చూసుకోండి.. ‘ఫసక్‌’

ABN , First Publish Date - 2021-05-02T08:53:09+05:30 IST

‘మీరు ఎన్నిసార్లు అడిగినా.. ఎంత ఒత్తిడి చేసినా చంద్రబాబు పేరు మాత్రం చెప్పను. ఈ వీడియోతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదు. యూ ట్యూబ్‌లో ‘ఫసక్‌’ అని టైప్‌ చేస్తే వస్తుంది

చూసుకోండి.. ‘ఫసక్‌’

నేను యూట్యూబ్‌లో అదే చూశా.. కావాలంటే మీరు కూడా చూడండి

సీఐడీ విచారణలో మాజీ మంత్రి దేవినేని 

ఎల్లుండి రావాలని ఆదేశం, వస్తానన్న ఉమా

రైతుల కోసం జెలుకెళ్లేందుకు సిద్ధమని వ్యాఖ్య

వివేకా కేసులో సాయిరెడ్డిని ప్రశ్నించాలని డిమాండ్‌


అమరావతి, మే 1(ఆంధ్రజ్యోతి): ‘‘మీరు ఎన్నిసార్లు అడిగినా.. ఎంత ఒత్తిడి చేసినా చంద్రబాబు పేరు మాత్రం చెప్పను. ఈ వీడియోతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదు. యూ ట్యూబ్‌లో ‘ఫసక్‌’ అని టైప్‌ చేస్తే వస్తుంది. నేను అలానే చూశా. అనుమానం ఉంటే నా ట్యాబ్‌ చెక్‌ చేసుకోండి. మీరు కూడా చూడండి’’ అని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు సీఐడీ అధికారులకు స్పష్టం చేశారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్‌ వ్యాఖ్యలకు సంబంచిన వీడియోను మీడియా ఎదుట దేవినేని ఉమా తన ట్యాబ్‌లో వినిపించిన విషయం తెలిసిందే. ‘‘తిరుపతికి నేను రమ్మంటే మాత్రం ఎవరైనా వస్తారా? హైదరాబాద్‌, బెంగళూరు, ఢిల్లీలో ఉండేందుకు ఇష్టపడతారు. ఒడిశా, బిహార్‌, తిరుపతికి ఎవరూ రారు’’ అని జగన్‌ అన్నట్లు వీడియోలో ఉంది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ లీగల్‌ సెల్‌ న్యాయవాది నారాయణ రెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి జగన్‌ పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు ఉన్నాయంటూ ఫిర్యాదులో పేర్కొనడంతో ఐదు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సీఐడీ, ఉమను ఏప్రిల్‌ 29న సుదీర్ఘంగా ఒక రోజంతా విచారించింది. 


చంద్రబాబు చేయించారని చెబితే వదిలి పెడతామంటూ విచారణలో అధికారులు ఒత్తిడి చేసినట్లు ఉమ వెల్లడించారు. సోషల్‌ మీడయాలో వచ్చిన వీడియోనే తాను ప్రదర్శించాను తప్ప చంద్రబాబు లేదా మరొకరు మార్ఫింగ్‌ చేయించలేదని స్పష్టం చేసినట్లు చెప్పారు. అయితే, శనివారం నాడు మరోసారి విచారించిన దర్యాప్తు అధికారులు ఎన్ని రకాలుగా ప్రశ్నించినా దేవినేని ఈ సమాధానమే చెప్పారు. ‘‘యూ ట్యూబ్‌లో ‘ఫసక్‌’ అని టైప్‌ చేస్తే వస్తుంది.. నా ట్యాబ్‌లో అదే చూపించా.. నా కెవ్వరూ పంపలేదు’’ అని స్పష్టం చేశారు. సీఐడీ కార్యాలయానికి శనివారం ఉదయం 11గంటలకు వచ్చిన ఆయన్ను రాత్రి 8 గంటల వరకు సుమారు 9గంటల సేపు డీఎస్పీ ఆర్‌.ఎస్‌. జయసూర్య బృందం ప్రశ్నించింది. దేవినేని సమాధానంపై సంతృప్తి చెందని సీఐడీ అధికారులు ఈ నెల 4న మరోసారి విచారణకు రావాలని చెప్పడంతో ఎన్నిసార్లయినా వచ్చేందుకు సిద్ధమని చెప్పినట్టు తెలిపారు. 


విమర్శిస్తే కేసులా?

సీఐడీ విచారణ అనంతరం మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయం ముందు దేవినేని ఉమా మీడియాతో మాట్లాడారు. జగన్‌ను ఎవరు విమర్శించినా కేసులు పెడుతున్నారని, సొంత బాబాయి హత్య కేసులో ఎలాంటి పురోగతి లేదని విమర్శించారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్లపై న్యాయస్థానాన్ని ఆశ్రయించబోతున్నామని, వివేకా కేసులో ఆయన్ను తక్షణమే విచారించాలని డిమాండ్‌ చేశారు. రైతులకు ధాన్యం కొనుగోళ్లలో దళారులు మోసం చేస్తుంటే చేతగాని జగన్‌ ప్రభుత్వం చోద్యం చూస్తోందని మండిపడ్డారు. ఈ విషయంలో కూడా తనపై కేసు పెట్టుకోవచ్చని రైతుల కోసం జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. 

Updated Date - 2021-05-02T08:53:09+05:30 IST