Gadapa Gadapaku Mana Prabuthavam: నాకూ వంద కష్టాలున్నాయి: జగన్

ABN , First Publish Date - 2022-07-19T02:22:11+05:30 IST

‘గడపగడపకు మన ప్రభుత్వం’ (Gadapa Gadapaku Mana Prabuthavam) కార్యక్రమంపై సీఎం జగన్‌ ఆధ్వర్యంలో వర్క్‌షాప్‌ నిర్వహించారు.

Gadapa Gadapaku Mana Prabuthavam: నాకూ వంద కష్టాలున్నాయి: జగన్

అమరావతి: ‘గడపగడపకు మన ప్రభుత్వం’ (Gadapa Gadapaku Mana Prabuthavam) కార్యక్రమంపై సీఎం జగన్‌ ఆధ్వర్యంలో వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఈ వర్క్‌షాప్‌లో ఆశ్చర్యం కలిగించే అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఎమ్మెల్యేపై జగన్‌ (CM Jagan) సీరియస్‌ అయ్యారు. కొంతమంది ఎమ్మెల్యేలు సరిగ్గా తిరగడం లేదని, మమ అనిపిస్తున్నారని తప్పుబట్టారు. ఎమ్మెల్యేలు (MLAs) జనంతో ఉండాలని, తనతో పాటు ఎమ్మెల్యేలు కూడా కష్టపడాలని సూచించారు. తనకూ వంద కష్టాలున్నాయి... అయినా బటన్‌ నొక్కుతూనే ఉన్నానని తెలిపారు. ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పనిచేస్తేనే పార్టీకి ఉపయోగం ఉంటుందని పేర్కొన్నారు. ఈసారి గెలిచే అభ్యర్థులకే టికెట్లు ఇస్తామని వెల్లడించారు. తన కోసం త్యాగం చేసినా కూడా.. టికెట్‌ (Ticket) ఇచ్చే విషయంలో లెక్క చేయనని, ఆరు నెలల తరువాత తన నిర్ణయాలు వేరుగా ఉంటాయని హెచ్చరించారు. ఎన్నికలకు ఇంకా 20 నెలల సమయం ఉందని, జనంలోకి వెళ్లాలని జగన్‌ ఆదేశించారు. ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పనిచేయకపోతే ఇబ్బందులేనని హెచ్చరించారు. ఇప్పటికైనా పద్దతి మార్చుకోని ప్రజల్లోకి వెళ్లాలని సీఎం సూచించారు. 


50 మంది ఎమ్మెల్యేలు అసలు కార్యక్రమంలో పాల్గొనడం లేదని అసహనం వ్యక్తం చేశారు. కేవలం 15 మంది ఎమ్మెల్యేలే క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారని గుర్తుచేశారు. టికెట్లు ఇచ్చే విషయంలో తనకు ఇదే ప్రధానమైన అంశమని పేర్కొన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు ఒకేరోజు 3 సచివాలయాలు తిరుగుతున్నారని, ఒకేరోజు 3 సచివాలయాల పరిధిలో తిరగడం సాధ్యమవుతుందా? అని ప్రశ్నించారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం చేసిన మేలు చూపించాలన్నారు. ఈ సమావేశంలో బెజవాడ, వైజాగ్ కార్పొరేషన్‌లకు బిల్లులు ఇవ్వాలని జగన్‌ను ఎమ్మెల్యేలు అడిగారు. వస్తాయిలే అంటూ లైట్‌గా జగన్‌ సమాధానం ఇచ్చారు.

Updated Date - 2022-07-19T02:22:11+05:30 IST