బీజేపీ కార్పొరేటర్లకు గాలం

ABN , First Publish Date - 2022-05-20T08:28:43+05:30 IST

మొన్న జరిగిన గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్న అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ..

బీజేపీ కార్పొరేటర్లకు గాలం

  • అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా..
  • జీహెచ్‌ఎంసీలో ఆపరేషన్‌ ఆకర్ష్‌
  • కమలం నేతలతో టీఆర్‌ఎస్‌ చర్చలు
  • పదవులు, పనులు, ఇతరత్రా ఆశల ఎర
  • నయానో భయానో పార్టీలో చేర్చుకునే యత్నం

హైదరాబాద్‌ సిటీ, మే 19 (ఆంధ్రజ్యోతి): మొన్న జరిగిన గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్న అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఉండేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో మరింత బలం పెంచుకునేందుకు.. వీలైనంత మంది కమలం కార్పొరేటర్లకు టీఆర్‌ఎస్‌ కండువా కప్పే మిషన్‌కు శ్రీకారం చుట్టినట్టు సమాచారం. ఈ విషయంపై మంత్రులు, ఎమ్మెల్యేలు, నగరంలోని కీలక నేతలకు అగ్ర నేతల నుంచి ఆదేశాలు వచ్చినట్టు తెలిసింది. ఈ క్రమంలో నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతలు.. బీజేపీ కార్పొరేటర్లతో రహస్యంగా మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. పదవులు, పనులు, ఇతరత్రా ఆశ చూపడంతో పాటు లొసుగుల ఆధారంగా భయపెట్టి వారిని చేర్చుకునేందుకు టీఆర్‌ఎస్‌ వర్గాలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే 13 మంది కార్పొరేటర్లతో చర్చించగా.. 8 మంది సానుకూలత వ్యక్తం చేసినట్టు సమాచారం. 



మరో ఐదుగురు ఆలోచించుకొని చెబుతామన్నట్టు తెలిసింది. కార్పొరేటర్లకు బడ్జెట్‌ లేకపోవడం.. అధికార పార్టీలో ఉంటే పనులైనా చేయించుకోవచ్చన్న భావనలో కొందరు కమలం నేతలు ఉన్నట్టు సమాచారం. 2020 డిసెంబరులో జరిగిన గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో బీజేపీ 47 స్థానాల్లో విజయం సాధించింది. ప్రమాణ స్వీకారానికి ముందే లింగోజీగూడ కార్పొరేటర్‌ చనిపోవడంతో.. అనంతరం జరిగిన ఉప ఎన్నికలో ఆ స్థానాన్ని కాంగ్రెస్‌ దక్కించుకుంది. దీంతో బీజేపీ కార్పొరేటర్ల సంఖ్య 46కు చేరింది. గ్రేటర్‌ ఎన్నికల ఫలితాలు అధికార పార్టీకి ఊహించని పరిణామం. నగరంలో కొంత పట్టున్న బీజేపీకి ఈ విజయం మరింత ఊపునిచ్చింది. హైదరాబాద్‌లో పార్టీ బలం పెరిగిందని చెప్పుకోవడంతోపాటు.. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంటుందని ప్రచారం చేసుకునే అవకాశం కల్పించింది.


ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా మరోసారి ఆపరేషన్‌ ఆకర్ష్‌కు తెర తీయాలని అధికార పార్టీ పెద్దలు యోచిస్తున్నట్టు సమాచారం. వీలైనంత మంది బీజేపీ కార్పొరేటర్లను కారెక్కించే ప్రయత్నాలు చేయాలని, ఇందుకు ఏం కావాలన్నా చేసేందుకు సిద్ధమని సంకేతాలిచ్చినట్టు ఓ కీలక నేత తెలిపారు.


ఎల్బీ నగర్‌ నియోజకవర్గంలోని 11 స్థానాలను గ్రేటర్‌ ఎన్నికల్లో బీజేపీ దక్కించుకుంది. ఇక్కడి ఆరుగురు కార్పొరేటర్లతో టీఆర్‌ఎస్‌ చర్చలు జరిపినట్టు తెలిసింది. వారిలో ముగ్గురు సానుకూలత వ్యక్తం చేసినట్టు సమాచారం.  

సనత్‌నగర్‌ నియోజకవర్గంలోనూ బీజేపీ కార్పొరేటర్లతో సంప్రదింపులు చేస్తున్నట్టు తెలిసింది. ఇక్కడి నుంచీ ఒకరిద్దరు పార్టీ మారవచ్చన్న ప్రచారం జరుగుతోంది. మంత్రి తలసాని ఈ విషయాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్టు సమాచారం. 

ముషీరాబాద్‌, అంబర్‌పేటలోనూ పలువుర గులాబీ నేతలు చర్చలు జరుపుతున్నారు. స్థానిక నేతల తీరుపై అసంతృప్తితో ఉన్న ఒకరిద్దరు.. ఏం చేయాలన్న దానిపై తర్జనభర్జన పడుతున్నట్టు తెలిసింది.


Updated Date - 2022-05-20T08:28:43+05:30 IST