వెతికి వెతికీ ‘చితి’కి

ABN , First Publish Date - 2021-05-07T10:00:47+05:30 IST

శ్మశానాల వద్ద వరుస కట్టిన మృతదేహాలు.. అంత్యక్రియల కోసం నిరీక్షణ. ఆ నిరీక్షణ ఎన్ని గంటలపాటు కొనసాగుతుందో తెలియదు.

వెతికి వెతికీ ‘చితి’కి

హైదరాబాద్‌లో ఆరేడు శ్మశానాల్లోనే కొవిడ్‌ మృతుల అంత్యక్రియలు

భారీగా మరణాలు.. పరిమితంగానే దహనాలు

అస్థికలు తీసుకెళ్లేవారి కోసం నిరీక్షణతో ఆలస్యం

విద్యుత్తు వాటికల్లో రోజుకు 8-10 మాత్రమే

రద్దీతో అంత్యక్రియలకు 10-12 గంటలు


హైదరాబాద్‌ సిటీ, మే 6 (ఆంధ్రజ్యోతి): శ్మశానాల వద్ద  వరుస కట్టిన మృతదేహాలు.. అంత్యక్రియల కోసం నిరీక్షణ. ఆ నిరీక్షణ ఎన్ని గంటలపాటు కొనసాగుతుందో తెలియదు. కొన్నిచోట్ల 10-12 గంటల పాటు నిల్చున్నా కూడా దహనక్రియలకు అవకాశం రావడంలేదు. అప్పటికి ఏడ్చి ఏడ్చీ కళ్లలో నీరింకిపోయి.. మనసు వికలమైపోయి.. నిస్పృహలో మునిగిపోయిన ఆప్తుల గుండెలను ఈ ఎడతెగని నిరీక్షణ దహించివేస్తోంది. హైదరాబాద్‌లో ఇప్పుడు చావుల బాధను మించి అంత్యక్రియల నిర్వహణే ఏడిపిస్తోంది.


కొవిడ్‌ మరణాలు పెరుగుతుండటంతో శ్మశాన వాటికలపై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో   నేరుగా రావొద్దని.. ముందుగా చెబితే తరలించాల్సిన సమయం తామే చెబుతామని వాటికల నిర్వాహకులు చెబుతున్నారు. విద్యుత్తు దహన వాటికల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. నగరంలో కొవిడ్‌ శ్మశాన వాటికలు పరిమితంగా ఉండటమే దీనికి కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 


సంప్రదాయాలతోను ఆలస్యమా?

నగరంలో ఈఎ్‌సఐ, మహాప్రస్థానం, పంజాగుట్ట, అంబర్‌పేట, బన్సిలాల్‌పేట, కవాడిగూడ, జల్‌పల్లి ఖబ్రస్థాన్‌లో కొవిడ్‌ మృతుల అంత్యక్రియలను నిర్వహిస్తున్నారు.  అంబర్‌పేట, పంజాగుట్ట, బన్సిలాల్‌పేట, మహాప్రస్థానంలో విద్యుత్తు దహన వాటికలున్నాయి. పలు హిందూ శ్మశాన వాటికల్లో కొవిడ్‌ మృతదేహాల కోసం పరిమిత సంఖ్యలో ఫ్లాట్‌పామ్‌లను కేటాయించారు. అంతకంటే ఎక్కువ వస్తే అంత్యక్రియల నిర్వహణ కుదరదని చెప్పేస్తున్నారు. అంబర్‌పేట హరా్‌సపెంటలోని శ్మశాన వాటికలో 92 ఫ్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి. ఇందులో 17 కొవిడ్‌ మృతదేహాల కోసం కేటాయించారు. అయితే రోజుకు మూడు నుంచి నాలుగు కంటే ఎక్కువ  దహనం చేయడం లేదు.


అప్పటికే దహనం చేసిన మృతదేహాల తాలూకు అస్థికలు, బూడిద ఉన్నాయని, అందుకే ఎక్కువ చేయలేకపోతున్నట్లు చెబుతున్నారు. సంప్రదాయాల ప్రకారం మూడు నుంచి ఐదు రోజులకు సంబంధీకులు వస్తున్నారని శ్మశానవాటిక కమిటీ ప్రతినిధి వెల్లడించారు. కొందరేమో తీసుకెళ్లేందుకు రావడం లేదని.. దీంతో ఆ ఆస్థికలు, బూడిదను తామే తొలగిస్తున్నట్లు చెప్పారు. అంత్యక్రియల విషయంలో చాలామందికి పట్టింపులు ఉంటాయని, వారి సంప్రదాయాలను గౌరవించాల్సి ఉంటుంది అని చెప్పారు. 


యంత్రం కూలింగ్‌ కోసం గ్యాప్‌.. 

విద్యుత్తు దహన వాటికల్లోనూ రోజుకు 8 నుంచి 10 మృతదేహాలను మాత్రమే దహనం చేస్తున్నారు. అంబర్‌పేటలోని దహన వాటికకు కొవిడ్‌ మృతదేహంతో కొందరు వెళ్లగా అప్పటికే అక్కడ వరుస పెట్టి శవాలు ఉన్నాయి. నిర్వాహకులు.. ఏడెనిమిది గంటలు వేచి ఉండాలని చెప్పారు. ఎందుకింత ఆలస్యం? అని ప్రశ్నిస్తే.. విద్యుత్తు దహనవాటిక యంత్రం నిరంతరాయంగా పనిచేస్తే పాడయ్యే ప్రమాదం ఉందని.. అందుకే పరిమిత సంఖ్యలో దహనాలు చేస్తున్నామని చెప్పారు. బన్సిలాల్‌పేట, పంజాగుట్ట విద్యుత్తు దహన వాటికల వద్దా ఈ పరిస్థితే ఉంది. బన్సిలాల్‌పేట శ్మశానవాటికలో యంత్రం పనిచేయడంతో రెండు రోజులుగా అక్కడ అంత్యక్రియలు నిలిచిపోయాయి.  


శివార్లలో స్థలాలు చూశారు.. వదిలేశారు

నిరుడు ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో కరోనా విజృంభించింది. వేలాది మంది వైరస్‌ బారిన పడగా.. పదుల సంఖ్యలో మరణించారు. అప్పుడు స్థానికుల అభ్యంతరాలతో దహన సంస్కారాలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో  నగర శివారు ప్రాంతాల్లోని ప్రభుత్వ స్థలాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని ప్రకటించారు. పలు ప్రాంతాల్లో స్థలాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు.


ఇక కొన్నిచోట్ల గ్యాస్‌ దహన వాటికల ఏర్పాటుకు జీహెచ్‌ఎంసీ శ్రీకారం చుట్టింది. ఏడాది గడిచినా.. ఇప్పటికీ ఒక్క  వాటిక కూడా అందుబాటులోకి రాలేదు. పటాన్‌చెరు, మూసాపేట, ఎల్‌బీనగర్‌లో రూ.95 లక్షల నుంచి రూ. కోటి వ్యయంతో గ్యాస్‌ దహన వాటికల  నిర్మాణాన్ని ప్రారంభించారు. కూకట్‌పల్లి, పటాన్‌చెరులో పనులు పూర్తయినా.. సాంకేతిక బృందం చెన్నై నుంచి రావడంలో ప్రారంభం జాప్యం అవుతోంది.

Updated Date - 2021-05-07T10:00:47+05:30 IST