డేటాతో ఆటలు చెల్లవ్‌!

ABN , First Publish Date - 2021-12-20T08:50:44+05:30 IST

మందుల కోసం మెడికల్‌ షాప్‌కి వెళ్తే పేరు, ఫోన్‌ నెంబర్‌ అడుగుతారు! ప్రవేశ పరీక్ష అయినా, సంక్షేమ పథకమైనా, డ్రైవింగ్‌ లైసెన్స్‌ కావాలన్నా, పాస్‌పోర్టుకు దరఖాస్తు చేయాలన్నా..

డేటాతో ఆటలు చెల్లవ్‌!

  • అడ్డగోలు సమాచార సేకరణకు అడ్డుకట్ట
  • ఉల్లంఘనలకు రూ.15 కోట్ల దాకా జరిమానా
  • నెట్‌లో వ్యక్తిగత సమాచారం తొలగింపు ఇక హక్కు
  • దుష్ప్రచారానికి ‘సోషల్‌ మీడియా’ ప్లాట్‌ఫామ్‌లదీ బాధ్యత
  • వ్యక్తిగత సమాచారానికి రక్షణ.. డేటా ప్రొటెక్షన్‌ బిల్‌ 2021
  • వ్యక్తిగతేతర, సున్నిత సమాచారాన్ని సేకరించడానికి వీల్లేదు


హైదరాబాద్‌, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): మందుల కోసం మెడికల్‌ షాప్‌కి వెళ్తే పేరు, ఫోన్‌ నెంబర్‌ అడుగుతారు! ప్రవేశ పరీక్ష అయినా, సంక్షేమ పథకమైనా, డ్రైవింగ్‌ లైసెన్స్‌ కావాలన్నా, పాస్‌పోర్టుకు దరఖాస్తు చేయాలన్నా.. ఆధార్‌ వివరాలు తప్పనిసరి! వీటిని ఎందుకు అడుగుతున్నారు? ఈ సమాచారంతో ఏంచేస్తారని మనం ప్రశ్నించినా సమాధానం ఉండదు. కానీ.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘డేటా ప్రొటెక్షన్‌ బిల్‌-2021’ అమల్లోకి వస్తే అలా కుదరదు. వ్యక్తిగత సమాచారం తీసుకోవడానికి ప్రభుత్వమైనా, ప్రైవేటు సంస్థలైనా పౌరుల నుంచి ముందస్తు అనుమతి పొందాల్సిందే. రాష్ట్రంలో, దేశంలో వ్యక్తిగత సమాచార భద్రతపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. సమాచార రక్షణకు చట్టం తేవాలని నాలుగేళ్ల క్రితం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో దీనిని రూపొందించారు. మూడేళ్ల పాటు.. 78 సార్లు సమావేశమై, 184 గంటల 20 నిమిషాలపాటు సంప్రదింపులు జరిపిన అనంతరం 99 సిఫారసులతో దీనిని ఇటీవలే పార్లమెంటు ఉభయసభల్లో ప్రవేశపెట్టారు. పార్లమెంటు ఆమోదం పొందితే.. వ్యక్తిగత సమాచార భద్రతకు సంబంధించి మనదేశంలో ఇది మొట్టమొదటి చట్టం కానుంది. ఈ బిల్లు నేపథ్యం, దాంట్లోని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. 


అంగట్లో సమాచారం..

ప్రస్తుత ఇంటర్‌నెట్‌, టెక్నాలజీ యుగంలో వ్యక్తిగత సమాచార భద్రత ప్రపంచానికి అతిపెద్ద సవాల్‌గా మారింది. వ్యాపార ప్రయోజనాలే పరమావధిగా ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని అంగట్లో అమ్మకానికి పెట్టి భారీగా లాభాలు గడించడం కొన్ని కంపెనీలకు అలవాటుగా మారిన నేపథ్యంలో.. దశాబ్దకాలంగా ఈ అంశంపై విస్తృతంగా చర్చ నడుస్తోంది. ఇప్పటికే అనేక అభివృద్ధి చెందిన దేశాలు వ్యక్తిగత సమాచార భద్రతకు సంబంధించి పటిష్ఠ చట్టాలు అమలుచేస్తూ ప్రజల పక్షాన నిలుస్తున్నాయి. ప్రజల సమాచారం బహిర్గతమైన కేసుల్లో గూగుల్‌, అమెజాన్‌ లాంటి టెక్‌ దిగ్గజాలకు పలు దేశాలు రూ.కోట్ల మేర జరిమానాలు విధించాయంటే అందుకు అక్కడున్న పటిష్ఠ చట్టాలే కారణం. 


2018 నుంచి యూరప్‌ దేశాల్లో అమల్లో ఉన్న జీడీపీఆర్‌ (జనరల్‌ డేటా ప్రొటెక్షన్‌ రెగ్యులేషన్‌) చట్టాన్ని గొప్ప చట్టంగా పరిగణిస్తారు. అయితే, ఇంటర్‌నెట్‌ వాడకం, స్మార్ట్‌ ఫోన్ల వినియోగంలో ప్రపంచంలోనే ఎక్కువగా ఉన్న మనదేశంలో ఇంతవరకు అలాంటి చట్టం లేదు. కనీసం ఈ విషయంపై పాలకులూ దృష్టి సారించలేదు. అయితే 2017-ఆగస్టులో జస్టిస్‌ పుట్టుస్వామి కేసులో సుప్రీంకోర్టు తొలిసారి సమాచార రక్షణ చట్టం ఆవశ్యకతను గుర్తించింది. ఆధార్‌తో వ్యక్తిగత సమాచార గోప్యతకు భంగం వాటిల్లుతోందని జస్టిస్‌ పుట్టుస్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దేశంలో సమాచార రక్షణకు చట్టం లేనందున ఆధార్‌ సమాచార ఉల్లంఘనలు వర్తించవని కేంద్రం తన సమాధానంగా పేర్కొంది. దీనిపై స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు చెప్పింది. వ్యక్తి జీవితం, స్వాతంత్రానికి సంబంధించి రాజ్యాంగంలో ఆర్టికల్‌-21 వ్యక్తిగత సమాచార రక్షణ హక్కునూ కల్పించిందని తెలిపింది. సమాచార రక్షణకు ప్రత్యేక చట్టం చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు.. బిల్లు రూపకల్పనకు 2017లో జస్టిస్‌ శ్రీకృష్ణ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటైంది. అప్పటినుంచి నాలుగేళ్లపాటు నిపుణుల సంప్రదింపులు, చర్చలు, అధ్యయనాల అనంతరం ఈ బిల్లు సిద్ధమైంది. ‘ది పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ బిల్‌-2019గా ఉన్న దీని పేరును ‘ది డేటా ప్రొటెక్షన్‌  బిల్‌-2021’గా మార్చారు. ఇది చట్టంగా మారితే ‘ది డేటా ప్రొటెక్షన్‌ యాక్ట్‌-2021’గా వ్యవహరిస్తారు.


కారణం చెప్పాల్సిందే.. 

ప్రజలకు సంబంధించిన వ్యక్తిగత, సున్నితమైన, ఇతర ఏ రకమైన సమాచారాన్నైనా అడిగే ముందు దానికి కారణాలను తెలుపాల్సి ఉంటుంది. సమాచార రక్షణకు తీసుకుంటున్న చర్యలనూ వివరించాల్సి ఉంటుంది. పౌరుల నుంచి అనుమతి తీసుకోవాలని ఈ బిల్లులో పేర్కొన్నారు. ప్రభుత్వమైనా, ప్రైవేటు సంస్థలైనా ఈ నిబంధనలను పాటించాల్సిందే. ఇలా సేకరించిన సమాచారానికి భద్రత కల్పించాల్సిన బాధ్యత పూర్తిగా సంబంఽధిత సంస్థదే. దీనిని ఇతరులకు బహిర్గతం చేసినా, దుర్వినియోగం అయినా సంబంధిత సంస్థ బాధ్యత వహించాల్సి ఉంటుంది.


మినహాయింపులు

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు దీని పరిధిలోకి వస్తాయి. దేశ రక్షణ అంశాల్లో, నేరగాళ్లకు సంబంధించిన వ్యక్తిగత సమాచార సేకరణకు మాత్రం  ప్రభుత్వానికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. అలాగే సమాజ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మీడియా సంస్థలు, జర్నలిస్టులకు కొన్ని పరిమితులతో కూడిన మినహాయింపులు ఇచ్చారు.


సోషల్‌ మీడియాకూ బాధ్యత.. 

సమాజంలో అత్యంత కీలకపాత్ర పోషిస్తున్న సోషల్‌ మీడియాకు సంబంఽధించి సైతం ఇందులో కీలక నిబంధనలు ఉన్నాయి. తప్పుడు వార్తలు, వ్యక్తులు, ఒక వర్గం, ఒక సమూహాన్ని లక్ష్యంగా చేసుకుని తప్పుడు పోస్టింగులు పెడితే ఇంతవరకూ దానికి కారకులైనవారిపై మాత్రమే చర్యలు తీసుకునేవారు. ఇంటర్మీడియరీ హోదా ఉన్నందున.. ఆయా పోస్టులకు, తప్పుడు ప్రచారానికి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లు బాధ్యత వహించాల్సిన పని ఉండేది కాదు. కానీ ఈ చట్టం అమలైతే అలా కుదరదు. ట్విటర్‌లో చేసిన ట్వీట్ల వల్ల ఒక వ్యక్తి, ఒక వర్గం, ఒక ప్రాంతం వారిపై దాడులు జరిగి, వారి ప్రాణాలు, ఆస్తులకు నష్టం వాటిల్లితే ఆ విద్వేషపు ట్వీట్లు చేసినవారితో పాటు ట్విటర్‌ కూడా బాధ్యత వహించాల్సిందే. దీనికోసం భారత్‌ వెలుపల ఉన్న ట్విటర్‌, ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాలు, వాట్సాప్‌ తరహాలో మెసెంజర్‌ సేవలు అందించే సంస్థలు భారత్‌లో తప్పనిసరిగా కార్యాలయం ప్రారంభించాల్సి ఉంటుంది. అలాగే ప్రతి సంస్థా ఇలాంటి విద్వేషపు సమాచారం, వ్యక్తిగత సమాచార గోప్యత ఉల్లంఘనల పర్యవేక్షణ, ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక అధికారిని కూడా నియమించాల్సి ఉంటుంది.


తొలగించాలని చెప్పొచ్చు

సోషల్‌ మీడియాలో ఎవరిదైనా వ్యక్తిగత సమాచారం ఉంటే దానిని తొలగించడం దాదాపు అసాధ్యం. అయితే, వ్యక్తులు తమ సమాచారాన్ని ఇంటర్‌నెట్‌ నుంచి తొలగించుకోవడాన్ని కూడా హక్కుగా ఈ బిల్లులో పేర్కొన్నారు. ఉదాహరణకు.. యూట్యూబ్‌, ట్విటర్‌, ఇతర సామాజిక మాధ్యమాల్లో ఉంచిన వ్యక్తిగత వీడియోలను సంబంధిత వ్యక్తులు తొలగించుకోవచ్చు. దీనికి సోషల్‌ మీడియా యాజమాన్యాలు పూర్తి సహకారం అందించాలి.


ఏ సమాచారం గోప్యమంటే..

ఈ బిల్లు ప్రకారం ప్రజలకు చెందిన వ్యక్తిగత, సున్నిత, వ్యక్తిగతేతర సమాచారాన్ని అనుమతి లేకుండా సేకరించకూడదు. 


వ్యక్తిగత సమాచారమంటే?

ఈ బిల్లు ప్రకారం ఒక వ్యక్తిని గుర్తించడానికి వీలు కలిగించే డేటాను వ్యక్తిగత సమాచారంగా భావిస్తారు. ఉదాహరణకు.. పేరుతో వ్యక్తిని గుర్తించవచ్చు. అతడి పేరును బహిర్గతపరచడం వ్యక్తిగత సమాచార ఉల్లంఘనగా పరిగణిస్తారు. ఇలాగే, ఈమెయిల్‌, ఆధార్‌ వివరాలు, ఓటరు కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, రేషన్‌, పాన్‌ కార్డు, పాస్‌పోర్టు.. ఇలాంటి డాక్యుమెంట్లలో  ఒక వ్యక్తిని గుర్తించేందుకు కావాల్సిన సమాచారం ఉన్నందున ఇదంతా వ్యక్తిగత సమాచారమే అవుతుంది.


 సున్నితమైన సమాచారమంటే?

ఒక వ్యక్తి ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం.. అంటే చేయించుకున్న వైద్య పరీక్షలు, శస్త్ర చికిత్సలు, వినియోగిస్తున్న మందులు, ఇతర ఆరోగ్య సంబంధిత సమాచారం, జెనెటిక్‌, బయోమెట్రిక్‌ సమాచారం, లైంగిక ధోరణి, ఆసక్తులు, ట్రాన్స్‌జెండర్‌ స్టేటస్‌, ఇంటర్‌ సెక్స్‌ స్టేటస్‌, మతపరమైన, రాజకీయపరమైన అనుబంధానికి సంబంధించిన వివరాలు, మతం, కులం, తెగకు సంబంధించిన వివాలను సున్నితమైన సమాచారంగా పరిగణిస్తారు.

    వ్యక్తిగతేతర సమాచారమంటే?

వ్యక్తిగత, సున్నితమైన సమాచారం కాకుండా.. ఒక వ్యక్తిని గుర్తించడానికి వీల్లేకుండా ఉండే ఇతర అన్నిరకాల సమాచారాన్ని నాన్‌ పర్సనల్‌ డేటా అంటారు. 


భారీ జరిమానాలు 

చట్టం అమలుకు జాతీయస్థాయిలో డేటా ప్రొటెక్షన్‌ కమిషన్‌ను నియమిస్తారు. ఇది ఎన్నికల కమిషన్‌లా స్వయం ప్రతిపత్తి కలిగి ఉంటుంది. చట్ట ఉల్లంఘనలకు సంబంధించిన ఫిర్యాదులను ప్రజలు ఈ కమిషన్‌కు చేయవచ్చు. ఉల్లంఘన జరిగినట్టు కమిషన్‌ విచారణలో రుజువైతే ఆయా సంస్థలు భారీ జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. వ్యక్తిగత సమాచారం బహిర్గతం కావడం వల్ల తన ప్రాణానికి, స్వతంత్రంగా జీవించే హక్కుకు భంగం వాటిల్లిందని, ఆర్థిక నష్టం జరిగిందని ప్రజలు ఫిర్యాదుచేస్తే రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు జరిమానా విధించవచ్చు. అదే అంతర్జాతీయ కంపెనీలకు అయితే వాటి వార్షిక టర్నోవర్‌లో 4 శాతం వరకు జరిమానా విధించే హక్కు కమిషన్‌కు ఉంటుంది.

Updated Date - 2021-12-20T08:50:44+05:30 IST