పాలేరు మాజీ ఎమ్మెల్యే భూపతిరావు మృతి

ABN , First Publish Date - 2022-09-06T10:19:28+05:30 IST

ఖమ్మం జిల్లా పాలేరు మాజీ ఎమ్మెల్యే భీమపాక భూపతిరావు(86) సోమవారం భద్రాచలంలో కన్నుమూశారు.

పాలేరు మాజీ ఎమ్మెల్యే  భూపతిరావు మృతి

భద్రాచలం, సెప్టెంబరు 5: ఖమ్మం జిల్లా పాలేరు మాజీ ఎమ్మెల్యే భీమపాక భూపతిరావు(86) సోమవారం భద్రాచలంలో కన్నుమూశారు. వయోభారం వల్ల అనారోగ్యంతో ఆయన తన నివాసంలో మృతి చెందారు. వామపక్షాల కూటమి తరపున భూపతిరావు సీపీఐ అభ్యర్థిగా 1983లో పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గన్‌మెన్‌లు, సెక్యూరిటీ సిబ్బందిని వద్దన్నారు. ఎమ్మెల్యేగా తనకు వచ్చిన జీతాన్ని పార్టీకి అందజేసి పార్టీ ఇచ్చిన రూ.800 గౌరవ వేతనంతో జీవనం సాగించారు. భూపతిరావుకు భార్య, ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. వీరిలో ఒక కుమారుడు భీమపాక నగేష్‌ ఇటీవల హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. భూపతిరావు మృతి పట్ల భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య సంతాపం ప్రకటించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడి ్డ, సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతోపాటు పలు రాజకీయపక్షాలు, ప్రజాసంఘాల నాయకులు, భూపతిరావు మృతి పట్ల సంతాపం తెలిపారు. 

Updated Date - 2022-09-06T10:19:28+05:30 IST