ఫలించని ‘ముందస్తు’ వ్యూహం!

ABN , First Publish Date - 2020-12-05T09:27:02+05:30 IST

టీఆర్‌ఎస్‌ ముందస్తు వ్యూహం బెడిసి కొట్టింది. ఇదే వ్యూహంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పార్టీ.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మాత్రం చేదు ఫలితాన్ని చవిచూసింది.

ఫలించని ‘ముందస్తు’ వ్యూహం!

 అసెంబ్లీ లాగానే జీహెచ్‌ఎంసీకి ముందస్తు ఎన్నికలు

 సిట్టింగ్‌లకు టిక్కెట్లు ఇచ్చేందుకు చట్టంలో మార్పు

 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం.. గ్రేటర్‌లో ఎదురుదెబ్బ

హైదరాబాద్‌, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): టీఆర్‌ఎస్‌ ముందస్తు వ్యూహం బెడిసి కొట్టింది. ఇదే వ్యూహంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పార్టీ.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మాత్రం చేదు ఫలితాన్ని చవిచూసింది. గ్రేటర్‌ ఎన్నికలను అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే తుది ఫలితం మినహా అనేక విషయాల్లో సారూప్యత కనిపిస్తుంది.

గత అసెంబ్లీకి గడువు 2019 ఏప్రిల్‌ వరకూ ఉన్నప్పటికీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 6 నెలలు ముందుగానే ఎన్నికలకు వెళ్లింది. 2018 డిసెంబరులో పార్టీ ఘన విజయం సాధించింది. మెజారిటీ టికెట్లు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకే ఇచ్చింది.


జీహెచ్‌ఎంసీ పాలక మండలి గడువు ఫిబ్రవరి 10వ తేదీ వరకు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇక్కడా ముందస్తు ఎన్నికలకు వెళ్లింది. టీఆర్‌ఎస్‌ పార్టీ సిట్టింగ్‌ కార్పొరేట్లకే ఎక్కువ టికెట్లు కేటాయించింది. రిజర్వేషన్లను మార్చకుండా ఉండేందుకు ప్రభుత్వం ఏకంగా మునిసిపల్‌ చట్టాన్నే సవరించింది. అయినా.. టీఆర్‌ఎస్‌ ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. 


కొత్త పాలక వర్గం ఫిబ్రవరి 11 వరకు ఆగాల్సిందే!

ప్రస్తుత జీహెచ్‌ఎంసీ పాలక వర్గానికి వచ్చే ఏడాది ఫిబ్రవరి 10వ తేదీ వరకు గడువు ఉంది. సాధారణంగా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించినా పాత పాలకవర్గం పదవీ కాలం పూర్తయ్యే వరకు కొత్త వారు పదవీ బాధ్యతలు తీసుకునేందుకు అవకాశం లేదు. దీంతో కొత్త కార్పొరేటర్లు ఫిబ్రవరి 11వ తేదీ తర్వాతే బాధ్యతలు స్వీకరించాల్సి ఉంటుంది.


Updated Date - 2020-12-05T09:27:02+05:30 IST