మాజీ స్పీకర్‌ ముత్తయ్య కన్నుమూత

ABN , First Publish Date - 2022-09-22T13:54:20+05:30 IST

శాసనసభ మాజీ స్పీకర్‌ సేడపట్టి ముత్తయ్య(Former Speaker Sedapatti Muttiah) బుధవారం ఉదయం మృతి చెందారు. ఆయన వయస్సు 76

మాజీ స్పీకర్‌ ముత్తయ్య కన్నుమూత

                                     - సీఎం సంతాపం


చెన్నై, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): శాసనసభ మాజీ స్పీకర్‌ సేడపట్టి ముత్తయ్య(Former Speaker Sedapatti Muttiah) బుధవారం ఉదయం మృతి చెందారు. ఆయన వయస్సు 76 సంవత్సరాలు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ వచ్చిన ముత్తయ్య ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురై మదురైలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వచ్చారు. బుధవారం ఆయన ఆరోగ్యపరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ముత్తయ్య 1977, 1980, 1984, 1991 సంవత్సరాల్లో అన్నాడీఎంకే(AIADMK) శాసనసభ్యుడిగా గెలిచారు. 1991 నుండి 1999 వరకు అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో శాసనసభ స్పీకర్‌గా సేవలందించారు. నాలుగుసార్లు శాసనసభ్యుడిగా, రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా సేడపట్టి ముత్తయ్య ఎన్నికయ్యారు. పెరియకుళం నుంచి లోక్‌సభకు ఎన్నికైన ముత్తయ్య అప్పటి వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో నౌకాయాన శాఖ మంత్రిగాను పనిచేశారు. 2006లో అన్నాడీఎంకే నుండి వైదొలగి డీఎంకేలో చేరారు. డీఎంకే ఎన్నికల కమిటీ అధ్యక్షుడిగా ఆ పార్టీకి సేవలందించారు. ఇదిలా ఉండగా సేడపట్టి ముత్తయ్య మృతికి రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. నాలుగుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికై 1991- 96 వరకు శాసనసభ స్పీకర్‌గా సేవలందించారని పేర్కొన్నారు. 2006లో డీఎంకే మాజీ అధ్యక్షుడు కరుణానిధి సమక్షంలో ఆయన పార్టీలో చేరి ఎన్నికల కమిటీ అధ్యక్షుడిగా తనవంతు సేవలను అందించారని తెలిపారు. ఇటీవల తాను మదురై పర్యటనకు వెళ్ళినప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముత్తయ్యను పలకరించి పరామర్శించానని, ఆయన మృతి పార్టీకి తీరనిలోటు అని  పేర్కొన్నారు.

Updated Date - 2022-09-22T13:54:20+05:30 IST