ఇక నుంచి వరి వేస్తే ఉరే

ABN , First Publish Date - 2021-09-13T07:45:30+05:30 IST

ఒక్క కిలో బాయిల్డ్‌ రైస్‌ను కూడా తాము కొనలేమని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పిన నేపథ్యంలో రాష్ట్రంలో బాయిల్డ్‌ రైసు మిల్లులు మూతపడే ప్రమాదం ఉందని, రాష్ట్రంలో ఇకముందు వరి పంట సాగు చేయడం...

ఇక నుంచి వరి వేస్తే ఉరే

బాయిల్డ్‌ రైసును కొనబోమని కేంద్రం స్పష్టం చేసింది

ఈ సీజన్‌లో 1.4 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి అంచనా

కేంద్రం కోటా 60 లక్షల టన్నులే.. మన సేకరణ అంతే

యాసంగిలో పల్లీ, పెసలు తదితరాలతో లాభాలు

యాసంగి నుంచి వడ్లు పండించడం శ్రేయస్కరం కాదు

బాయిల్డ్‌ రైసును కొనబోమని కేంద్రం చేసింది స్పష్టం                                               

ఆ నిర్ణయంతో బాయిల్డ్‌ మిల్లులు మూతపడే ప్రమాదం

ధాన్యాన్ని ప్రభుత్వం, మిల్లర్లు కొనలేని పరిస్థితులు

యాసంగిలో వేరుశనగ, పొద్దుతిరుగుడుతో లాభాలు

సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన వ్యవసాయశాఖ 

ఉన్నతస్థాయి సమీక్షలో అభిప్రాయాలు


హైదరాబాద్‌, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): ఒక్క కిలో బాయిల్డ్‌ రైస్‌ను కూడా తాము కొనలేమని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పిన నేపథ్యంలో రాష్ట్రంలో బాయిల్డ్‌ రైసు మిల్లులు మూతపడే ప్రమాదం ఉందని, రాష్ట్రంలో ఇకముందు వరి పంట సాగు చేయడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని వ్యవసాయశాఖ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో పలువురు అధికారులు అభిప్రాయపడ్డారు.


సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన వ్యవసాయ పంటల సాగు, ధాన్యం కొనుగోలు తదితర అంశాలపై ఆదివారం ప్రగతిభవన్‌లో ఈ సమావేశం జరిగింది. బాయిల్డ్‌ రైస్‌ను కొనేది లేదని కేంద్రం తెగేసి చెప్పిన దరిమిలా ఇక వచ్చే యాసంగి నుంచి వరి పంట వేయడం అంటే రైతులు ఉరివేసుకోవడమే అన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలైన శనగలు, వేరు శనగలు, పెసర్లు, మినుములు, నువ్వులు, ఆవాలు, పొద్దు తిరుగుడు, ఆముదాలు, కూరగాయల లాంటివి పండిస్తే రైతులకు లాభాలు వస్తాయని   అభిప్రాయపడ్డారు. సమావేశంలో వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖల అధికారులు మాట్లాడుతూ. గత యాసంగిలో ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేంద్రం, ఎఫ్‌సీఐ ద్వారా త్వరగా తీసుకోవాలని, తద్వారా వానాకాలంలో ఉత్పత్తి అయ్యే పంట నిల్వకు సరిపడా స్థలం లభిస్తుందన్నారు.


ఇటీవల  కేంద్ర పౌర సరఫరాలశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ను రాష్ట్ర మంత్రులు గంగుల కమలాకర్‌, కేటీఆర్‌ కలిసి విన్నవించగా, ఒక్క కిలో బాయిల్డ్‌ రైస్‌ కూడా కొనలేమని, ఇప్పటికే కేంద్రం వద్ద ఐదేళ్లకు సరిపడా నిల్వలున్నాయని కేంద్రమంత్రి తేల్చిచెప్పిన విషయాన్ని  ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుత వానాకాలంలో కూడా 60 లక్షల టన్నులు మించి ధాన్యం తీసుకోమని కేంద్ర ప్రభుత్వం నిర్మొహమాటంగా చెప్పినందున, ధాన్యాన్ని ప్రభుత్వం గానీ, మిల్లర్లు గానీ కొనుగోలు చేయడానికి ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు రానున్నాయని అధికారులు సమావేశంలో తెలిపారు. గత యాసంగిలో రాష్ట్రం 92 లక్షల టన్నుల ధాన్యం సేకరించిందని, రైతులు ఈ వానాకాలంలో 55 లక్షల ఎకరాల్లో వరి సాగుచేస్తున్నారని, దీని ద్వారా రూ.1.4 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందనే అంచనా ఉందని, ఇప్పటికే సుమారు 70 లక్షల టన్నుల ధాన్యం ఇంకా రాష్ట్ర రైస్‌ మిల్లుల్లో, ఇతర ప్రదేశాల్లో ఉందని అధికారులు వివరించారు.



వీటి దృష్ట్యా పీడీఎస్‌ తదితర అవసరాల మేరకు కేంద్రం నిర్ధారించిన కోటా మినహా మిగతా ధాన్యం కొనుగోలు చేయడం కేంద్ర ప్రభుత్వ విధానాల దృష్ట్యా సాధ్యం కాకపోవచ్చుననే అభిప్రాయం వ్యక్తమైంది. రాష్ట్ర ప్రభుత్వంపై గత యాసంగిలో ేసకరించిన ధాన్యం వల్ల సుమారు రూ.2,000 కోట్ల అదనపు భారం పడనుందని అధికారులు వివరించారు. గతంలో కరోనా వల్ల రైతులు ఎట్టి పరిస్థితుల్లో నష్టపోవద్దని రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల వ్యయ ప్రయాసలకోర్చి పూర్తి ధాన్యం కొనుగోలు చేసింది. కానీ, ఈ వర్షాకాలంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం నిర్ధారించిన 60 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలును ఐకేపీ కేంద్రాల ద్వారా కోటా మేరకు మాత్రమే ధాన్యం ేసకరణ జరగాలని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. రైతులను చైతన్య పరిచేందుకు వ్యవసాయశాఖ అన్ని స్థాయిల్లోని అధికారులు తగు ప్రచారం నిర్వహించాలని సమావేశంలో వెల్లడించారు. ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక చర్యల కారణంగా రాష్ట్రంలో పంటసాగు గణనీయంగా పెరిగిందని, అంతర్జాతీయ స్థాయిలో ఎగుమతులను కేంద్రం ప్రోత్సహించాలని, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ తదితర వ్యవసాయాధారిత పరిశ్రమలను ఏర్పాటు చేయాల్సిన కేంద్రం ఇలాంటివి చేయడం లేదని సమావేశంలో అభిప్రాయపడ్డారు.

Updated Date - 2021-09-13T07:45:30+05:30 IST