‘గణపతి బప్పా’ ఏడయా?

ABN , First Publish Date - 2020-07-12T07:54:12+05:30 IST

‘గణపతి బప్పా మోరియా.. అగలా బర్సా జల్దీ ఆ’.. గణపతి నవరాత్రుల్లో దేశవ్యాప్తంగా మారుమోగే నినాదమిది. ఈసారి బొజ్జ గణపయ్య

‘గణపతి బప్పా’ ఏడయా?

  • కరోనాతో వినాయకుడి విగ్రహాల తయారీ పరిశ్రమ కుదేలు
  • గణపతి నవరాత్రుల సంబరాలపై ప్రభావం
  • విగ్రహాలకు గణనీయంగా తగ్గిపోయిన డిమాండ్‌
  • స్వస్థలాలకు వెళ్లిపోయిన వందలాది కుటుంబాలు 
  • ముడిసరుకూ లభ్యం కాకపోవడంతో తగ్గిన తయారీ
  • ఈ ఏడాది ఏమవుతుందోనని కళాకారుల ఆవేదన
  • ప్రభుత్వం  తమను గుర్తించి, ఆదుకోవాలని విజ్ఞప్తి


మియాపూర్‌/హయత్‌ నగర్‌/ఖమ్మం, జూలై 11 (ఆంధ్రజ్యోతి): ‘గణపతి బప్పా మోరియా.. అగలా బర్సా జల్దీ ఆ’.. గణపతి నవరాత్రుల్లో దేశవ్యాప్తంగా మారుమోగే నినాదమిది. ఈసారి బొజ్జ గణపయ్య ఉత్సవాలు ఘనంగా జరిగే పరిస్థితి కనిపించడం లేదు. కరోనా మహమ్మారి కారణంగా.. ఇప్పటికే పెద్ద ఎత్తున మొదలయ్యే విగ్రహాల తయారీ ఇంకా పూర్తి స్థాయిలో మొదలుకానే లేదు. ఓవైపు నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉండటంతో వినాయక చవితి సంబరాలను ఎంతమంది జరుపుకొంటారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో.. వీధివీధినా కనబడే గణపతి విగ్రహాలకు కూడా డిమాండ్‌ పూర్తిగా తగ్గుముఖం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి.


ఈ పరిస్థితితో.. వందల కిలోమీటర్లు దాటి వచ్చి, రాష్ట్రంలో గణపతి విగ్రహాలను తయారుచేసి విక్రయించడం ద్వారా పొట్ట పోసుకునే కళాకారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రాజస్థాన్‌, మహారాష్ట్ర, గుజరాత్‌ ప్రాంతాల నుంచి వలస వచ్చిన వీరు, ఏటా హోలీ(ఈ ఏడాది మార్చి 8న వచ్చింది) పండుగ నుంచే వినాయక విగ్రహాల తయారీ ప్రారంభిస్తారు. వచ్చే నెల 22న వినాయక చవితి కాగా.. ఈసారి మాత్రం ఇప్పటికీ పెద్ద ఎత్తున తయారీ మొదలుపెట్టలేదని చెబుతున్నారు. ఏటా వేలాదిగా అమ్ముడుపోయే విగ్రహాలు, ఈ ఏడాది మిగిలిపోతాయేమోనన్న భయంతో కేవలం రెండు, మూడు వందల విగ్రహాలనే తయారు చేస్తున్నామని వారు పేర్కొంటున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని మియాపూర్‌, బాచుపల్లి, హైదర్‌నగర్‌, కూకట్‌పల్లి, పటాన్‌చెరు, హయత్‌నగర్‌ ప్రాంతాల్లో ఎంతోమంది గణపతి విగ్రహ తయారీ కళాకారులు ఉన్నారు.


సుమారు 300కు పైగా ఉన్న తమ కుటుంబాల్లో.. 250కి పైగా కుటుంబాలు స్వస్థలాలకు వెళ్లిపోయాయని మియాపూర్‌ పరిధిలోని కళాకారులు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. గతంలో ఉన్న ధరలకంటే 40-50శాతం తగ్గించారు. 1-3 అడుగుల వినాయక విగ్రహాలు రూ.250-1000 వరకూ ధర చెబుతున్నారు. 5, 10, 12 అడుగుల విగ్రహాలను రూ.6-12వేలు మధ్యలో నిర్ణయించారు. ఏటా అప్పుచేసి విగ్రహాలను తయారు చేసి విక్రయించి, అప్పు తీరుస్తామని.. మిగిలిన సొమ్ముతోనే వచ్చే ఏడాది వరకూ జీవనాన్ని గడుపుకొంటామని రాజస్థాన్‌ కళాకారులు చెబుతున్నారు. కరోనా కారణంగా ఇతర రాష్ట్రాల నుంచి రావాల్సిన ముడిసరుకుల రవాణా కూడా బాగా తగ్గింది. ఈ నేపథ్యంలో.. అప్పు తెచ్చి మరీ చేస్తున్న విగ్రహ తయారీ తలకు మించిన భారమవుతుందేమోనని కళాకారులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మంలో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడకు వలస వచ్చిన రాజస్థానీ కుటుంబాలు, వినాయక విగ్రహాలను తయారు చేసి మహబూబాబాద్‌, సూర్యాపేట, కృష్ణా జిల్లాలకు తరలించి విక్రయిస్తుంటాయి. 



ముడిసరుకు రావడం లేదు

కరోనా కారణంగా వివిధ రాష్ట్రాల నుంచి రావాల్సిన ముడిసరుకు రాలేదు. సరుకు తగ్గిపోవడంతో 2-3 అడుగుల విగ్రహాలే తయారుచేస్తున్నాం. కుటుంబ పోషణ చాలా కష్టమైపోయింది. మా గుడారాలకఉ సుమారు రూ.3 లక్షలు అద్దె చెల్లించి విగ్రహాలను తయారు చేస్తున్నాం. చివరకు ఏం మిగులుతుందో?

మోతీలాల్‌, రాజస్థానీ కళాకారుడు, హయత్‌ నగర్‌



ప్రభుత్వం ఆదుకోవాలి

20 ఏళ్ల క్రితం రాజస్థాన్‌ నుంచి రాష్ట్రానికి వలస వచ్చి, ఇక్కడే బతుకుతున్నాం. మేము ఉంటున్న స్థలానికి ఏడాదికి రూ.40వేలు కిరాయి చెల్లించాలి. ఏటా రూ. 10లక్షల వరకూ వ్యాపారం ఉండేది. అప్పులు, పెట్టుబడి పోను, ఎంతోకొంత మిగిలేది. ఈ ఏడాది ఎలా గడుస్తుందో అర్థం కావడం లేదు. మాలాంటి చేతివృత్తుల వారి ఇబ్బందుల్ని ప్రభుత్వం గుర్తించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. 

బాబూరాం సారన్‌, కళాకారుడు, ఖమ్మం

Updated Date - 2020-07-12T07:54:12+05:30 IST