జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ఈజీ కాదు!

ABN , First Publish Date - 2021-12-30T07:30:18+05:30 IST

విదేశాల నుంచి తెలంగాణకు వచ్చేవారిలో కొవిడ్‌ కేసులు రోజురోజుకు

జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ఈజీ కాదు!

  • ఒక్కో వైరాలజీ ల్యాబ్‌ ఏర్పాటుకు కోటిన్నర 
  • మనదేశంలో నెలకు 50వేల సామర్థ్యం 
  • ప్రస్తుతం చేస్తున్నది 3,478 సీక్వెన్సింగ్‌లే
  • రూ.260కే డ్యూయల్‌ ఆర్టీ-పీసీఆర్‌ పరీక్ష 
  • ‘ఎస్‌-జీన్‌’ లోపించిన శాంపిళ్లనే 
  • ‘జీనోమ్‌’ ల్యాబ్‌లకు పంపాలి
  • రాష్ట్రాలకు కేంద్రం నిర్దేశం

 


 

హైదరాబాద్‌, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): విదేశాల నుంచి తెలంగాణకు వచ్చేవారిలో కొవిడ్‌ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. వారిలో ఎక్కువ మందికి కరోనా కొత్త వేరియంట్‌ ‘ఒమైక్రాన్‌’ సోకినట్లు నిర్ధారణ అవుతోంది. ఇప్పటికే ‘స్థానిక వ్యాప్తి’ మొదలైందని వైద్యవర్గాలు చెబుతున్నాయి. దీంతో ఇక నుంచి వచ్చే పాజిటివ్‌లలో ఎక్కువ శాతం ఒమైక్రాన్‌ రకమే ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఒమైక్రాన్‌ బారినపడ్డామా? లేదా? అనేది తెలుసుకోవడం అంత తేలిక కాదు. జన్యుక్రమ విశ్లేషణ (జీనోమ్‌ సీక్వెన్సింగ్‌) చేస్తే తప్ప ఆ విషయం వెల్లడికాదు.


ఇప్పటివరకు విదేశాల నుంచి వచ్చిన వారికి పాజిటివ్‌ నిర్ధారణ అయితే.. నమూనాలను సేకరించి హైదరాబాద్‌లోనే ఉన్న సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ), సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌ అండ్‌ డయాగ్నస్టిక్స్‌ (సీడీఎ్‌ఫడీ)కి పంపుతున్నారు. అక్కడ బాగా ఆలస్యం అవుతుండటంతో గాంధీ ఆస్పత్రిలోని వైరాలజీ ల్యాబ్‌లోనే జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేస్తున్నారు. ఇకపై రాష్ట్రంలో ఒమైక్రాన్‌ కేసులు పెరిగే అవకాశాలున్నాయనే అంచనాలు వెలువడుతున్నాయి. జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేసే కిట్ల లభ్యత తక్కువగా ఉన్న నేపథ్యంలో.. ఒమైక్రాన్‌ కేసులను ఎప్పటికప్పుడు నిర్ధారణ చేసే మార్గం మాత్రం కనిపించడం లేదు.  


వైరాలజీ ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలంటే.. 

కొవిడ్‌ ఇన్ఫెక్షన్‌ను నిర్ధారించడం సులభమే.. కానీ దానికి కారణమైన వైరస్‌ ఏ వేరియంట్‌కు చెందిందనే విషయాన్ని జన్యుపరంగా నిర్ధారించాలంటే శాంపిల్‌ను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ నిమిత్తం వైరాలజీ ల్యాబ్‌కు పంపాలి. ఒక వైరాలజీ ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలంటే కనీసం రూ.1.50 కోట్లు ఖర్చవుతుందని వైద్యవర్గాలు చెబుతున్నాయి. అందులో వాడే కిట్లు, రీఏజెంట్లు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. దీని ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తప్పనిసరి. ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల ప్రకారం ల్యాబ్‌ ప్రమాణాలు ఉండాలి. ఐసీఎంఆర్‌ బృందం వైరాలజీ ల్యాబ్‌కు వచ్చి ప్రమాణాల ప్రకారం ఉంటేనే తదుపరి అనుమతులను మంజూరు చేస్తుంది.  


మిషనరీల్లో స్పెసిఫికేషన్‌ మార్చుకుంటేనే.. 

రాష్ట్రంలోని 25 జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో 25 ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్‌లను ఏర్పాటు చేశారు. అవి ఇప్పటికే పనిచేస్తున్నాయి. మరో 8 జిల్లాల్లోనూ జాతీయ ఆరోగ్య మిషన్‌ నిధులతో ప్రస్తుతం ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్‌లను రాష్ట్ర సర్కారు ఏర్పాటు చేస్తోంది. ఈ ల్యాబ్‌లలోనూ జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేయొచ్చని వైద్యవర్గాలు చెబుతున్నాయి. అయితే ఆ ల్యాబ్‌లలోని మిషనరీల్లో స్పెసిఫికేషన్‌ను మార్చుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం గాంధీ ఆస్పత్రిలో ఉన్న వైరాలజీ ల్యాబ్‌లోనే జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేయాలని భావిస్తోంది. ఒకవేళ రానున్న రోజుల్లో భారీగా కొవిడ్‌ కేసులు పెరిగితే అన్నింటినీ ఒమైక్రాన్‌ కేసులుగానే పరిగణించే అవకాశాలు ఉన్నాయని వైద్యఆరోగ్యశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు.  


మొత్తం కేసుల్లో ఒక్క శాతం కూడా.. 

మనదేశంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచీ వైరస్‌ జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ తక్కువగానే చేస్తున్నారు. గత ఏడాది జనవరి 30న కేరళలో తొలి కొవిడ్‌ కేసు నిర్ధారణ అయినప్పటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 3.48 కోట్ల కేసులు నమోదయ్యాయి. ఈ 23 నెలల వ్యవధిలో కేవలం 80వేల శాంపిళ్లకు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేశారు. అంటే నెలకు సగటున 3,478 నమూనాలకు మాత్రమే జన్యుక్రమ విశ్లేషణ జరిగింది. గత ఐదు నెలల లెక్కను పరిశీలిస్తే.. ప్రతినెలా సగటున 9వేలు చొప్పున మొత్తం 45 వేల శాంపిళ్లకు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేశారు. అంతకుముందు 18 నెలల్లో కేవలం 35 వేల శాంపిళ్లకు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేశారు. అంటే ఈ మధ్య కాలంలో జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు సేకరించే శాంపిళ్ల సంఖ్యను పెంచారన్న మాట.


కొవిడ్‌ నిర్ధారణ అయ్యే ప్రతీ 100 మందిలో ఐదుగురి శాంపిళ్లను కచ్చితంగా జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపాలని ఈ ఏడాది జనవరిలో కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంది. కానీ అది పక్కాగా అమలు కావడం లేదు. మన దేశంలో నమోదయ్యే మొత్తం కేసుల్లో కనీసం ఒక్కశాతం కూడా జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేయడం లేదు. కొత్త వేరియంట్ల వ్యాప్తి స్థితిగతులపై అంచనాకు వచ్చేందుకు.. ప్రతినెలా కనీసం లక్ష శాంపిళ్లకు జన్యుక్రమ విశ్లేషణ చేయాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. అదే బ్రిటన్‌లో ప్రతి 10 కేసులకు ఒకదాన్ని జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేస్తున్నారు. అందుకే అక్కడ ఏ వేరియంట్‌ వ్యాప్తి, ఏ స్థాయిలో ఉందో త్వరగా తెలిసిపోతోంది.  




జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కన్నా.. డ్యూయల్‌ ఆర్టీ-పీసీఆర్‌ మిన్న 

ఒక్కో కొవిడ్‌ శాంపిల్‌ను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేయడానికి దాదాపు రూ.5వేలు ఖర్చవుతాయి. ఇంత భారీ ఖర్చు తో పెద్దఎత్తున శాంపిళ్లకు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేసేంత సంఖ్యలో దేశంలో వైరాలజీ ల్యాబ్‌లు లేవు. ఈనేపథ్యంలో కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన వారి శాంపిళ్లకు వెంటనే చౌకైన ఎస్‌-జీన్‌ టార్గెట్‌ ఫెయిల్యూర్‌(ఎస్‌జీటీఎఫ్‌) పరీక్ష చేయాలని రాష్ట్రాలకు కేంద్రం నిర్దేశించింది. శాంపిల్‌లో ‘ఎస్‌’ అనే జన్యువు లోపించినట్లు నిర్ధారణ అయితేనే జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌లకు పంపాలని సూచించింది. తద్వారా ల్యాబ్‌లపై భారం తగ్గి, ఒమైక్రాన్‌ కేసుల నిర్ధారణ వేగవంతం అవుతుందని పేర్కొంది.


ఒమైక్రాన్‌ లక్షణాలున్న కొవిడ్‌ రోగుల శాంపిళ్లను ఎస్‌జీటీఎఫ్‌ టెస్టు కోసం నాగ్‌పూర్‌లోని వైరస్‌ రిసెర్చ్‌ డయాగ్నస్టిక్‌ లేబొరేటరీకి పంపిస్తున్నారు. జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ పరీక్ష ఖర్చు దాదాపు రూ.5వేలు. ఆర్టీ-పీసీఆర్‌ కిట్‌ ధర రూ.19, ఎస్‌జీటీఎఫ్‌ కిట్‌ ధర రూ.240. అంటే ఈ రెండు టెస్టుల ఖర్చు రూ.260 మాత్ర మే. చాలా తక్కువ ఖర్చులోనే ఒమైక్రాన్‌ ఇన్ఫెక్షన్‌ను నిర్ధారించుకునే అవకాశం ఉన్నప్పుడు, వ్యయప్రయాసలతో కూడిన జీనోమ్‌ సీక్వెన్సింగ్‌పైనే పూర్తిగా ఆధారపడటం సరికాదని కేంద్రం భావిస్తోంది. 




జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ 20 రెట్లు పెరగాలి

దేశంలో ఇప్పుడున్న జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ సామర్థ్యం ఏ మాత్రం సరిపోదు. అది కనీసం 10 నుంచి 20 రెట్లు పెరగాలి. అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా మనదగ్గర జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌లు, కిట్లను పెంచుకోవాలి. ప్రతి లక్ష కేసుల్లో ఎన్ని నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేయాలన్న దానిపై ఒక స్పష్టత ఉండాలి. అందుకోసం దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించుకోవాలి. జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం స్మార్ట్‌ శాంప్లింగ్‌ వ్యూహాన్ని అనుసరించాలి. మూస పద్ధతిలో ఒకేచోట శాంపిళ్లు సేకరించడం వల్ల ఉపయోగం ఉండదు. 

-  డాక్టర్‌ బుర్రి రంగారెడ్డి, ప్రెసిడెంట్‌, ఇన్ఫెక్షన్‌ కంట్రోల్‌ అకాడమీ ఆఫ్‌ ఇండియా




ప్రతినెలా లక్ష శాంపిళ్లకు సీక్వెన్సింగ్‌ చేయాలి

ప్రస్తుతం మనదేశంలో 5 రీజనల్‌ హబ్స్‌ పరిధిలో 28 ప్రధాన లేబొరేటరీలు ఉన్నాయి. వాటికి నెలకు 50వేల జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేసే సామర్థ్యం ఉంది. దేశంలో ఇప్పటివరకు 3.48 కోట్ల కేసులు నమోదయ్యాయి. వీటి ప్రకారం ప్రతినెలా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యే లక్ష మంది శాంపిళ్లను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపాలి. ఇప్పటివరకు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ఫలితాల వెల్లడికి మన దేశంలో 14 రోజుల సమయం తీసుకునేవారు. దాన్ని వారం రోజులకు తగ్గిస్తామని ఇటీవల కేంద్రం ప్రకటించింది. 

- డాక్టర్‌ మాదల కిరణ్‌, హెచ్‌వోడీ క్రిటికల్‌ కేర్‌, నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రి


Updated Date - 2021-12-30T07:30:18+05:30 IST