Abn logo
Nov 24 2021 @ 11:25AM

గౌతమ్ గంభీర్‌కు కశ్మీర్ ISIS ఉగ్రవాదుల బెదిరింపు...ఇంటి వద్ద భద్రత పెంపు

న్యూఢిల్లీ: భారత మాజీ క్రికెటర్, ఢిల్లీ పార్లమెంటు సభ్యుడు గౌతమ్ గంభీర్‌కు కశ్మీర్ ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు వచ్చాయి.రాజకీయ నాయకుడిగా మారిన క్రికెటర్‌కు ఈమెయిళ్ల రూపంలో బెదిరింపులు వచ్చాయి.దీంతో కశ్మీర్ ఐసిస్ ఉగ్రవాదుల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆరోపిస్తూ బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ మంగళవారం రాత్రి ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ బెదిరింపులకు సంబంధించిన ఇతర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. గంభీర్‌కు బెదిరింపు లేఖ పంపిన ఈ-మెయిల్ అడ్రస్‌ను గుర్తించేందుకు పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఎంపీ గౌతమ్ గంభీర్ ఫిర్యాదుపై తాము దర్యాప్తు జరుపుతున్నామని ఢిల్లీ సెంట్రల్ డీసీపీ శ్వేతా చౌహాన్ తెలిపారు.ఈ బెదిరింపులతో ఢిల్లీలోని రాజేంద్ర నగర్ ప్రాంతంలోని గౌతమ్ గంభీర్ ఇంటి వద్ద సాయుధ పోలీసుల భద్రతను కట్టుదిట్టం చేశారు.గౌతమ్ గంభీర్ 2019లో బీజేపీ టిక్కెట్‌పై తూర్పు ఢిల్లీ నుంచి లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. గంభీర్ 2018లో అన్ని రకాల క్రికెట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈయన రిటైర్ అయ్యే ముందు 15 ఏళ్ల పాటు అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం తరపున ఆడారు.