దురదృష్టం పోవాలంటే...

ABN , First Publish Date - 2020-07-03T06:21:17+05:30 IST

దురదృష్టం పోవాలంటే...

దురదృష్టం పోవాలంటే...

ఒక ప్రయత్నం చెయ్యాలి. ఆ ప్రయత్నం పద్ధతిగా చెయ్యాలి. దక్కితే దక్కింది, లేకపోతే లేదు. దానికి బాధపడకూడదు. పూర్వజన్మల కర్మ ఫలితం కూడా కావచ్చు. ఈ విషయాన్ని భర్తృహరి సుభాషితాలను తెలుగులో అందించిన ఏనుగు లక్ష్మణకవి పద్యం ద్వారా తెలుసుకుందాం!


ధర ఖర్వాటు డొకండు సూర్యకర సంతప్త ప్రధానాంగుడై

త్వరతోడన్‌ పరువెత్తి చేరి నిలిచెన్‌ తాళద్రుమచ్ఛాయంత

చ్ఛిరమున్‌ తత్ఫలపాత వేగమున విచ్చెన్‌ శబ్ద యోగంబుగా

బొరి దైవోపహతుండు పోవు కడకుం పోవుం గదా యాపదల్‌


‘ఖర్వాటుడు’ అంటే బట్టతల వాడు. ‘సూర్యకర సంతప్త ప్రధానాంగుడై’... ఎండ వేడిమికి తట్టుకోలేకపోయాడు. జుట్టు బాగా ఉన్న వాడే ఎండ వేడిమికి తట్టుకోలేడు. బట్టతల ఉంటే ఇక చెప్పనక్కర్లేదు. ఒక బట్టతలవాడు ఏదో ఊరికి ప్రయాణమయ్యాడు. మిట్టమధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉంది. ఎండ వేడిమికి తట్టుకోలేక పరుగెత్తుకుంటూ వెళ్లి చెట్టు కింద నిలుచున్నాడు. ఏ చెట్టు కింద నిలుచున్నాడో తెలుసా? తాటిచెట్టు కింద నిలుచున్నాడు. తాటి చెట్టు కింద నీడుంటుందా? పోనీ నిలుచున్నాడు. ఇంతలో పై నుంచి తాటి పండు పడింది. తల రెండు ముక్కలయింది. ఎండలో ఉన్నా బాగుండేవాడు. నీడ అంటే వేపచెట్టు నీడో, మర్రిచెట్టు నీడో చూసుకోవాలి గానీ తాటిచెట్టు నీడకొస్తాడా? దురదృష్టవంతుడు ఎక్కడికి వెళితే అక్కడికి ఆపదలు తరుముకుంటూ వస్తాయి. మరి దీనికి పరిష్కారం? దురదృష్టవంతులం అనుకుంటున్న వాళ్లం ఏం చేయాలి? అంటే.. భగవన్నామస్మరణ చేయాలి. ఎప్పుడూ భగవంతుణ్ణి స్మరించడం ఆపకూడదు. దురదృష్టం అనేది జీవితంలో ఎక్కువ కాలం ఉండదు. భగవన్నామస్మరణ చేస్తే దురదృష్టం ఏమీ చేయలేదు. 

- గరికిపాటి నరసింహారావు

Updated Date - 2020-07-03T06:21:17+05:30 IST