గడ్డర్ల బిగింపు ఇలాగేనా?

ABN , First Publish Date - 2021-02-22T08:19:34+05:30 IST

ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టు పనుల్లో నాణ్యత లేదని డ్యాం డిజైన్‌ రివ్యూ ప్యానెల్‌ (డీడీఆర్‌పీ) తేల్చేసింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన హైడ్రాలిక్‌ గేట్లతో నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్టు నిర్మాణంలో రాష్ట్రప్రభుత్వ అలసత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది

గడ్డర్ల బిగింపు ఇలాగేనా?

కాఫర్‌ డ్యాం మట్టిలో గట్టిదనమేదీ?

అప్రోచ్‌ చానల్‌ను రీడిజైన్‌ చేయాల్సిందే

పోలవరం ప్రాజెక్టుపై డీడీఆర్‌పీ స్పష్టీకరణ

పనుల్లో నాణ్యతపై తీవ్ర అసంతృప్తి

డిజైన్లు ఆమోదించకుండానే తిరుగుపయనం


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టు పనుల్లో నాణ్యత లేదని డ్యాం డిజైన్‌ రివ్యూ ప్యానెల్‌ (డీడీఆర్‌పీ) తేల్చేసింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన హైడ్రాలిక్‌ గేట్లతో నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్టు నిర్మాణంలో రాష్ట్రప్రభుత్వ అలసత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. ప్రధానంగా గేట్ల అమరికలో అత్యంత కీలకమైన గడ్డర్ల బిగింపు తీరు, దానికి అనుసరిస్తున్న సాంకేతిక విధానాన్ని తప్పుబట్టింది. దరిమిలా డిజైన్లకు ఆమోదం తెలుపకుండానే వెనుదిరిగింది. ప్రాజెక్టు పనుల నాణ్యతపై డీడీఆర్‌పీ తొలి నుంచీ సందేహాలు వ్యక్తం చేస్తోంది. దాని చైర్మన్‌, కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్‌ ఏబీ పాండ్యా ఆధ్వర్యంలోని నిపుణుల బృం దం ఈ నెల 19 నుంచి ఆదివారం వ రకు క్షేత్ర స్థాయిలో పనులను పరిశీలించింది. దానికిముందే 17వ తేదీన తొలుత పుణేలోని సెంట్రల్‌ వాటర్‌ పవర్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ (సీడబ్ల్యూపీఆర్‌ఎ్‌స)లో పోలవరం నమూనా ప్రాజెక్టును సందర్శించింది. ఆ తర్వాత పోలవరం వ చ్చి.. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పనులను పరిశీలించింది. వా స్తవ నిర్మాణ విధానానికి అనుగుణంగా అవి జరగడం లేదని ఆక్షేపించింది. నిర్మాణంలో చోటు చేసుకున్న పలు లోపాలను ఎత్తి చూపినట్లు విశ్వసనీయంగా తెలిసింది. నిజానికి శనివారం నాటి సమీక్షలోనే పాండ్యా తీవ్ర అసహనానికి గురయ్యారు. నాణ్యతపై మండిపడ్డారు. భారీ ప్రాజెక్టు నిర్మాణంలో భద్రత ప్రమాణాలు పాటించేది ఇలాగేనా అని అధికారులను నిలదీశారు.


ప్రధానంగా..గట్ల అమరికలో కీలకమైన గడ్డర్లు బిగింపు సమయంలో అనుసరిస్తోన్న సాంకేతిక విధానంపై పాండ్యా కమిటీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 50,000 క్యూసెక్కుల భారీ వరద వస్తే ఈ గడ్డర్లు తట్టుకుంటాయా అనే సందేహం వ్యక్తం చేసింది. అప్రోచ్‌ చానల్‌ నిర్మాణంలో మార్పులు చేయాలని.. దానికి అనుగుణంగా డిజైన్లు రూపొందించాలని సూచించింది. కాఫర్‌ డ్యాంలో వాడుతున్న మట్టిలో గట్టితనం, నాణ్యత లేవని పెదవి విరించింది. భారీ వరద వస్తే కాఫర్‌ డ్యాం నిలబడుతుందా అని అనుమానం వ్యక్తం చేసింది. స్పిల్‌ వేకు కుడి ఎడమల మధ్య గ్యాప్‌ను పూడ్చడంపై ప్రత్యేక సాంకేతిక విఽధానాన్ని అమలు చేయాలని పేర్కొంది. ప్రాజెక్టు డిజైన్లన్నీ 45.72 మీటర్ల గరిష్ఠ ఎత్తుకు లోబడే ఉండాలని స్పష్టం చేసింది. ఇప్పుడు రూపొందించినవాటిని ఆమోదించకుండానే ఢిల్లీ బయల్దేరింది. ఓపక్క పోలవరం  ప్రాజెక్టు సవరించిన అంచనా వ్య యాన్ని ఆమోదించాలని ప్రభుత్వం కేంద్రాన్ని అభ్యర్థిస్తుండగా.. పనుల్లో నాణ్యత లోపించిందని చైర్మన్‌ పాండ్యా స్వయంగా పేర్కొనడం.. డిజైన్ల సవరణకు ఆదేశించడం వంటి పరిణామాలు.. డీడీఆర్‌పీ సమర్పించే నివేదిక ప్రభావం కేంద్ర జలశక్తి శాఖపై ఏ విధంగా ఉంటుందోనని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Updated Date - 2021-02-22T08:19:34+05:30 IST