‘గడప..’ తొక్కారో!

ABN , First Publish Date - 2022-06-17T07:58:57+05:30 IST

‘గడప..’ తొక్కారో!

‘గడప..’ తొక్కారో!

వైసీపీ ఎమ్మెల్యేలపై జనం తిరుగుబాటు

నిరసనల స్థాయిదాటి గల్లా పడుతున్న వైనం

్గపథకాలు, సంక్షేమంపై నిలదీతలు

ఎమ్మెల్యేలతో గడప గడపలో వాగ్యుద్ధాలు

గ్రామాల్లో వైసీసీ నాయకులకు చుక్కలు

ముఖ్యంగా మహిళల నుంచి తీవ్ర వ్యతిరేకత

కొన్నిచోట్ల సొంత పార్టీవారి నుంచే నిరసనలు

చెప్పేది వినండంటూ ఎమ్మెల్యేల హుకుం

గొడవలకు వచ్చారా అంటూ నేతల ఎదురుదాడి

అయినా.. ఎక్కడా తగ్గకుండా ప్రజల ప్రశ్నలవర్షం


గడప గడపలో ప్రజల నిరసన స్వరాలు తీవ్రరూపం దాలుస్తున్నాయి.  తిరుగుబాటు రూపు సంతరించుకుంటున్నాయి. నిన్నటిదాకా నేతలను నిలదీసిన జనం.. చొక్కా పట్టుకొని నిగ్గదీసి అడిగేందుకు, ఇంకా మాట్లాడితే వెంటపడి తరిమేందుకూ సిద్ధమవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

వైసీపీ నాయకులపై ప్రజాతిరుగుబాటు మొదలైంది. ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ పేరిట వస్తున్న అధికారపక్ష ఎమ్మెల్యేలను.. మూడేళ్లుగా ఏం చేశారంటూ కండువాలు పట్టుకుని నిలదీస్తున్నారు. ఇంటి పట్టాలు..ఇల్లు .. పింఛన్లు జగన్‌ ప్రభుత్వంలోనే వస్తున్నాయంటూ గొప్పలు చెప్పబోయిన ఎమ్మెల్యేలకు చుక్కలు చూపిస్తున్నారు. ‘చాలు చాల్లే .. ఇందిరమ్మకాలం నాటి నుంచీ ఇళ్లు కట్టించి ఇస్తున్నారు... పింఛన్లు కూడా ఇప్పటివి కావు.. జగన్‌ వచ్చిన తర్వాతే వృద్ధాప్య పింఛన్లు..వితంతు పింఛన్లు ఇవ్వడం ప్రారంభం కాలేదు’’ అంటూ తిరగబడుతున్నారు. అసలు ఇక్కడికి ఎందుకొచ్చారంటూ ఎదురుతిరుగుతున్నారు. ముఖ్యంగా మహిళల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం కావడం వైసీపీ ఎమ్మెల్యేలకు దిక్కుతోచని పరిస్థితిని తెచ్చిపెట్టింది. కొన్ని ప్రాంతాల్లో ఎదురు ప్రశ్నించిన మహిళలపై ఎమ్మెల్యేల అనుచరులు దుందుడుకుగా వ్యవహరిస్తున్నారు. అక్కడ ఉన్న యువకుల్లో కొందరు ఆ అనుచరులను ప్రతిఘటించి మహిళలకు రక్షణగా నిలుస్తున్నారు. అసలిక్కడకు ఎందుకు వచ్చారంటూ ఎదురు తిరుగుతున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలేమైనా ఉంటే చెప్పుకొని వెళ్లిపోండంటూ ప్రజా ప్రతినిధులకు ప్రజలు సలహా ఇస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాల సంగతేమిటని ప్రశ్నిస్తున్నారు. దీంతో ‘గడప..’లో ఎమ్మెల్యేలు నీళ్లు నములుతున్నారు. రోడ్లు, మురుగు కాలువలు, తాగు నీటి సదుపాయాల సంగతేమిటని ప్రశ్నిస్తున్న ప్రజలకు ప్రజా ప్రతినిధుల నుంచి సమాధానం రావడం లేదు. తాము చెప్పింది మాత్రమే వినాలంటూ కొందరు ఎమ్మెల్యేలు జులుం ప్రదర్శిస్తున్నారు. చెత్తపైనా పన్ను వేస్తారా అని మహిళల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీనిపై స్థానిక నేతలు సమాధానం ఇవ్వబోతుంటే .. మహిళలు మరింత కోపంతో ఊగిపోతున్నారు. పరిస్థితి చేయి దాటిపోతుందని భావిస్తున్న తరుణంలో ఎమ్మెల్యేలు అక్కడి నుంచి చల్లగా జారుకుంటున్నారు.


బాలినేనికి చుక్కెదురు..

ప్రకాశంజిల్లా ఒంగోలు నియోజకవర్గంలో ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో పర్యటించిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి చుక్కెదురయింది. ‘గడప..’లోకి వచ్చిన బాలినేనిని ప్రజలతోపాటు స్థానిక వైసీపీ మహిళా నేతలు సైతం నిలదీశారు. తమ పార్టీ నాయకులపైనే మాజీ మంత్రికి ఫిర్యాదు చేశారు. అనూహ్యంగా ప్రజల నుంచి.. సొంత పార్టీ నేతల నుంచి నిలదీతలు మొద లు కావడంతో.. బాలినేని తీవ్ర అసహనానికి గురయ్యారు. దీని వెనుక టీడీపీ నేత జనార్దన్‌ ఉన్నారం టూ అసహనం వ్యక్తం చేశారు. దీనికి సరైన సమాధా నం చెబుతానని బాలినేని హెచ్చరికలు చేశారు. 


పరుగే.. పరుగు..

అరకు ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణపై గిరిజన మహిళలు ఎదురుతిరిగారు. తమ స్థలాన్ని కబ్జా చేశావంటూ చొక్కా పట్టుకుని గుంజారు. దీంతో ఆయన నిశ్ఛేష్టుడై వచ్చిన కార్యక్రమాన్ని మధ్యలోనే వదిలేసి పారిపోయినంత పనిచేశారు. ఫాల్గుణ గ్రామాల్లో పర్యటిస్తున్నంత సేపూ నిలదీతల పర్వం కొనసాగింది. నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలెక్కడ అంటూ ఎమ్మెల్యేపై జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. 


‘జగనొచ్చాకే ఇస్తున్నాడా?’

జగన్మోహనరెడ్డి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్తోందని .. పింఛన్లు, ఇళ్లు ఇస్తోందంటూ పోలవరం ఎమ్మెల్యే బాలరాజు చెప్పబోగా.. అక్కడున్న మహిళలే ఎదురుతిరిగారు. ద్వితీయ శ్రేణి నేతలు కలుగజేసుకుని ఎమ్మెల్యేకు మద్దతుగా ఏదో అనబోగా మరింత ఆగ్రహించారు. ఇందిరమ్మ కాలం ఉంచీ పేదవారికి .. ఎస్సీ , ఎస్టీలకు కాలనీలు నిర్మించి ఇచ్చారంటూ వాదనకు దిగారు. జగన్మోహనరెడ్డి పింఛన్లు ఇస్తున్నారని అనడంతో .. పింఛన్లు తమకు ఎప్పటి నుంచో వస్తున్నాయని .. జగనొచ్చాకే ఇస్తున్నాడా అని మహిళలు నిలదీశారు. దీంతో ఎమ్మెల్యే బాలరాజుకు ఏంచెప్పాలో పాలుపోక మౌనందాల్చారు. ఈ సమయంలో స్థానిక నేతలు దురుసుగా మాట్లాడేందుకు సిద్ధం కావడంతో.. స్థానిక యువత కూడా అదేస్థాయిలో ప్రతిస్పందించింది. దీంతో.. స్థానిక నేతలతో కలసి ఎమ్మెల్యే బాలరాజు అక్కడ నుంచి వెళ్లిపోయారు. 

కొనసాగుతున్న నిలదీతలు..: అనంతపురం జిల్లా యల్లనూరు మండలం తిరుమలాపురంలో గురువారం జరిగిన ‘గడపగడపకు..’ కార్యక్రమంలో సొంతపార్టీ ఎంపీటీసీకే చుక్కదురైంది. శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.. తిరుమలాపురంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. తాడిపత్రి నుంచి సాయంత్రం 6 గంటల తర్వాత యల్లనూరుకు బస్సు సౌకర్యం లేదని వైసీపీ నాయకుడు, యల్లనూరు-2 ఎంపీటీసీ తిమోతి... ఎమ్మెల్యేకి చెప్పేందుకు ప్రయత్నించారు. అంతే.. ఎమ్మెల్యేతోపాటు వెళ్లిన వైసీపీ నాయకులు కొందరు ఎంపీటీసీని అక్కడి నుంచి బలవంతంగా పంపించివేశారు. కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి గురువారం పెద్దపెండేకల్లులో పర్యటించారు. స్థానికంగా ఉంటున్న పార్వతి అనే గృహిణి ఇంటికి సాయిప్రసాద్‌రెడ్డి వెళ్లారు. ‘అమ్మఒడి రాలేదు రెడ్డీ... ఇంటి స్థలమూ ఇవ్వలేద’ని పార్వతి దంపతులు... ఎమ్మెల్యేను గట్టిగా నిలదీశారు. దీంతో కోపోద్రిక్తుడైన ఎమ్మెల్యే ‘నీకు నోరు గట్టిగా ఉందే.. నాకేం చెవుడు లేదు... గట్టిగా మాట్లాడకు’ అంటూ దబాయించారు. దీంతో ఆవేదనకు గురైన పార్వతి ఏమాత్రం తగ్గకుండా... ‘మాకు రాలేదు కాబట్టే మిమ్మల్ని అడుగుతున్నాం. ఇంటిముందు కొళాయి వేసినా చుక్కనీరు రావడం లేదు. అందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఒక్కసారే అమ్మఒడి పడింది. వచ్చిన సొమ్ములో వైసీపీ నాయకులకు రూ.5వేలు ఇచ్చామ’’ంటూ ధాటిగా బదులిచ్చారు. బాపట్ల జిల్లా కేంద్రంలో సెంటు పొలం లేని తనకు వైఎస్సార్‌ రైతు భరోసా కింద డబ్బులిచ్చినట్లు చూసిన అధికారులపై ఆమె తిరగబడింది. ‘గడప గడపకు మన ప్రభుత్వం’లో భాగంగా ఆమె ఇంటికి డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి వెళ్లారు. ఆమెకు బుక్‌లెట్‌ ఇచ్చి మూడేళ్లలో అందిన లబ్ధి ఇదీ.. అంటూ లెక్కలు చెప్పడంతో ఆమె నివ్వరపోయింది. ‘‘అయ్యా నాకు పొలంలేదు.. మా ఇంట్లో చదువుకునే పిల్లలులేరు. వైఎస్సార్‌ ఆసరా అంటే ఏమిటో కూడా తెలియదు‘‘ అని ఆ మహిళ చెప్పటంతో అందరు ఖంగుతిన్నారు. జనం ‘గడప..’లో మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణికి చుక్కెదురయ్యింది. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం కొరిసిలలోకి రాకుండా  పొలిమేర్లలోనే గ్రామస్థులు ఆమెను అడ్డుకున్నారు.  

Updated Date - 2022-06-17T07:58:57+05:30 IST