అహ్మదాబాద్ పిచ్‌పై ఎలా బ్యాటింగ్ చేయాలో చెప్పిన ఆకాశ్ చోప్రా

ABN , First Publish Date - 2021-03-02T17:49:52+05:30 IST

అహ్మదాబాద్‌ వంటి పిచ్‌లపై ఎలా బ్యాటింగ్ చేయాలో మాజీ టీమిండియా బ్యాట్స్‌మన్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తెలిపాడు. మొతేరా పిచ్‌ను పూర్తిగా ఎర్రమట్టితో తయారు చేశారని, అందువల్ల పిచ్ వేగంగా..

అహ్మదాబాద్ పిచ్‌పై ఎలా బ్యాటింగ్ చేయాలో చెప్పిన ఆకాశ్ చోప్రా

ఇంటర్నెట్ డెస్క్: అహ్మదాబాద్‌ వంటి పిచ్‌లపై ఎలా బ్యాటింగ్ చేయాలో మాజీ టీమిండియా బ్యాట్స్‌మన్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తెలిపాడు. మొతేరా పిచ్‌ను పూర్తిగా ఎర్రమట్టితో తయారు చేశారని, అందువల్ల పిచ్ వేగంగా ఉంటుందని అన్నాడు. ఈ పిచ్‌లలో బంతి బ్యాట్ మీదకు వేగంగా వస్తుందని, దానివల్ల బంతిని అంచనా వేయడంలో బ్యాట్స్‌మెన్ తడబడ్డారని చోప్రా చెప్పాడు. రెండో టెస్టులో చెన్నై పిచ్ నల్లమట్టితో తయారు చేయడం వల్ల  బంతి బ్యాట్‌మెన్‌ను చేరడానికి కొంత సమయం పడుతుందని, కానీ అహ్మదాబాద్ పిచ్‌పై అంత సమయం లభించదని చోప్రా వివరించాడు.


చెన్నై పిచ్‌కు అలవాటు పడడం వల్లనే మూడో టెస్టులో బ్యాట్స్‌మెన్ తడబడి వికెట్లు పోగొట్టుకున్నారని ఆకాశ్ వెల్లడించాడు. అంతేకానీ పిచ్‌పై బంతి తిరగడం వల్లనే వికెట్లు పడ్డాయనడం సమంజసం కాదని అభిప్రాయపడ్డాడు. ‘రెండు జట్లలో ఎక్కువ వికెట్లు నేరుగా వచ్చిన బంతులకే పడ్డాయి. మ్యాచ్‌ను గమనిస్తే ఈ విషయం అర్థం చేసుకోవచ్చ’ని ఆకాశ్ పేర్కొన్నాడు.


మొతేరాలాంటి డ్రిఫ్ట్ అయ్యే పిచ్‌లపై అక్షర్ వంటి హై ఆర్మ్ యాక్షన్ బౌలర్లను ఎదుర్కోవడం పెద్ద సవాలేనని, అక్షర్ బంతిని స్కిడ్ చేయడం వల్లనే ఎక్కువ వికెట్ల తీసుకోగలిగాడని చోప్రా చెప్పాడు. అక్షర్‌తో పాటు అశ్విన్ కూడా చక్కగా బౌలింగ్ చేశాడని, ఇంగ్లండ్ బౌలర్ జాక్ లీచ్ కూడా ఈ పిచ్‌ను బాగా ఎంజాయ్ చేశాడని ఆకాశ్ చోప్రా తెలిపాడు. ‘ముఖ్యంగా అక్షర్, లీచ్ వంటి స్పిన్నర్‌లు బంతిని స్కిడ్ చేయడం వల్ల బంతి తిరగడం పక్కనపెడితే వేగంగా బ్యాట్‌మీదకు దూసుకొస్తుంది. అప్పుడు బ్యాట్స్‌మన్ దానిని ఆడేందుకు చాలా తక్కువ సమయం లభిస్తుంది. ఆ కారణంగానే బ్యాట్స్‌మెన్ అవుటయ్యార’ని ఆకాశ్ పేర్కొన్నాడు. 


‘ఒకవేళ బంతి స్పిన్ తిరుగుతుందని బ్యాట్స్‌మన్ భావించి ఆడేందుకు సిద్ధమైనప్పుడు.. అది నేరుగా బ్యాట్ మీదకు వస్తే బ్యాట్స్‌మన్ వద్ద సమాధానం ఉండదు. అక్షర్ వికెట్లలో అత్యధికం అలాంటి బంతులకే పడ్డాయి. కానీ.. భారత బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ, ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ జాక్ క్రాలీ ఇలాంటి పిచ్‌లపై ఎలా బ్యాటింగ్ చేయాలో నిరూపించార’ని చోప్రా పేర్కొన్నాడు.

Updated Date - 2021-03-02T17:49:52+05:30 IST