ఎస్‌ఈసీగా జస్టిస్ కనగరాజ్
ABN , First Publish Date - 2020-04-12T08:22:07+05:30 IST
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా మద్రాస్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కనగరాజ్ నియమితులయ్యారు. ఎస్‌ఈసీగా హైకోర్టు రిటైర్డ్ జడ్జిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఆర్డినెన్స్ జారీచేసిన విషయం...
- బాధ్యతల స్వీకరణ.. గవర్నర్‌తో భేటీ
- ఎన్నికల కార్యాలయ సిబ్బందితో సమావేశం
- స్థానిక ఎన్నికల ప్రక్రియపై రేపు చర్చ!
అమరావతి/చెన్నై, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా మద్రాస్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కనగరాజ్ నియమితులయ్యారు. ఎస్‌ఈసీగా హైకోర్టు రిటైర్డ్ జడ్జిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఆర్డినెన్స్ జారీచేసిన విషయం తెలిసిందే. ఈ పదవిలో ఎవరిని నియమిస్తారన్న విషయాన్ని గోప్యంగా ఉంచింది. శనివారం జస్టిస్ కనగరాజ్ బాధ్యతలు చేపట్టే సమయంలోనే పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. సుమారు అరగంట పాటు వీరిరువురూ చర్చించారు. అనంతరం రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో సిబ్బందితో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ గురించి సిబ్బందితో ఆయన సోమవారం చర్చించే అవకాశం ఉంది.
మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి శ్యామలరావు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్ ఆయనతో భేటీ అయ్యారు. మీడియాతో ముచ్చటించడానికి ఆయన ఆసక్తి చూపలేదు. ఎస్‌ఈసీగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ కనగరాజ్‌ను వైసీపీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి దుశ్శాలువ కప్పి సన్మానించారు. నూతన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను పురపాలకశాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ జేఎస్సార్కేఆర్ విజయ్‌కుమార్, డీజీపీ గౌతమ్ సవాంగ్, విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు మర్యాదపూర్వకంగా కలిశారు.
69వేలకు పైగా తీర్పులు
ఎస్‌ఈసీగా నియమితులైన జస్టిస్ వి.కనగరాజ్‌కు దాదాపు 69వేలకు పైగా తీర్పులిచ్చిన రికార్డు ఉంది. తమిళనాడులోని వేలూరులో జన్మించిన ఆయన 1972లో మద్రాసు న్యాయకళాశాల నుంచి న్యాయశాస్త్రంలో పట్టభద్రులయ్యారు. 1973లో మద్రాసు బార్ కౌన్సిల్‌లో నమోదు చేసుకుని సేలంలో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. సివిల్, క్రిమినల్ కేసుల్లో పటిష్ఠమైన వాదనలతో మంచి లాయర్‌గా పేరొందారు. 1997, ఫిబ్రవరి 24న హైకోర్టు జడ్జిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. విద్య, సామాజిక న్యాయం, సామాజిక ఆర్థిక పరిస్థితులపై ప్రభావం చూపే కేసులతో పాటు ప్రత్యేకించి మహిళ, శిశు సంక్షేమం, బలహీనవర్గాలకు సంబంధించిన కేసుల్లో ఆయన వెలువరించిన పలు విప్లవాత్మక తీర్పులు అన్ని వర్గాల ప్రశంసలందుకున్నాయి.