గుమ్మనూరు బెంజ్‌పుఠాణీ!

ABN , First Publish Date - 2020-09-19T08:51:34+05:30 IST

రాష్ట్ర కార్మికశాఖ మంత్రి జయరాం మహా మాయగాడని, ఈఎ్‌సఐ కుంభకోణంలో ఆయనే ప్రధాన సూత్రధారి అని టీడీపీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆరోపించారు.

గుమ్మనూరు బెంజ్‌పుఠాణీ!

  • మంత్రి జయరాం మహా మాయగాడు 
  • ఈఎ్‌సఐ కుంభకోణం సూత్రధారి ఆయనే 
  • మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపణ 
  • ఏ14 తెలకపల్లి కార్తీక్‌ ఆయనకు బినామీ 
  • జయరాం కుమారుడికి బెంజ్‌ కారు లంచం 
  • ఆధారాలున్నాయ్‌.. కాల్‌సెంటర్‌కు ఫిర్యాదు
  • ఆ బెంజ్‌ మాది కాదు.. మంత్రి వివరణ

మహారాణిపేట(విశాఖపట్నం), సెప్టెంబరు 18: రాష్ట్ర కార్మికశాఖ మంత్రి జయరాం మహా మాయగాడని, ఈఎ్‌సఐ కుంభకోణంలో ఆయనే ప్రధాన సూత్రధారి అని టీడీపీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. విశాఖలోని ఆ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. ‘కుంభకోణంలో 14వ నిందితుడైన తెలకపల్లి కార్తీక్‌ విజయవాడ భవానీపురం ప్రాంతంలో ‘తిరుమల మెడికల్‌ ఏజెన్సీ’ పేరుతో మందుల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. గతేడాది డిసెంబరు 12న మీ మంత్రివర్గ సహచరుడు జయరాం కుమారుడు ఈశ్వర్‌కు పుట్టినరోజు సందర్భంగా కార్తీక్‌ ఖరీదైన బెంజి కారు బహుమతిగా ఇచ్చాడు. ఈఎ్‌సఐ కుంభకోణంలో నిందితుడైన వ్యక్తి.. మీ మంత్రి కొడుక్కి అంత ఖరీదైన బహుమతి ఎందుకు ఇచ్చినట్టు. అది లంచం కాదంటారా? అవినీతిని సహించనంటూ నిత్యం చెప్పే మీరు దీనికి ఏం సమాధానం చెబుతారు?’ అంటూ సీఎం జగన్‌పై అయ్యన్న ప్రశ్నలు సంధించారు.


ఈఎ్‌సఐలో భారీ కుంభకోణం జరిగిందంటూ ఏ ఆధారాలు లేకుండా మాజీమంత్రి అచ్చెన్నాయుడును అరెస్టు చేశారని, కానీ తాను చేసే ఆరోపణలకు ఫొటోలతో సహా ఆధారాలన్నీ తనవద్ద ఉన్నాయని స్పష్టం చేశారు. జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే తక్షణం దీనిపై విచారణకు ఆదేశించాలని డిమాండ్‌ చేశారు. మంత్రి జయరాంకు తెలకపల్లి కార్తీక్‌ బినామీ అని, ప్రధాన సూత్రధారి మంత్రివర్యులేనని ఆరోపించారు. అనంతరం మంత్రి అవినీతిపై అయ్యన్నపాత్రుడు మీడియా ప్రతినిధుల సమక్షంలోనే ముఖ్యమంత్రి కాల్‌సెంటర్‌కు కాల్‌చేసి ఫిర్యాదు చేశారు. వైసీపీ ప్రభుత్వం బీసీలను లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసులతో దాడులకు పాల్పడుతోందని, ఎలాంటి ఆధారాల్లేకుండా చర్యలకు పాల్పడితే వైసీపీ భూస్థాపితం కావడం ఖాయమని అయ్యన్న హెచ్చరించారు. తనకు ఎదురులేదని నియంతలా వ్యవహరించిన మాజీ ప్రధాని ఇందిరాగాంధీనే ప్రజలు తరిమికొట్టారని, నియంతలా వ్యవహరిస్తున్న జగన్‌ అంతకంటే ఎక్కువ కాదన్నారు.  



సాయం చేసినందుకే బెంజి బహుమతి

అచ్చెన్నకు క్షమాపణలు చెప్పాలి: టీడీపీ 

అమరావతి/విజయవాడ, సెప్టెబరు 18 (ఆంధ్రజ్యోతి): ఈఎ్‌సఐ ఆస్పత్రులను అడ్డుపెట్టుకొని మంత్రి గుమ్మనూరు జయరాం అయినకాడికి దోచుకొన్నారని టీడీపీ ఆరోపించింది. మంత్రి కుమారుడు ఈశ్వర్‌కు, ఈఎ్‌సఐ స్కామ్‌లో నిందితుడైన కార్తీక్‌కు సంబంధమేమిటో సాక్ష్యాధారాలతో బయటపెట్టినా, సిగ్గులేకుండా మంత్రి సమర్థించుకోవాలని చూస్తున్నారని ఆ పార్టీ ఎమ్మెల్సీలు బుద్ధా వెంకన్న, బచ్చు ల అర్జునుడు విమర్శించారు. ఏ తప్పూ చేయని అచ్చెన్నాయుడిని ఈఎ్‌సఐ స్కామ్‌లో అన్యాయంగా ఇరికించిందనే విషయం తేలిపోయిందన్నారు. జగన్‌ ప్రభుత్వం ఇప్పటికైనా అచ్చెన్నకు క్షమాపణ చెప్పాలని బుద్దా డిమాండ్‌ చేశారు. ‘మంత్రి తప్పు ఒప్పుకొని రాజీనామా చేస్తే మంచిది. లేకపోతే సీఎం ఆయన్ను పదవి నుంచి తప్పించాలి’ అని బుద్దా డిమాండ్‌ చేశారు. ఈఎ్‌సఐ కుంభకోణంలో అసలైన సూత్రధారి బెంజి మినిస్టర్‌ జయరామేనని నారా లోకేశ్‌ విమర్శించారు. 


నా కుమారుడికి సంబంధం లేదు

ఆలూరు, సెప్టెంబరు 18: ఈఎ్‌సఐ స్కామ్‌లో ముద్దాయి కార్తీక్‌ తన కుమారుడు ఈశ్వర్‌కు రూ.కోటి బెంజి కారు బహుమతిగా ఇచ్చారని మాజీ మంత్రి ఆయన్నపాత్రుడు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని కార్మికశాఖ మంత్రి జయరాం అన్నారు. బెంజి కారుకు తన కుమారుడికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా ఆలూరులో శుక్రవారం ఆయన మాట్లాడుతూ తన కుమారుడు ఈశ్వర్‌కు వ్యాపారంలో భాగంగా కార్తీక్‌తో పరిచయం ఏర్పడి ఉంటుందన్నారు. ఆయన కొన్న కారును తన కుమారుడితో ఓపెన్‌ చేయించి ఫొటోలు దిగారన్నారు. 

Updated Date - 2020-09-19T08:51:34+05:30 IST