మీ ఓటుతోనే భవిత!

ABN , First Publish Date - 2021-04-16T09:51:52+05:30 IST

రాష్ట్ర భవిష్యత్‌ను కాపాడుకునేందుకు తిరుపతి ఉప ఎన్నిక ఒక అవకాశమని.. ఓటు అనే వజ్రాయుధంతో వైసీపీకి బుద్ధి చెప్పాలని టీడీపీ అధినేత చంద్రబాబు

మీ ఓటుతోనే భవిత!

రెండేళ్లలో ఏం జరిగిందో నెమరువేసుకోండి

పావలా ఇచ్చి ముప్పావలా లాగేస్తున్నారు

బీసీలకు తీరని అన్యాయం చేశారు

సీఎం వర్గానికే 500 నామినేటెడ్‌ పదవులు

ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులు ఏమయ్యాయో?

నోరెత్తితే ఎస్సీ, ఎస్టీ కేసులు

వెయ్యి మంది రైతుల ఆత్మహత్య

భవన నిర్మాణ కార్మికులు విలవిల

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ లేదు

తిండిపెట్టలేక గురుకులాల మూసివేత

తిరుపతిలో ఎన్నికల అక్రమాలు జరిగితే

7557557744కు చేయండి: బాబు 


బాహుబలిని కట్టప్ప చంపారని తెలిసింది కానీ.. బాబాయ్‌ వివేకాను ఎవరు చంపారో ఇప్పటికీ తేలలేదు. అది జగన్‌ రెడ్డికే తెలుసు. అందుకే మేమడుగుతున్నాం. హూ కిల్డ్‌ బాబాయ్‌?


చంద్రబాబు


తిరుపతి, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర భవిష్యత్‌ను కాపాడుకునేందుకు తిరుపతి ఉప ఎన్నిక ఒక అవకాశమని.. ఓటు అనే వజ్రాయుధంతో వైసీపీకి బుద్ధి చెప్పాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపిచ్చారు. గురువారం సాయంత్రం తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం ముగియడంతో ఆయన తిరుపతిలోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వైసీపీ రెండేళ్ల పాలనలో ఏం జరిగిందో ప్రజలు నెమరు వేసుకోవాలని..  రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఓటర్లపై ఉందని అన్నారు. టీడీపీ పాలనలో సన్‌రైజ్‌ స్టేట్‌ పాలసీతో అనేక పరిశ్రమలు వచ్చాయని.. పెద్దఎత్తున అభివృద్ధి జరిగిందని తెలిపారు.


జగన్‌ ఈ రెండేళ్లలో విధ్వంసం సృష్టించారని మండిపడ్డారు. నవరత్నాల పేరుతో నవమోసాలు చేస్తున్నారని.. పావలా ఇచ్చి ముప్పావలా లాగేస్తున్నారని విమర్శించారు. ‘బీసీలకు అన్యాయం చేశారు. ఎస్సీ స్లబ్‌ప్లాన్‌ నిధులు ఏమయ్యాయో తెలియదు. రంజాన్‌ తోఫా, దుల్హన్‌ వంటి పథకాలు రద్దుచేశారు. జగన్‌ చేతికి బస్సు ఇచ్చి నడపమంటే తాగి అహంకారంతో బస్సు నడుపుతూ జనాల్ని తొక్కిస్తున్నాడు. ఇది హింసాత్మక పాలన’ అని చెప్పారు. 8 రోజులుగా తిరుపతిలో ప్రజల బాధలు విన్నానని తెలిపారు. ‘భూముల మధ్యలో దౌర్జన్యంగా రోడ్లు వేశారు. అడిగితే ఎస్సీ, ఎస్టీ కేసులు పెడుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరల పెరుగుదల, ప్రజలపై దాడి, ఎక్కడ చూసినా సహజ వనరుల దోపిడీ, అవినీతి. మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. అమెరికా ప్రభుత్వ రిపోర్ట్‌లో కూడా ఎస్సీలపై 150 దాడులు జరిగాయని చెప్పారు. శుక్రవారం సాయంత్రమైతే చాలు.. ఆస్తుల ధ్వంసానికి జేసీబీలు ఎక్కడ వస్తాయోనని ప్రజలు భయంతో కాలం వెళ్లదీస్తున్నారు.


164 దేవాలయాలపై దాడులు జరిగాయి. తిరుమల తిరుపతి పవిత్రతను దెబ్బతీశారు. రామతీర్థం వెళ్లి నిరసన తెలియజేస్తే మాపై కేసులు పెట్టారు. తిరుపతి సభలో రాళ్లు పడలేదని పోలీసులే చెబుతారు. సత్యవేడు సభకు కరెంట్‌ ఆపేస్తారు. ఇన్ని జరిగితే జగన్‌రెడ్డి ఏం చేస్తున్నారు. మొద్దునిద్ర పోతున్నారా’ అని విరుచుకుపడ్డారు. ఇంకా ఏమన్నారంటే..


అంతా అస్తవ్యస్తం..

జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక వెయ్యిమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. భవన నిర్మాణ కార్మికులు ఆర్థికంగా నష్టపోయారు. ప్రభుత్వ వేధింపులు తట్టుకోలేక కుటుంబాలకు కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ లేదు. రూ.1,000 కోట్లు బకాయిలున్నాయి. రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో తిండి పెట్టలేక మూసివేస్తుండడం సీఎంకు సిగ్గనిపించడం లేదా? ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. టీఏ, డీఏలు ఇవ్వడం లేదు. 6 డీఏలు పెండింగ్‌లో పెట్టారు. సీపీఎస్‌ రద్దు హామీ ఏమైంది? పీఆర్సీ విషయంలో కమిటీలపై కమిటీలు వేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. దోచుకుని విదేశాల్లో దాచుకోవడమే జగన్‌రెడ్డి నైజం. ‘నా జాతి చేతికి కత్తి ఇవ్వలేదు, ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చాను’ అని డాక్టర్‌ అంబేడ్కర్‌ చెప్పారు. రాజ్యాంగంలో ప్రజలకు విధులు, హక్కులు ఇచ్చారు. అధికారులు, పాలకులు ఏం చేయాలో కూడా దిశానిర్దేశం చేశారు.


కానీ వ్యవస్థలన్నిటినీ జగన్‌రెడ్డి నాశనం చేసి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. సామాజిక న్యాయాన్ని గాలికొదిలేశారు. ఆయన సామాజిక వర్గానికే 500 మందికి నామినేటెడ్‌ పదవులు కట్టబెట్టారు. ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తున్నారు. నాసిరకం మద్యంతో ఇబ్బందులు పెడుతున్నారు. సీఎం మాత్రం ఆనందపడుతున్నారు. మద్యపాన నిషేధం ఏమైంది? మద్యంపై వచ్చే ఆదాయం చూపి అప్పు తెచ్చుకోవాలని ప్రయత్నించేవారు మద్యపాన నిషేధం చేస్తారా? మద్యం పాత బ్రాండ్లు పెట్టాలి. మద్యంలో అవినీతిపై అఖిలపక్షం పెట్టి వాస్తవాలు చెప్పాలి.


కేంద్రాన్ని చూస్తే వణుకు

మెజారిటీ ఎంపీలను ఇచ్చినా ఏం సాధించారు? కేంద్రం మెడలు వంచుతామన్నారు. కానీ ఇప్పుడు కేంద్రాన్ని చూస్తే భయంతో వణికిపోతున్నారు. విభజన చట్టంలోని హామీలు ఏమయ్యాయి? రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రత్యేక ప్యాకేజీ ఏమైంది. విశాఖ రైల్వే జోన్‌ ఏమైంది. విశాఖ స్టీల్‌ ప్రైవేటీకరణను ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు? తిరుపతి ఎర్రచందనం స్మగ్లింగ్‌కు డెన్‌గా తయారైంది. భూములు కబ్జా చేస్తున్నారు. టీటీడీ ఆస్తులు అమ్మేస్తున్నారు. లేని పింక్‌ డైమండ్‌ ఉందని ఆరోపణలు చేశారు. వెంకటేశ్వర స్వామికి అపవిత్రత కలిగే విధంగా మాట్లాడిన అర్చకుడిని ప్రధాన అర్చకుడిగా పెడతారా?


కేంద్ర బలగాలు ఉండాలి..

ప్రతి పోలింగ్‌ బూత్‌లో సీసీ కెమెరా పెట్టాలి. దొంగ ఓట్లు వేసేవారిపై చర్యలు తీసుకోవాలి. తిరుపతిలో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలంటే కేంద్ర బలగాలు ఉండాలి. తిరుపతి ఉప ఎన్నిక దేవుడిచ్చిన అవకాశం. ఆకాశంలో తిరిగేవారికి, అహంకారంతో వ్యవహరించేవారికి గుణపాఠం చెప్పే అవకాశం వచ్చింది. మరో మూడేళ్లు వైసీపీ ఒళ్లు దగ్గరపెట్టుకుని పనిచేయాలంటే టీడీపీని గెలిపించాలి. ఉప ఎన్నిక కోసమే కంట్రోల్‌రూం ఏర్పాటుచేశాం. ఏమైనా సమస్యలు, ఇబ్బందులు ఉంటే 7557557744 నంబరుకు ఫోన్‌ చేయండి. వైసీపీ అరాచకాల వీడియోలను వాట్సాప్‌ చేయండి. సీఈసీకి ఫిర్యాదుచేసి తగిన చర్యలు తీసుకునేలా చేద్దాం. మనసులో టీడీపీకి ఓటువేయాలని ఉన్నా సంక్షేమ పథకాలు రావని భయపడుతున్నారు. వారికి అన్యాయం జరగకుండా చూసే బాధ్యత మాది.


ఇంతలా దోచేస్తే రైతుల పరిస్థితేంటి?

ఇసుక రీచ్‌లను సందర్శించిన బాబు 

పిచ్చాటూరు, ఏప్రిల్‌ 15: తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా సత్యవేడు పర్యటన ముగించుకుని తిరుపతి వెళ్తూ చంద్రబాబు మార్గమధ్యంలో ఉన్న ఇసుక రీచ్‌లను సందర్శించారు. ఒక్కో రీచ్‌ 20 అడుగుల లోతు మేర గోతులు తీసి ఉండడంతో ఆశ్చర్యపోయారు. ఇసుకను ఇంతలా దోచేస్తే రైతుల పరిస్థితి ఏం కావాలని ఆందోళన వ్యక్తం చేశారు. పిచ్చాటూరు మండలంలో గ్రామాలకు వెళ్లే రహదారిని సైతం ఇసుక మాఫియా ధ్వంసం చేసిందని గ్రామస్థులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. కారణి, సురుటుపల్లె, నందనం ఇసుక రీచ్‌లను స్థానిక నాయకులతో కలసి చంద్రబాబు సందర్శించారు. ఇంత అరాచకం ఏనాడూ చూడలేదన్నారు.


ఒకవైపు ఇసుకను వైసీపీ నాయకులు దోచేస్తుంటే మరోవైపు ఇసుక దొరక్క ఆగిపోయి కార్మికులు పస్తులతో అల్లాడుతున్నారని వాపోయారు. అనంతరం చంద్రబాబు తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. ‘కారణి, సురుటుపల్లె, నందనం రీచ్‌లలో వందల జేసీబీలు, టిప్పర్లతో ఇసుకను దోపిడీ చేస్తుండడం చూశా. ఇసుక తవ్వకంపై గ్రీన్‌ ట్రైబ్యునల్లో స్టే ఇచ్చారు. 60-70 అడుగులకు ఇసుక తవ్వుతున్నారు. పొల్లాలో నీళ్లు నదిలోకి వచ్చేస్తున్నాయి. ఈ ప్రాంతం ఎడారిగా మారిపోయే పరిస్థితి’ అని ఆవేదన వ్యక్తంచేశారు.

Updated Date - 2021-04-16T09:51:52+05:30 IST