విభజన చట్టంలోని హామీలను నెరవేర్చండి

ABN , First Publish Date - 2022-06-30T09:13:53+05:30 IST

హైదరాబాద్‌, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): ‘‘ఎన్నికల సందర్భంలో బీజేపీ తెలంగాణకు ఇచ్చిన హామీలను అమలు చేయించండి. విభజన చట్టంలో పేర్కొన్న హామీలను

విభజన చట్టంలోని హామీలను నెరవేర్చండి

ఎన్నికల హామీలనూ అమలు చేయించండి

రాష్ట్ర పర్యటన సందర్భంగా ప్రధాని మోదీని ఒప్పించండి

సంజయ్‌, కిషన్‌రెడ్డిలను కోరిన జగ్గారెడ్డి

8 ఏళ్లలో మోదీ చేసిందేమీ లేదని వ్యాఖ్య

తెలంగాణకు ఇచ్చిందేమీ లేదని ఉద్ఘాటన

పేదోళ్ల ఖాతాల్లో రూ. 15 లక్షలపై నిలదీత

2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్న

హైదరాబాద్‌, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): ‘‘ఎన్నికల సందర్భంలో బీజేపీ తెలంగాణకు ఇచ్చిన హామీలను అమలు చేయించండి. విభజన చట్టంలో పేర్కొన్న హామీలను నెరవేర్చండి. ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల రాష్ట్ర పర్యటన సందర్భంగా ఆయనను ఈ హామీల అమలుకు ఒప్పించండి. ఆయా జీవోలు వచ్చేలా చూడండి’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి కోరారు. బుధవారం ఆయన మాజీ ఎంపీపీ ఆంజనేయులు యాదవ్‌తో కలసి గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. ఏపీకి శ్వాసలాంటి విశాఖ ఉక్కు పరిశ్రమను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటుపరం చేస్తుంటే.. ఏపీ బీజేపీ శాఖ ఏమీ మాట్లాడలేదని విమర్శించారు. విభజన చట్టంలో తెలంగాణలోని ఖాజీపేటకు కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కుపరిశ్రమ, గిరిజన యూనివర్సిటీ ఎక్కడికిపోయాయని ప్రశ్నించారు. ‘‘తెలంగాణలోని ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా హామీ ఉన్నా.. ఇంత వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు? బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు తెలంగాణకు వస్తున్న ప్రధాని మోదీ వీటికి సమాధానం చెప్పాలి’’ అని డిమాండ్‌ చేశారు. ఇప్పటికీ ఉద్యోగుల విభజన జరగలేదని, నదీ జలాల పంపకంపై తేల్చలేదని విమర్శించారు. ఏపీలో కలిపిన పోలవరం ముంపు గ్రామాలను వెనక్కి తిరిగి ఇవ్వాలన్నారు. విభజన చట్టంలోని హామీలతోపాటు.. ఈ ప్రశ్నలపై ప్రధాని మోదీతో ప్రకటన చేయించాలని బండి సంజయ్‌, కిషన్‌రెడ్డిలను కోరారు. ప్రధాని రాక నేపథ్యంలో కాంగ్రెస్‌ కార్యాచరణను గురువారం ప్రకటిస్తామని వెల్లడించారు. ‘‘ఎన్నికలకు ముందు.. బీజేపీ అధికారంలోకి వస్తే.. ఏడాదికి 2 కోట్ల చొప్పున ఉద్యోగాలు కల్పిస్తామంటూ మోదీ ఇచ్చిన హామీ ఏమైంది? ప్రతి పేదవాడి బ్యాంకు ఖాతాలోకి రూ.15లక్షల చొప్పున వేస్తానన్నారు. దీనిపై సమాధానం ఏంటి’’ అని నిలదీశారు. ‘‘దేవుళ్లను రాజకీయాల్లోకి లాగుతున్నారు. చార్మినార్‌ భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్తున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌.. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయిస్తానంటూ అమ్మవారిని మొక్కాలి’’ అని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-06-30T09:13:53+05:30 IST