ఇవి కాకుండా బచావత్ ట్రిబ్యునల్ తీర్పు మేరకు శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణా బ్యారేజీ వరకు అవసరమైన నికర జలాలను కిందకు వదలాలి. అన్ని కలుపుకొంటే వెయ్యి టియంసిల జలాలు అవసరం. అంత నీటి లభ్యత కృష్ణా నదిలో వుందా?


గమనార్హమైన అంశమేమంటే ప్రస్తుతం శ్రీశైలం జలాశయంపై ఆధారపడిన ఎక్కువ ప్రాజెక్టులకు వాస్తవంలో నీటి కేటాయింపులు లేవు. కొన్నింటికి సాంకేతిక అనుమతులు అసలే లేవు. నికర జలాలు కేటాయింపులు వున్న భీమా, శ్రీశైలం కుడి కాలువ, కెసి కెనాల్, చెన్నై... ఈ నాలుగు పథకాలను మినహాయిస్తే 11 షెడ్యూలులో వున్న ప్రాజెక్టులకు కూడా నీటి కేటాయింపులు లేవు. 


మరోవైపు బచావత్ ట్రిబ్యునల్ తీర్పు మేరకు విద్యుదుత్పత్తికి వదలాల్సిన నీటితో కలుపుకొని కృష్ణ డెల్టాకు, సాగర్‍కు 440 టియంసిలు శ్రీశైలం నుంచే విడుదల చేయాలి. కర్ణాటక ఆల్మట్టి నిర్మాణం దరిమిలా కృష్ణా బేసిన్‍లో వరద ఆలస్యంగా రావడానికి తోడు క్రమేణా నీటి లభ్యత తగ్గిపోతోంది. కొన్ని సంవత్సరాల్లో కేటాయింపులు వున్న ప్రాజెక్టులకే నీటికి కటకటలాడిన అనుభవముంది. ఈ పరిస్థితుల్లో శ్రీశైలం జలాశయం, కేటాయింపులు వున్న ప్రాజెక్టులకు నీటి సరఫరా చేస్తుందా? ఏ అనుమతులూ లేని ప్రాజెక్టులతోపాటు నీటి కేటాయింపులు లేని ప్రాజెక్టులకు నీటి సరఫరా చేస్తుందా? ఇప్పుడు రాష్ట్రంలో మూడు రకాల ప్రాజెక్టులున్నాయి. ఒకటి– నీటి కేటాయింపులు వున్నవి. రెండు– నీటి కేటాయింపులు లేకుండా 11వ షెడ్యూలులో వున్నవి. మూడు– ఏ రకమైన సాంకేతిక అనుమతులూ లేనివి. శ్రీశైలం జలాశయంపై నీటి కేటాయింపులు ఉన్నవి అతి తక్కువ కాగా మిగిలినవి కేటాయింపులు లేనివే. క్రమేణా పూడిక వల్ల దాని నిల్వ సామర్థ్యం 215 టియంసిలకు తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో వాస్తవ పరిస్థితి పరిశీలిస్తే రెండు రాష్ట్రాలు కోరుకుంటున్నట్లు నీటి లభ్యత ఎక్కడ ఉంది? లేని నీళ్ల కోసం రెండు రాష్ట్రాలు సిగపట్లకు దిగడం ఎందుకు? బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వచ్చేవరకు, బచావత్ ట్రిబ్యునల్ తీర్పుననుసరించి కేటాయింపులు ఉన్న ప్రాజెక్టులకు ముందుగా నీరు ఇచ్చి, మిగిలిన నీటిని వరస క్రమంలో 11వ షెడ్యూలులోని ప్రాజెక్టులకు, ఆ తర్వాత సాంకేతిక అనుమతులు లేని ప్రాజెక్టులకు ఇవ్వడం మించి మరో పరిష్కారం లేదు.  


ఈ పరిస్థితులను రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరిగణనలోనికి తీసుకొని సామరస్యంగా వ్యవహరించకపోతే తుదకు రెండు రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోక తప్పదు.

వి. శంకరయ్య 

విశ్రాంత పాత్రికేయులు 

Updated Date - 2020-10-29T06:21:23+05:30 IST