ఆసక్తి పని మీద ఉండాలి!

ABN , First Publish Date - 2020-09-11T05:30:00+05:30 IST

మనం అనేక రకాల పనులు చేస్తూ ఉన్నాం. ఈ పనులు చేయడంలో, దాని ఫలితాన్ని ఆశించడంలో, కర్మ వాసనలు జన్మజన్మలూ మనను వెంటాడుతాయి...

ఆసక్తి పని మీద ఉండాలి!

పోటీలో పాల్గొనడమే మనం చేయాల్సింది. ఫలితం సంగతి తరువాత! నెగ్గడం కోసం కాదు, పోటీలో  పాల్గొనడం కోసం, ఆనందం కోసం పాల్గొనాలి.


మనం అనేక రకాల పనులు చేస్తూ ఉన్నాం. ఈ పనులు చేయడంలో, దాని ఫలితాన్ని ఆశించడంలో, కర్మ వాసనలు జన్మజన్మలూ మనను వెంటాడుతాయి. ఆ రహస్యాన్ని భగవద్గీత నాలుగో అధ్యాయం పద్దెనిమిదో శ్లోకంలో శ్రీకృష్ణపరమాత్మ చెప్పాడు.

  • కర్మణ్యకర్మ యః పశ్యేత్‌ అకర్మణి చ కర్మ యః
  • స బుద్ధిమాన్‌ మనేష్యేషు స యుక్తః కృత్స్నకర్మకృత్‌!

తెలివైన వాడు, సూక్ష్మదృష్టి కలిగిన వాడు పని చేస్తూ కూడా తాను ‘పని చేయడం లేదు’ అని తెలుసుకుంటాడు. ‘పని చేయడం లేదు’ అన్నట్టు కనిపిస్తూ కూడా పని చేస్తున్నట్టు తెలుసుకుంటాడు. లోకం దృష్టి ఒకటుంటుంది. మన దృష్టి ఒకటుంటుంది. సూర్యోదయం, సూర్యాస్తమయం అంటాం. కానీ సూర్యుడు ఎప్పుడూ ఉదయించడు, అస్తమించడు. సూర్యుడు ఒకే రకంగా ప్రకాశిస్తున్నాడు. ‘సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు’ అన్నది మన భావన. లోకం దృష్టిలో సూర్యుడు ఉదయిస్తున్నాడు, మధ్యాహ్నం విజృంభిస్తున్నాడు, సాయంత్రం చల్లబడుతున్నాడు. ఇవన్నీ ఆయన దృష్టిలో ‘అకర్మ’. ఒక్కోసారి మబ్బులు కమ్మినప్పుడు సూర్యుడు కనిపించడు. అప్పుడు సూర్యుడికి మబ్బులు కమ్మాయి అంటాం. కానీ అక్కడ సూర్యుడిని మబ్బులు కమ్మాయా? అంటే లేదు.


మన కంటికి మబ్బులు కమ్మాయి. మన దృష్టిలో సూర్యుడికి మబ్బులు కమ్మాయి. కానీ సూర్యుడి దృష్టిలో కాదు. అదే కర్మలో ‘అకర్మ’. అలాగే లోకం కోసం మనం పనిచేస్తూ కూడా ఫలితం మీద ఆసక్తిని తగ్గించుకోవచ్చు. ఇదే ‘కర్మణి అకర్మ’. పని మీద ఆసక్తి పెట్టి, ఫలితం మీద ఆసక్తి లేకుండా చూసుకోవాలి. ఒకసారి నిర్ణయించుకున్నాక పోటీలో పాల్గొనడమే మనం చేయాల్సింది. ఫలితం సంగతి తరువాత! నెగ్గడం కోసం కాదు, పోటీలో పాల్గొనడం కోసం, దానివల్ల కలిగే ఆనందం కోసం పాల్గొనాలి. ఇది గ్రహించగలిగితే విద్యార్థులు ఆందోళన లేకుండా, హాయిగా ఉంటారు. ‘‘అకర్మణి చ కర్మ’’... ఒక్కోసారి లోకానికి మనం ఏం పనిచేయనట్టుగా కనిపిస్తాం! కానీ లోపల స్పందిస్తూనే ఉంటాం. ఎప్పుడూ లోకం దృష్టి వేరు, అంతర్‌దృష్టి వేరు. అన్ని పనులూ చేస్తున్నప్పటికీ, బుద్ధిమంతుడు, యుక్తి కలిగిన వారు, యోగం తెలిసిన వారు దాని గురించిన ఆందోళనలు, వాసనలు అంటకుండా ఉంటారు.


-గరికిపాటి నరసింహారావు


Updated Date - 2020-09-11T05:30:00+05:30 IST