సారక్క వచ్చె.. సంబురమొచ్చె!

ABN , First Publish Date - 2022-02-17T08:16:33+05:30 IST

సారలమ్మ మేడారానికొచ్చింది.. గద్దెనెక్కింది! ఈ అపూర్వ ఘట్టం కోసం కళ్లింత చేసుకొని ఎదరుచూసిన భక్త జనం ఇప్పుడిక సమ్మక్క రాక ఎప్పుడా అని ఆరాటపడుతోంది. నలుగురు వనదేవతల్లో బుధవారం సారలమ్మ సహా పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు,...

సారక్క వచ్చె.. సంబురమొచ్చె!

  • కన్నెపల్లి నుంచి వచ్చి గద్దెనెక్కిన సారలమ్మ 
  • పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి 
  • గోవిందరాజులు కూడా.. వనదేవతలకు భక్తుల జేజేలు
  • మేడారంలో మహాజాతర షురూ.. ఎటు చూసినా జనమే
  • ఇప్పటికే 50 లక్షల మంది దర్శనం
  • ఈసారి 1.25 కోట్ల మంది వస్తారని అంచనా 
  • గద్దెల దర్శనానికి 3 గంటల సమయం
  • రేపు మేడారానికి సీఎం కేసీఆర్‌.. 2 గంటల పాటు అక్కడే


ఏటూరునాగారం రూరల్‌, మేడారం, మేడారం నుంచి ఆంధ్రజ్యోతి బృందం, ఫిబ్రవరి 16: సారలమ్మ మేడారానికొచ్చింది.. గద్దెనెక్కింది! ఈ అపూర్వ ఘట్టం కోసం కళ్లింత చేసుకొని ఎదరుచూసిన భక్త జనం ఇప్పుడిక సమ్మక్క రాక ఎప్పుడా అని ఆరాటపడుతోంది. నలుగురు వనదేవతల్లో బుధవారం సారలమ్మ సహా పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, ఏటూరునాగారం మండలం కొండా యి నుంచి గోవిందరాజులు గద్దెల మీదకు వచ్చారు. బుధవారం రాత్రి సరిగ్గా 10:52కు సారలమ్మ గద్దెను అధిష్టించింది.. దీంతో జాతర తొలిరోజే మేడారంలో సంబరాలు మిన్నెగిశాయి. జాతర తొలిరోజులో సారలమ్మ గద్దె మీదకు చేరడమే ప్రధాన ఘట్టం కావడంతో బుధవారం ఉదయం నుంచే అటు కన్నెపల్లిలో, ఇటు మేడారంలో సందడి నెలకొంది.


మేడారంలో ప్రతీ గడపా అలుకుపూతలు, మామిడి తోరణాలతో కొత్త శోభను సంతరించుకుంది. పూజారుల కుటుంబసభ్యులు ఉదయాన్నే గుడి వద్దకు చేరుకొని శుద్ధి చేసి ముగ్గులు వేశారు.  ప్రధాన పూజారి వడ్డె సారయ్య ఆధ్వర్యంలో సంప్రదాయ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసీ కళాకారుల నృత్యాలు, శివసత్తుల పూనకాలు, డోలు వాయిద్యాలతో కన్నెపల్లి మార్మోగింది. సూర్యాస్తమయం తర్వాత సారలమ్మను గద్దెకు తెచ్చే ఘట్టం ప్రారంభమైంది. రాత్రి 7:09 గంటలకు గుడి నుంచి తల్లి రూపాన్ని వెదురు బుట్టలో సారయ్య బయటకు తేవడంతో ‘అదిగదిగో సారక్క’ అంటూ భక్తులు నినాదాలు చేశారు.   దారిపొడవునా భక్తులు నిల్చుని తల్లికి జేజేలు పలికారు. సంతానం కోసం పలువురు మహిళలు తడిబట్టలతో వరం పట్టగా వారిని దాటుకుంటూ వనదేవత సాగింది. దారిలో ఎదురేగిన ప్రజలు నీళ్లారబోస్తూ, కొబ్బరికాయలు కొడుతూ మొక్కులు సమర్పించుకున్నారు.


కొండాయిలో గోవిందరాజులుకు దబ్బకట్ల వంశస్థులు తమ సంప్రదాయ పద్ధతుల్లో పూజలు నిర్వహించారు.  ప్రధాన పూజారి దబ్బకట్ల గోవర్ధన్‌తోపాటు వంశస్థులు ఆలయంలో అలుకుపూతలు చేసి ముగ్గులు వేశారు. సాయంత్రం 4.35 గంటలకు ప్రధాన పూజారి గోవర్ధన్‌ ఆధ్వర్యంలో తలపతి దబ్బకట్ల కిష్టయ్య, వడ్డె పోదెం బాబు దేవుడి రూపమైన పడిగెను భుజానికెత్తుకుని ఆలయం నుంచి బయలుదేరారు. తమ ఇలవేల్పును సమ్మక్క చెంతకు సాగనంపేందుకు గ్రామస్థులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. కొండాయి దాటిన అనంతరం మల్యాల గ్రామానికి చేరుకుని అక్కడ సమ్మక్క గుడిలోని పూజామందిరంలో సంప్రదాయ పూజలు చేసి ముడుపులు చెల్లించారు. ఈ సందర్భంగా మల్యాల, దొడ్ల గ్రామస్థులు గోవిందరాజులుకు ఎదురేగి నీళ్లారబోస్తూ మొక్కులు చెల్లించుకున్నారు. అక్కడి నుంచి దేవుడి ప్రతిమను వడ్డె, పూజారులు, పలువురు గ్రామపెద్దలు కాలినడకన కొండాయి-ఊరట్టం(సుమారు 15కిలోమీటర్లు) దారివెంట కాలినడకన అమ్మవారి సన్నిధికి బయలుదేరారు. కాగా నార్లాపూర్‌ నుంచి బుధవారం నాగులమ్మ గద్దెకు చేరింది. జంపన్నవాగు ఒడ్డున ఉన్న గద్దె వద్దకు కాలినడకన  పూజారులు తీసుకువచ్చారు.  


సారలమ్మను తాకాలని యత్నించిన హిజ్రాలు

కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకొస్తుండగా గ్రామ పొలిమేర దాటగానే హిజ్రాలకు కన్నెపల్లి ఆదివాసీ యువకులకు మధ్య ఘర్షణ జరిగింది. సారలమ్మను తాకాలని యత్నించిన హిజ్రాలను నెట్టివేశారనే కోపంతో ఓ హిజ్రా.. దుస్తులు తొలగించుకొని ఆదివాసీ యువకుల వలయాన్ని ఛేదించుకొని మధ్యలో సారలమ్మ ముందు నృత్యం చేసింది. వెంటనే యువకులు ఆ హిజ్రాను బయటకు గెంటివేయగా హిజ్రాలందరూ యువకులపై దాడికి దిగారు. వారిపై యువకుల్లో కొందరు  విరుచుకుపడ్డారు. ఇరువర్గాలు రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ క్రమంలో కొందరు యువజన సంఘం నాయకులు, ఆదివాసీ నాయకులు వారిని అడ్డుకొని గొడవను అదుపుచేశారు. ఈ సంఘటనతో కొందరు హిజ్రాలు, ఆదివాసీ యువకులకు గాయాలయ్యాయి.   


వనం.. ప్రభంజనం 

కోళ్లు, గొర్లు పట్టుకొని నడిచొస్తున్న కొందరు.. తల్లులకు వాటిని బలిస్తున్న ఇంకొందరు.. జంపన్నవాగులో స్నానాలు.. శివసత్తుల శిగాలు, గజ్జె కట్టి ఆటాపాటలు... బొమ్మలు, ఆటవస్తువులు కొంటున్న పొరగాళ్లు..  ఇలా మేడారంలో ఎటు చూసినా జనజాతరే! జాతర ప్రారంభానికి ముందే 50 లక్షల మంది దాకా గద్దెలను దర్శించుకున్నారని అంచనా. బుధవారం సారలమ్మ గద్దె మీదకొచ్చి జాతరకు తెరలేవడంతో ఈ నాలుగురోజుల పాటు మరింత మంది భక్తులు పొటెత్తొచ్చని అంటున్నారు. మొత్తంగా ఈసారి 1.25 కోట్ల మంది, వనదేవతలను దర్శించుకోవచ్చునని అంచనా. హైదరాబాద్‌నుంచి వచ్చే భక్తులు వినూత్నంగా  తమ గుడారంలోనే  ఎత్తుబంగారానికి పూజలుచేసి మద్యం బాటిళ్లతో నైవేద్యం సమర్పిస్తున్నారు. ఆతర్వాత బెల్లం, కానుకలను దేవతల గద్దెలవద్ద సమర్పిస్తున్నారు.  


ములుగు జిల్లాలో సెలవులు

ములుగు, ఫిబ్రవరి 16: మేడారం జాతర నేపథ్యంలో ములుగు జిల్లాలో మూడురోజులు సెలవులు ప్రకటించారు. ఈ నెల 16, 17 తేదీల్లో ఏజెన్సీ మండలాల్లో, 18న జిల్లా మొత్తానికి సెలవుదినంగా నిర్ణయించారు. ట్రెజరీ మినహా మిగతా అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు, విద్యాసంస్థలకు ఈ సెలవులు వర్తిస్తాయి. 18న ఇచ్చిన సెలవుకు బదులుగా మార్చి 12న రెండో శనివారాన్ని పనిదినంగా ప్రకటించారు.  ఈ మేరకు ములుగు కలెక్టర్‌ ఎస్‌.కృష్ణఆదిత్య బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. 


రేపు మేడారానికి సీఎం కేసీఆర్‌ 

ములుగు, ఫిబ్రవరి 16: ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం (18వ తేదీన) మేడారం వస్తున్నారు. కుటుంబసమేతంగా ప్రత్యేక హెలికాప్టర్‌లో వచ్చి వనదేవతలను దర్శించుకొని మొక్కులు సమర్పిస్తారు. రెండుగంటలపాటు ఆయన మేడారంలోనే ఉంటారు. జాతర నిర్వహణ, అభివృద్ధిపై అధికారులతో చర్చిస్తారు. ఈ మేరకు జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 


భక్తుల భద్రతకు కృత్రిమ మేధ


9 వేల మంది పోలీసులతో బందోబస్తు: డీజీపీ

హైదరాబాద్‌, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): మేడారం మహాజాతరలో భక్తుల భద్రతకు కృత్రిమమేధ సాంకేతికతను వినియోగిస్తున్నట్లు డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి తెలిపారు. ఆర్టిఫిషయల్‌ హైడెఫినేషన్‌ కెమెరాలతో భక్తుల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని   చెప్పారు. మేడారం జాతరలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పకడ్బంది చర్యలు తీసుకుంటున్నామని, 9 వేల మందికి పైగా పోలీస్‌ సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నారని వివరించారు. 382 సీసీటీవీ కెమెరాలను కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానం చేశామని చెప్పారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా వివిధ శాఖల సమన్వయంతో పోలీస్‌ శాఖ పనిచేస్తోందని పేర్కొన్నారు.


కాగా, మేడారంలో క్రౌడ్‌ మేనేజ్‌మెంట్‌ సంబంధించిన చిత్రాలను డీజీపీ మహేందర్‌రెడ్డి బుధవారం ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. గత జాతరలోనూ  కృత్రిమ మేధను తెలంగాణ పోలీసులు వినియోగించారు. ఈ సాంకేతికతతో భక్తుల సంఖ్యను అంచనావేసి తొక్కిసలాటలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. జాతరకు ఎంత మంది భక్తులు వచ్చారో లెక్కగట్టారు. ఈ సారి కూడా మేడారం గద్దెలతో పాటు ప్రధానమార్గాల్లో హైడెఫినేషన్‌ కెమెరాలను పోలీసులు అమర్చారు. ఆ లైవ్‌ ఫుటేజీ ఆధారంగా తక్షణ చర్యలు తీసుకుంటున్నారు.  

Updated Date - 2022-02-17T08:16:33+05:30 IST