Women’s hockey: మళ్లీ ఓడిన భారత జట్టు

ABN , First Publish Date - 2021-07-27T01:39:08+05:30 IST

ఒలింపిక్స్‌లో భారత మహిళల జట్టు మరో ఓటమిని మూటగట్టుకుంది. జర్మనీతో జరిగిన పోరులో 0-2 తేడాతో ఓటమి పాలైంది

Women’s hockey: మళ్లీ ఓడిన భారత జట్టు

టోక్యో: ఒలింపిక్స్‌లో భారత మహిళల జట్టు  మరో ఓటమిని మూటగట్టుకుంది. జర్మనీతో జరిగిన పోరులో 0-2 తేడాతో ఓటమి పాలైంది. రాణీ రాంపాల్ జట్టుకు ఒలింపిక్స్‌లో ఇది వరుసగా రెండో ఓటమి. తాజా ఓటమితో క్వార్టర్ ఫైనల్ అవకాశాలను భారత జట్టు సంక్లిష్టం చేసుకుంది. తొలి క్వార్టర్‌లో నిక్ లొరెంజ్ తొలి గోల్ నమోదు చేసి జర్మనీకి ఆధిక్యాన్ని ఇవ్వగా, మూడో క్వార్టర్‌లో అన్నే  కటారినా ష్రోడెర్ గోల్ చేసి ఆధిక్యాన్ని డబుల్ చేసింది. భారత ప్లేయర్ గుర్జిత్ కౌర్ మూడో క్వార్టర్‌లో పెనాల్టీ స్ట్రోక్‌ను మిస్ చేసింది. 


రెండో క్వార్టర్‌లో జర్మన్ సర్కిల్‌లోకి భారత జట్టు దూసుకెళ్లినప్పటికీ గోల్ చేయడంలో విఫలమైంది. రాణీ రాంపాల్ సేనకు రెండుసార్లు స్పష్టమైన అవకాశాలు వచ్చినప్పటికీ వాటిని గోల్స్‌గా మలచడంలో రెండు సందర్భాల్లో విఫలమైంది. ఫలితంగా ఓటమిని చవిచూసింది. నాలుగో క్వార్టర్‌లో గోల్ చేసేందుకు చివరి నిమిషం వరకు ప్రయత్నించినప్పటికీ సఫలం కాలేకపోయింది. కాగా, నిన్న నెదర్లాండ్స్ చేతిలో భారత జట్టు ఓటమి పాలైంది. 


రెండు వరుస ఓటములు భారత జట్టు క్వార్టర్ ఫైనల్ అవకాశాలను క్లిష్టంగా మార్చాయి. రాంపాల్ సేన తన తర్వాతి మ్యాచ్‌లో గ్రేట్ బ్రిటన్ (బుధవారం), ఐర్లాండ్ (30) దక్షిణాఫ్రికా (31)తో తలపడుతుంది. ఆగస్టు 2 నుంచి నాకౌట్ స్టేజ్ మొదలవుతుంది. 

Updated Date - 2021-07-27T01:39:08+05:30 IST