మొదటికే మోసం!

ABN , First Publish Date - 2022-08-02T09:28:38+05:30 IST

‘‘పోలవరం ప్రాజెక్టు తొలిదశలో 41.15 మీటర్ల కాంటూరులోనే నీటి నిల్వ చేస్తాం. కేంద్రం నిధులిచ్చాకే 45.72 మీటర్ల కాంటూరు పరిధిలోని నిర్వాసితులకు డబ్బులు చెల్లించి భూసేకరణ చేస్తాం’’ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చేసిన ప్రకటన..

మొదటికే మోసం!

  • 41.15 మీటర్ల కాంటూరు వరకేనంటే
  • కొత్త నోటిఫికేషన్‌ ఇవ్వాల్సిందే!!
  • పోలవరం నిర్వాసితుల డిమాండ్‌
  • నీటి నిల్వపై బూమరాంగ్‌
  • అవుతున్న ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటన
  • మళ్లీ నోటిఫికేషన్‌తో చిక్కుముడులెన్నో
  • పరిహార భారం తడిసిమోపెడు
  • ప్రస్తుత మార్కెట్‌ ధరలే చెల్లించాలి
  • మూడు నెలల్లో పరిహారం ఇచ్చేయాలి
  • భూసేకరణ, పునరావాసం ఖర్చు
  • రూ.30 వేల కోట్లయ్యే అవకాశం
  • ఈ మొత్తం కేంద్రం ఇచ్చే చాన్సేలేదు
  • రాష్ట్రం బాధ్యతని ఇదివరకే స్పష్టీకరణ
  • త్రిశంకు స్వర్గంలో ప్రాజెక్టు?


పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కొత్త కొత్త సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. 41.15 మీటర్ల ఎత్తులోనే నీటిని నిల్వ చేస్తామని.. కేంద్రం డబ్బులిస్తేనే 45.72 మీటర్ల ఎత్తున భూసేకరణ, సహాయ పునరావాసం చేపడతామంటూ.. ముందుచూపు లేకుండా సీఎం జగన్‌ చేసిన ప్రకటన మొదటికే మోసం తెచ్చేలా కనిపిస్తోంది. ఇలాగైతే 41.15 మీటర్లకే డీపీఆర్‌ను మార్చాలని.. మళ్లీ కొత్తగా భూసేకరణ నోటిఫికేషన్‌ ఇవ్వాలని నిర్వాసితులు పట్టుబడుతున్నారు. కొత్త ప్రకటన జారీచేస్తే భారం తడిసి మోపెడవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


(అమరావతి-ఆంధ్రజ్యోతి): ‘‘పోలవరం ప్రాజెక్టు తొలిదశలో 41.15 మీటర్ల కాంటూరులోనే నీటి నిల్వ చేస్తాం. కేంద్రం నిధులిచ్చాకే 45.72 మీటర్ల కాంటూరు పరిధిలోని నిర్వాసితులకు డబ్బులు చెల్లించి భూసేకరణ చేస్తాం’’ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చేసిన ప్రకటన.. ప్రాజెక్టు భవితవ్యాన్ని ప్రశ్నార్థకంగా  మార్చేసింది. కేంద్రం నిధులిచ్చేంత వరకూ 45.72 మీటర్ల కాంటూరు దాకా భూసేకరణ జరగదని తేలిపోవడంతో.. మళ్లీ కొత్తగా భూసేకరణ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని నిర్వాసితులు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రాజెక్టు డిజైన్‌ సమయంలోనే ఎంత మేర నీటిని నిల్వ చేస్తారో.. నిర్వాసితులకు భూసేకరణ ఎంత చేపట్టాలో ఖరారు చేస్తూ సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను తయారు చేస్తారు. దీని ఆధారంగానే భూసేకరణ చేస్తారు. సహజంగా ప్రాజెక్టు గరిష్ఠ నీటి నిల్వ మేరకే భూసేకరణ ఉంటుంది. ప్రాజెక్టు పూర్తయినా భద్రతా కారణాల దృష్ట్యా ఒకేసారి నీటిని నిల్వ చేయరు. కనిష్ఠ నీటి నిల్వ స్థాయి (ఎంఎండీఎల్‌)లో తొలి ఏడాది నీటిని నిల్వ చేసి.. క్రమంగా పెంచుకుంటూ పోతారు. దీనివల్ల ప్రాజెక్టుకు భద్రత ఉంటుంది. కాగా.. 2013 భూసేకరణ చట్టానికి లోబడి.. నోటిఫికేషన్‌ ఇచ్చిన మూడేళ్లలో పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఆలోగా చెల్లించకపోతే సదరు చట్టం ప్రకారం ఆ నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకున్నట్లుగా భావించాల్సి ఉంటుంది. అంటే గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌ చెల్లుబాటు కాదు. మళ్లీ కొత్తగా జారీ చేయాల్సి ఉంటుంది. ఇలా జారీ చేస్తే.. ప్రస్తుత మార్కెట్‌ ధర మేరకు పరిహారం చెల్లించాలి. పైగా మూడు నెలల్లో పరిహారం మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు.. చెల్లించాల్సిన మొత్తం రూ.20 వేల కోట్ల నుంచి రూ.30 వేల కోట్లకుచేరే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.


చేతులెత్తేసిన కేంద్రం..

భూసేకరణ ఖర్చుపై కేంద్రం చేతులెత్తేసింది. ఆ భారం రాష్ట్రానిదేనని ఇదివరకే తేల్చేసింది. దీనిపై రెండు ప్రభుత్వాల మధ్య లేఖల యుద్ధం నడుస్తుంది. ఇలాంటి తరుణంలో భూసేకరణ, సహాయ పునరావాసానికి 20 వేల కోట్లు కావాలని.. దీనికోసం కేంద్రంపై యుద్ధం చేస్తున్నామని.. కేంద్రం ఇస్తేనే 45.72 మీటర్ల కాంటూరుకు భూసేకరణ, సహాయ పునరావాస చర్యలు చేపడతామని సీఎం ఇటీవల వరద ప్రాంతాల్లో పర్యటించినప్పుడు చెప్పారు. కానీ రాష్ట్రానిదే బాధ్యత అంటున్న కేంద్రం ఏకంగా రూ.20 వేల కోట్లు ఇస్తుందా? వాస్తవానికి 2019లో అధికార పగ్గాలు చేపట్టిన జగన్‌ సర్కారు.. ఏటా రూ.5,000 కోట్లు వ్యయం చేసినా.. నాలుగేళ్లలో 20 వేల కోట్లు అయ్యేవని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. కానీ భూసేకరణ, పునరావాస పనులకు ప్రాధాన్యం ఇవ్వకుండా హెడ్‌వర్క్స్‌ పూర్తి చేయడంపైనే దృష్టి పెట్టిందని విమర్శిస్తున్నారు.


41.15 మీటర్ల కాంటూరుకైనా..

పోలవరం ప్రాజెక్టుకు మొత్తం భూసేకరణ, సహాయ పునరావాసానికి రూ.33,168.33 కోట్ల వ్యయమవుతుందని 2017-18 అంచనాల్లో జల వనరుల శాఖ పేర్కొంది. తర్వాత దానిని రూ.28,172.21 కోట్లకు సవరించారు. 41.15 మీటర్ల కాంటూరు వరకైతే భూసేకరణకు రూ.4,191.86 కోట్లు ఖర్చవుతుందని జలవనరుల శాఖ అంచనా వేసింది. అందులో ఇప్పటి వరకూ రూ.3,695.66 కోట్లే వ్యయమయ్యాయి. ఇంకా రూ.496.20 కోట్లు ఖర్చు చేయాలి.  సహాయ పునరావాసానికి రూ.2,431.11 కోట్లు కావాలి. జగన్‌ సర్కారు పైసా ఇవ్వడం లేదు. కేంద్రం ఇస్తుందేమోనని ఎదురుచూస్తోంది. ఇప్పుడు నిర్వాసితుల డిమాండ్‌కు తలొగ్గి కొత్త నోటిఫికేషన్‌ ఇస్తే రూ.30 వేల కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. రూ.2,927 కోట్లు ఇవ్వడానికే బాధ్యత మాది కాదంటే మాది కాదని తప్పించుకుంటున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంత భరించేందుకు అంగీకరిస్తాయా? పోలవరం ప్రాజెక్టు త్రిశంకు స్వర్గంలో పడినట్లేనని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

Updated Date - 2022-08-02T09:28:38+05:30 IST